ట్రాఫిక్ కష్టాలకు చెక్: 33 ఎకరాల భూమి ఇచ్చేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్(Secunderabad cantonment board) తాజా నిర్ణయంతో హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్డును విస్తరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అంగీకరించింది.
ఎన్‌హెచ్-44 ప్యారడైజ్ నుంచి సుచిత్ర, ఎన్ హెచ్ 1 జింఖానా గ్రాండ్ - హకీంపేట్ వరకు రోడ్డు విస్తరణకు 33 ఎకరాల భూమిని ఇచ్చే తీర్మానాన్నిఆమోదించినట్లు కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో మధుకర్ నాయక్ తెలిపారు. ఆర్మీ, ప్రైవేటు, బీ2 కలిపి మొత్తం 124 ఎకరాల కేటాయింపు విషయం ఆయా శాఖలు చూస్తాయని ఆయన వెల్లడించారు.

స్కైవేలు, మెట్రో కారిడార్, రహదారుల విస్తరణ కోసం రక్షణ శాఖకు చెందిన మొత్తం 157 ఎకరాలు ఇవ్వాలని గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ పరిధిలోని 33 ఎకరాలు ఇచ్చేందుకు కంటోన్మెంట్ బోర్డ్ అంగీకారం తెలిపినట్లు సీఈవో మధుకర్ నాయక్ పేర్కొన్నారు.
33 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 329 కోట్లను ఇస్తే కంటోన్మెంట్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. కంటోన్మెంట్ బోర్డ్ ఇచ్చిన భూముల్లో రోడ్ల విస్తరణతో బోయిన్‌పల్లి, తిరుమలగిరి మార్గాల్లో ట్రాఫిక్ భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉదయం, సాయంత్రం సమయాల్లో వాహనాలు రోడ్లపైనే చాలా సేపు నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజా నిర్ణయంతో వాహనదారులకు, ప్రయాణికులకు ఊరట లభించనుంది.
కంటోన్మెంటో నిర్ణయం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది.'హైదరాబాద్ నగర పరిధిలోని రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవేలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించింది. తొమ్మిదేండ్లుగా కేంద్రంతో చేస్తున్న పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. పట్టువదలని విక్రమార్కుల్లా సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సల్పిన పోరుకు రక్షణ శాఖ దిగొచ్చింది. కంటోన్మెంట్ పరిధిలోని రాజీవ్ రహదారి, 44వ జాతీయ రహదారిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రెండు 'డబుల్ డెక్కర్ మెట్రో' స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ 33 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అని బీఆర్ఎస్ పేర్కొంది.












Click it and Unblock the Notifications