నాగార్జునను టార్గెట్ చేసింది అతనేనా?
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం ట్రోలింగ్ చేసింది. అసభ్యకర పదజాలంతో పోస్టులు పెట్టడంతో మంత్రికి మండిపోయింది. వాటిని అదుపు చేయాల్సిన కేటీఆర్ కార్యకర్తలను దుబాయ్ కు పంపించి అక్కడి నుంచి పోస్ట్ లు పెట్టిస్తున్నాడంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ క్రమంలో ఆమె అక్కినేని నాగార్జున కుటుంబాన్ని బయటకు లాగింది. నాగచైతన్య-సమంత లాంటి చక్కటి జంట విడిపోవడానికి కారకుడు కేటీఆర్ అని, తెలుగులో చాలామంది హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశాడంటూ మండిపడింది. ఈ క్రమంలో మరికొన్ని వ్యాఖ్యలు చేయగా సినీ పరిశ్రమ ముక్తకంఠంతో తీవ్రంగా వాటిని ఖండించింది.
నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా
అక్కినేని నాగార్జున సురేఖ పై రూ.100 కోట్లకు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అందులో సురేఖ మాట్లాడిన మాటలను అక్షరం పొల్లుపోకుండా చేర్చారు. కొంతకాలంగా నాగార్జున కుటుంబం వివాదాలకు నిలయంగా నిలుస్తోంది. ఆయన ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఎన్ కన్వెన్షన్ ను కూల్చేశారు. ఇప్పుడు సురేఖ మాట్లాడిన మాటలతో పరువుకు భంగం వాటిల్లింది. రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జునను లక్ష్యంగా ఎంచుకున్నట్లు కనపడుతోంది. గతంలో నాగార్జున బీఆర్ఎస్ పార్టీతో ఎంతో సన్నిహితంగా మెలిగారు.

కేటీఆర్ తో స్నేహం
కేటీఆర్ తో ఎంతో స్నేహంగా ఉండేవారు. కలిసి వ్యాపారం చేశారా? లేదా? అనేది వారికే తెలియాలి. అది వేరే విషయం. నాగార్జునవైపు నుంచి కేటీఆర్ మూలాలను నరుక్కుంటూ రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయడానికి కూడా హైడ్రాను ఉపయోగించుకుంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు మీడియా నుంచి ఎదురైనప్పుడు కూడా నాగార్జున చాలా సున్నితంగా వాటిని తోసిపుచ్చుతుంటారు. ఆయన ఏ పార్టీకి మద్దతిచ్చినట్లు కనపడరుకానీ అధికారంలో ఉన్న పార్టీ నేతలతో మాత్రం సఖ్యతగా ఉంటుంటారు. ఏపీలో వైఎస్ జగన్ తో కూడా ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. ఇంతటితో నాగార్జున ఇష్యూ అనేది ముగిసిపోతుందా? లేదంటే భవిష్యత్తులో నాగార్జునకు సంబంధించిన మరిన్ని విషయాలను ఏమైనా ప్రభుత్వం బయటకు తీసుకువస్తుందా? అనేదానికి భవిష్యత్తులోనే సమాధానం దొరకనుంది.












Click it and Unblock the Notifications