జెట్టక్క పోవాలని.. చీపుర్లు, చాటలతో కొట్టుకునే వింత ఆచారం!!
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లోనూ ఎన్నో వింత ఆచారాలు కొనసాగుతున్నాయి. అంతరిక్షంపై కాలు మోపుతున్న నేటి రోజుల్లోనూ ఇంకా పాతకాలం నాటి విశ్వాసాలు పాటిస్తున్న వారు లేకపోలేదు. హోలీ రోజున పిడిగుద్దులతో కొట్టుకునే వింత ఆచారం ఒక చోట ఉంటే.. కర్రలతో కొట్టుకునే ఆచారం మరోచోట ఉంది.
అంతేకాదు ఊరికి కీడు సోకిందని, ఊర్లో వాళ్లు జబ్బుల బారిన పడుతున్నారు అని ఊరు వదిలి వెళ్ళి బయట వంటలు చేసుకుని ఒకటి రెండు రోజుల తర్వాత మళ్ళీ ఊరికి వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక అటువంటి వింత ఆచారమే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాత దామరాజు పల్లి గ్రామంలో గ్రామస్తులు పాటిస్తున్నారు.

పాత దామరాజు పల్లి గ్రామంలో ఊరుకు సోకిన కీడును పొలిమేర దాటించడానికి గ్రామస్తులు చాటలు, చీపుర్లతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఊరుకు సోకిన కీడును వారు జట్టక్క అని పిలుస్తారు. ఇక జట్టక్కను పారద్రోలడం కోసం గ్రామస్తులంతా ఒకరినొకరు చీపుర్లతో, చాటలతో కొట్టుకుంటూ గ్రామ పొలిమేర వరకు వెళ్లి అక్కడ వాటిని పారవేసి వస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఆచారాన్ని వాళ్లు పాటించటం ఆనవాయితీగా వస్తుందని చెబుతున్నారు.
ఈ ఆచారాన్ని ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పాటిస్తామని, ఈ ఆచారాన్ని పాటించకుండా పోతే ఖచ్చితంగా ఊరికి కీడు జరుగుతుందని వారు అంటున్నారు. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఈ తంతు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని వాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ ఆచారాన్ని పాటించాల్సిందేనని వారు తేల్చి చెబుతున్నారు. పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఈ ఆచారాన్ని తాము కూడా పాటిస్తామని చెప్పటం గమనార్హం.












Click it and Unblock the Notifications