నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: వాడీవేడిగా సాగనున్న ఉభయసభలు
హైదరాబాద్: నేటి(గురువారం) నుంచి నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలలే ఉండటంతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు తగిన బదులు ఇచ్చేందుకు అధికార పక్షం కూడా సిద్ధమైంది.
ఆగస్టు 3 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు వారం కంటే తక్కువ రోజులే సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12న ముగిశాయి. ఆరు నెలల్లో కనీసం ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున.. గురువారం నుంచి జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.
మూడు, నాలుగు రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చునని భావిస్తున్నారు.

గురువారం ఉదయం కంటోన్మెంట్ దివంగత శాసనసభ్యుడు సాయన్నకు సంతాపం వ్యక్తం చేయనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. అందులో సమావేశాలు ఎన్నిరోజులు జరపాలనే అంశం ఖరారు కానుంది. ఎన్నికలు నవంబరు లేదా డిసెంబరులో జరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఇవే చివరి సమావేశాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ... అసెంబ్లీ, మండలిలోనూ వాడీవేడిగా చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యాయి.
వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కాంగ్రెస్, బీజేపీ వ్యూహ రచన చేస్తుండగా.. విపక్షాల ఎత్తులను తిప్పికొట్టడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సభా వేదికగా ప్రజల ముందుంచాలని అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రతివ్యూహం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలు, వరదలకు ప్రాణ, పంట నష్టం, ధరణి, డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు వంటి అంశాలను ప్రస్తావించాలని ప్రతిపక్షాలు ప్రణాళిక చేస్తున్నాయి.
మరోవైపు, ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ వైఖరి, రాష్ట్రానికి కేంద్ర సాయం వంటి అంశాలను లేవనెత్తి విపక్షాలపై ఎదురుదాడి చేసేందుకు అధికార పార్టీ రెడీ అవుతోంది. మూడు, నాలుగు రోజుల పాటు గత సమావేశాలకు భిన్నంగా వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ విలీనం సహా గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులను మళ్లీ సభలో పెట్టి ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ చర్చ సందర్భంగా కేంద్రం, గవర్నర్ వ్యవస్థ, బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రైతు బీమా, ఆర్టీసీ విలీనం వంటి అంశాలను అధికార పక్షం ప్రస్తావించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications