చిన్నారులను వణికిస్తున్న స్కార్లెట్ ఫీవర్.. హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్!!
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో చిన్నారులను స్కార్లెట్ ఫీవర్ వణికిస్తోంది. భాగ్యనగరంలో ఆందోళనకరంగా స్కార్లెట్ ఫీవర్ వ్యాప్తి కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో చిన్నారులు జ్వరం బారిన పడుతూ ఆసుపత్రులకు చేరుతున్నారు. ఆసుపత్రులలో స్కార్లెట్ ఫీవర్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఒకపక్క పరీక్షలు ప్రారంభమైన సమయంలో, మరోపక్క చిన్నారులను స్కార్లెట్ ఫీవర్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
ఆసుపత్రులలో జ్వరంతో చికిత్స పొందుతున్న ప్రతి పదిమంది పిల్లలలో ఐదారుగురు పిల్లలు స్కార్లెట్ ఫీవర్ తోనే బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. గతంలో కూడా ఈ ఫీవర్ వచ్చినప్పటికీ, ఇటీవల కాలంలో ఈ కేసులు పెరగడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. అయితే చిన్నారులు జ్వరంతో బాధపడుతూ, స్కార్లెట్ ఫీవర్ లక్షణాలను కలిగి ఉన్నట్లయితే వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని సూచిస్తున్నారు.

వైరల్ ఫీవర్ గా భావించి, వైద్యం చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఆపై సమస్య తీవ్రమై ఆసుపత్రిలో చర్చే వరకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్కార్లెట్ ఫీవర్ అనేది స్ట్రెప్టోకోకస్ ఫారింగైటిస్ బ్యాక్టీరియా కారణంగా సోకుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా పక్కవారికి అంటుకుంటుంది. ఆ తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా పక్కవారి ముక్కు, నోటి ద్వారా లోనికి వెళ్లి జ్వరానికి కారణం అవుతుంది.
ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న చాలా స్కూళ్లలో చిన్నారుల తల్లిదండ్రులకు దీనిపైన అవగాహన కల్పించేందుకు పాఠశాల యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి. జ్వరంతో బాధపడుతున్న చిన్నారులను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని, పాఠశాలకు పంపించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ జ్వరం ఐదు సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లల్లో కనిపిస్తుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.
ఇక స్కార్లెట్ ఫీవర్ తో బాధపడే చిన్నారుల లక్షణాలను గమనించినట్లయితే 102 డిగ్రీల జ్వరం వస్తుంది. అకస్మాత్తుగా గొంతు నొప్పి, కడుపునొప్పి, శరీరంపై దద్దుర్లు, తలనొప్పి, వికారం, వాంతులు, నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారడం, గొంతు, నాలుకపై తెల్లని పూత, ట్రాన్సిల్స్ ఎరుపు రంగులో పెద్దవిగా కనిపించడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, సరైన సమయంలో చికిత్స జరిగితే దీని నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications