తెలంగాణలో టీడీపీ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించిన చంద్రబాబు
ఏపీ ఎన్నికల్లో చరిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం-జనసేన-బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకు 21, బీజేపీకి 3 సీట్లు రాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు దక్కాయి. లోక్ సభ ఫలితాల్లో టీడీపీకి 16, జనసేనకు 2, బీజేపీకి 3, వైసీపీకి 4 వచ్చాయి. ఏపీకి ముఖ్యమంత్రిగా ఈనెల 12వ తేదీన మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు తన దృష్టిని తెలంగాణపై సారించారు. ఆ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి మాస్టర్ ప్లాన్ ను అమలు చేయబోతున్నారు.
టీడీపీకి పూర్వ వైభంపై దృష్టి
తెలంగాణలో పార్టీని పునర్నించాలనే నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు తెలంగాణకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంపై దృష్టిపెడతానని హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెరో 8 స్థానాలను దక్కించుకోగా హైదరాబాద్ నుంచి ఎంఐఎం విజయం సాధించింది. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రాంతీయ వాదంతోపాటు సెంటిమెంట్ రాజకీయాలు ప్రస్తుతం నడవకపోవడం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీ పేరు మార్చడం కూడా బీఆర్ఎస్ కు కలిసిరావడంలేదు. ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు.

బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా..
బీఆర్ఎస్ స్థానాన్ని తెలుగుదేశం భర్తీ చేసేలా చంద్రబాబు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పార్టీని నేతలు వీడిపోయారుకానీ కార్యకర్తలు వీడలేదు. వారంతా అలాగే ఉన్నారు. ఈ సమయంలో పార్టీ ఎదుగుదలపై దృష్టిపెట్టడం సరైన నిర్ణయమని ఆయన భావిస్తున్నారు. కేంద్రంలో కూడా తెలుగుదేశం మద్దతు కీలకం కావడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లిన టీడీపీ నేతలంతా భవిష్యత్తు కోసం ఆలోచించి తిరిగి టీడీపీలోకి వస్తారనే అంచనాలున్నాయి.
దీనిపై త్వరలోనే తెలంగాణ పార్టీ నేతలతో మరోసారి చంద్రబాబు సమగ్ర ప్రణాళికా వ్యూహంతో భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి స్థానం ఖాళీగా ఉంది. అధ్యక్షుడిని నియమించడంతోపాటు పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. అవసరమైతే తనతో నిరంతరం టచ్ లో ఉండాలని, పార్టీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఓ ఇన్ ఛార్జిని కూడా నియమిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications