‘ఇట్స్ ఫన్నీ’:ఆమ్రపాలి తడబాటు ప్రసంగంపై సీఎస్ ఆరా, కలెక్టర్ వివరణ, ‘పెళ్లి కోసం సెలవు’
హైదరాబాద్: ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకల్లో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కాటా చేసిన తడబాటు, నవ్వుల ప్రసంగంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎస్పీ సింగ్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఆమ్రపాలితో ఫోన్‌లో మాట్లాడారు.
గణతంత్ర దినోత్సవం రోజున హన్మకొండలోని పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ ఆమ్రపాలి తన ప్రసంగం మధ్యలో అకారణంగా నవ్వడం, గణాంకాల దగ్గర తడబడటం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

సీఎస్‌కు వివరణ
గణతంత్ర దినోత్సవ ప్రసంగం సమయంలో తడబాటుపై ఆరా తీశారు. కొన్ని పదాలు పలకడంలో ఇబ్బంది ఎదురైందని ఆమె సీఎస్‌కు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ఆమె వివరణతో అంశానికి తెరపడినట్లైయింది.
Recommended Video


పునరావృతం కాదు..
కలెక్టర్ పదవిలో ఉండి హుందాగా వ్యవహరించాలని సీఎస్ .. ఆమ్రపాలికి సూచించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ఆమ్రపాలి సీఎస్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.

మరుగుదొడ్ల గణాంకాల సందర్భంలో
మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. వెనక్కి తిరిగి నవ్వేశారు. ‘ఇట్స్ ఫన్నీ' అని వ్యాఖ్యానించడం మైకులో వినిపించింది. కలెక్టర్ ప్రసంగం ఇలా సాగడంతో అక్కడివచ్చినవారు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు.

అభివృద్ధిపైనా
వరంగల్ జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తోందిన కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. ఓడీఎఫ్ జిల్లాగా మారుతోందని, పలు అవార్డులు కూడా వచ్చాయని చెప్పారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని ఆమ్రపాలి తన గణతంత్ర ప్రసంగంలో వివరించారు.

పెళ్లి సెలవులో..
కాగా, ప్రస్తుతం తన పెళ్లి పనులతో ఆమ్రపాలి సెలవులో ఉన్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఢిల్లీ ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మతో ఆమ్రపాలికి నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 18న సమీర్ శర్మతో పెళ్లి జరిపేందుకు పెద్దలు నిర్ణయించారు. ఫిబ్రవరి 23న వరంగల్ కలెక్టర్ బంగ్లాలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పురప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications