స్థానిక ఎన్నికల్లో పోటీకి వీరికి అర్హత లేదా, కొత్త ట్విస్ట్..!?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఐదు దశల్లో జరగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. ఇదే సమయంలో ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీకి అర్హులా కాదా అనేది సస్పెన్స్ గా మారింది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో రాజకీయంగా రాష్ట్రంలో మరో సారి ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని రాణికుముదిని తెలిపారు. అక్టోబర్ 23న తొలి విడత, 27వ తేదీన మలి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత పోలింగ్ నవంబర్ 4వ తేదీన, మూడో విడత నవంబర్ 8వ తేదీన నిర్వహిస్తామన్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని వివరించారు. నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని రాణికుముదిని వివరించారు.

అదే విధంగా సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లను గుర్తించామన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి ఆదివారం సాయంత్రమే గెజిట్లు విడుదల చేసినట్లుగా వివరించారు. అన్ని జిల్లాలు, మండలాల్లో రిజర్వేషన్ల ఖరారు జరిగిందన్నారు. ఇక.. షెడ్యూల్ విడుదల అవుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అధికారిక కార్యక్రమాల నిర్వహణ లో ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పార్టీలు నడుచుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో పోటీకి అర్హత విషయంలో మరో నిబంధన ఇప్పుడు సస్పెన్స్ గా మారుతోంది.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులని తెలంగాణ ప్రభుత్వం గంలో చెప్పింది. అయితే, ముగ్గురు పిల్లల నిబంధనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తివేశారు. కానీ తెలంగాణలో మాత్రం ముగ్గురు పిల్లల నిబంధన ఇంకా మారలేదు. దీంతో పోటీకి దిగాలనుకునేవారు ఆలోచనలో పడ్డారు. అయితే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసిందో లేదోనని ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న వారిలో టెన్షన్ కొనసాగుతోంది. దీని పైన స్పష్టత ఇస్తే.. పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎవరికి అర్హత ఉందీ.. ఎవరికి లేదనేది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications