బీజేపీలో కుర్సీ కా కిస్సా: బండి సంజయ్ కు సీనియర్ల షాక్!!
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై సీనియర్లు షాకింగ్ తిరుగుబాటు చేస్తున్నారు. అదును చూసి దెబ్బ కొడుతున్నారు.
తెలంగాణ బిజెపిలో ఊహించని విధంగా బండి సంజయ్ పై తిరుగుబాటు కొనసాగుతుంది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో, బండి సంజయ్ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అరవింద్ బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదంటూ హితవు పలికారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హోదా అంటే పవర్ సెంటర్ కాదని, అందరినీ సమన్వయం చేసే బాధ్యత అంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలతో బిజెపిలో అంతర్గత పోరు బయటకు వచ్చింది. ఇక అరవింద్ వ్యాఖ్యలకు కొందరు బిజెపి పెద్దలు కూడా వత్తాసు పలికి బండి సంజయ్ పై దుమ్మెత్తి పోశారు. బిజెపిలో అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఎందుకు జరిగాయి? అసలు బిజెపిలో అకస్మాత్తుగా బయటపడ్డ ఈ ముసలానికి కారణం ఏమిటి? అన్నది అందరినీ ఆలోచించేలా చేస్తుంది.

సీనియర్లకు మింగుడు పడని బండి సంజయ్ వ్యవహార శైలి
ఇక అసలు విషయం ఏమిటంటే బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీకాలం పూర్తయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బండి సంజయ్ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లడానికి బిజెపి అధినాయకత్వం ఆసక్తి చూపిస్తుందని గత కొంతకాలంగా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ కూడా బండి సంజయ్ సాధ్యం వైపే మొగ్గు చూపారు. అయితే మోనోపాలీగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ వ్యవహారం బిజెపిలో కొందరు సీనియర్ నాయకులకు మింగుడు పడడం లేదు. దీంతో ధర్మపురి అరవింద్, పేరాల శేఖర్ రావు వంటి కొందరు నాయకులు బాహాటంగానే బండి సంజయ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. బండి సంజయ్ వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ హైకమాండ్ కు బండిపై ఫిర్యాదుల వెల్లువ
అయితే బండి సంజయ్ పదవీకాలం పూర్తి కావడంతో, ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఢిల్లీ లోని అధిష్టానం నుండి ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సమయంలో బండి సంజయ్ పై తీవ్రంగా బయటకు వస్తున్న వ్యతిరేకత రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కు బాధ్యతలు అప్పగిస్తే వచ్చే ఎన్నికలలో కొందరు సీనియర్లు సహకరించే అవకాశం లేదు అన్న భావనను తీసుకువస్తుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ సొంత ఇమేజ్ ను పెంచుకోవడానికి పనిచేశారే తప్ప, అందరినీ కలుపుకుపోయేలా పని చేయలేదని సీనియర్ల నుండి విముఖత వ్యక్తం అవుతుంది. అందరినీ కలుపుకొని వెళ్లడం లేదన్న ఫిర్యాదులు అనేకం బిజెపి హై కమాండ్ దృష్టికి చేరాయి.

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా బండి పదవీకాలం పొడిగిస్తారా?
ఇక బండి సంజయ్ వ్యవహార శైలిపై బిజెపిలో చేరిన పలువురు సీనియర్ నాయకులు అసహనంతో ఉన్నారని సమాచారం. ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ను పొడిగించడం ఇష్టం లేదని తమ సంకేతాలను హై కమాండ్ దృష్టికి పంపించినట్లు తెలుస్తుంది. బండి సంజయ్ కొనసాగింపును అడ్డుకోవాలని, బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చాలామంది బిజెపి సీనియర్లు అధిష్టానం వద్ద గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతారా? లేదా అన్న ఉత్కంఠ కనిపిస్తుంది. అసలు బిజెపిలో ముసలం వెనుక బిగ్ రీజన్ ఇదేనన్న చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications