తెలంగాణలో కొత్త ‘టీఆర్ఎస్’ పార్టీ సంచలనం
వివిధ రాజకీయ పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్న బడా నాయకులు, కొందరు ప్రజాప్రతినిధులు కలిసి తెలంగాణలో టీఆర్ఎస్ పేరుపై దృష్టి సారించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్).. ఇటీవల భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్.. ఇప్పుడు దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్‌గా మారింది. అయితే, టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడంతో.. టీఆర్ఎస్ పేరుపై కొందరు రాజకీయ నాయకులు కన్నేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

తెలంగాణలో కొత్త ‘టీఆర్ఎస్'
వివిధ రాజకీయ పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్న బడా నాయకులు, కొందరు ప్రజాప్రతినిధులు కలిసి తెలంగాణలో టీఆర్ఎస్ పేరుపై దృష్టి సారించారు. టీఆర్ఎస్ పేరుతో రాజకీయ పార్టీని పెట్టాలనే ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పేరు అనేది తెలంగాణలో క్షేత్రస్థాయి వరకు పాతుకుపోయింది. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈ రాజకీయ నేతలు పావులు కదుపుతున్నారు.

‘టీఆర్ఎస్' పేరుపై కన్నేసిన బడా రాజకీయ నేతలు
కరీంనగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు నాయకులు టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టాలనే ఆలోచనలు చేస్తున్నారు. వీరికి కొందరు బడా నేతలు పరోక్షంగా సహకరిస్తున్నట్లు సమాచారం. ప్రముఖంగా నల్గొండకు చెందిన బడా నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిని టీఆర్ఎస్ పేరుతో పెట్టే పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ గుర్తులు ఎలా ఉన్నా.. పార్టీ పేరు మాత్రం టీఆర్ఎస్ వచ్చేలా చూసుకుంటున్నట్లు తెలిసింది.

తెలంగాణలో రాజకీయాల్లో కలకలం రేపుతున్న కొత్త ‘టీఆర్ఎస్'
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే, టీఆర్ఎస్ పేరుతోనే అంటే.. తెలంగాణ రైతు సమితి లేదా తెలంగాణ రక్షణ సమితి లేదంటే తెలంగాణ రాజ్య సమితి, ఇంకా తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
వీటన్నింటికి టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతో బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌కు ఇది మరో తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లను సాధ్యమైనంత వరకు చీల్చేందుకు ఈ పేరు అనుకూలించవచ్చంటున్నారు. మరి ఈ కొత్త 'టీఆర్ఎస్' ఎలాంటి రాజకీయ పరిణామాలకు తెరతీస్తుందో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications