ఈసారీ నిరాశే: బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత చకిలం అనిల్ గుడ్‌బై
బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నల్గొండకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు చకిలం అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నల్గొండకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు చకిలం అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా బీఆర్ఎస్ అధిష్టానానికి పంపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుని ఉన్నందుకు కేసీఆర్ నట్టేట ముంచారని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అనిల్ కుమార్ తెలిపారు. అవసరమైతే నల్గొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడానికి సిద్ధంగా ఉన్ననట్లు చెప్పారు. కాగా, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించారు అనిల్ కుమార్.. అయితే, అధిష్టానం ఆయనను విస్మరించడంతో పార్టీపై అసంతృప్తికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలంగాణ ఉద్యమంలో, పార్టీ విస్తరణలో అనిల్ కుమార్ క్రియాశీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీలో 22 ఏళ్లుగా పనిచేసిన అనిల్ కుమార్.. ప్రతి ఎన్నికల్లో కూడా నల్గొండ అసెంబ్లీ టికెట్ ఆశించినా ఆయనకు నిరాశే ఎదురైంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపిస్తే.. ఎమ్మెల్సీ ఇస్తానని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కి పిలిపించుకుని హామీ ఇచ్చారని అనిల్ కుమార్ ఇప్పటికే పలుమార్లు మీడియాకు వెల్లడించారు. కంచర్ల గెలుపు కోసం పనిచేసినా.. కేసీఆర్ మాత్రం తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అనిల్ కుమార్ వాపోయారు. ఈ నేపథ్యంలోనే తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాగా, ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో సదస్సులు, ఇతర కార్యక్రమాలతో ఎమ్మెల్సీ టికెట్ కోసం అనిల్ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం ఆయనను పరిశీలనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినా పెద్ద ప్రయోజనం లేదని భావించిన అనిల్ కుమార్.. ఆ పార్టీని వీడినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఏ పార్టీలో వెళతారనేది త్వరలోనే తేలనుంది. కాంగ్రెస్ పార్టీలోనే చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.












Click it and Unblock the Notifications