తెలంగాణ దసరా సెలవు తేదీలో మార్పు
హైదరాబాద్: దసరా పండగ సెలవు తేదీలో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవును అక్టోబర్ 23కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేగాక, అక్టోబర్ 24వ తేదీని కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రోజులు ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు ఉంటుందని స్పష్టం చేసింది.
అక్టోబర్ 25వ తేదీని ఆప్షన్ హాలీడే ఇచ్చింది. వాస్తవానికి దసరా పండగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్ సభ అక్టోబర్ 23న దసరా పండగను నిర్వహించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వం విజయ దశమి సెలవును మార్చింది. ఇంతకుముందు ప్రకటించిన సెలవును కూడా కొనసాగించింది.

కాగా, విద్యార్థులకు సెలవులతోపాటు మిగితా వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం చెప్పింది. బతుకమ్మ ప్రారంభ రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు దినంగా.. అక్టోబర్ 22న దుర్గాష్టమి సెలవు ఇచ్చింది. పండగ నేపథ్యంలో పాఠశాలలకు 13 రోజులపాటు సెలవులు ఇవ్వగా.. జూనియర్ కాలేజీలకు ఏడు రోజులు సెలవులు ఉండనున్నాయి.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులు ఇవ్వగా.. 26న కాలేజీలు తెరచుకోనున్నాయి. జూనియర్ కాలేజీలకు దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది.
దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా 13 రోజుల దసరా సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతోపాటు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగితా పండగల సెలవులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా దసరా తర్వాత వచ్చే దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది. డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ సెలవులను ఐదు రోజులు ఇచ్చింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజులపాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని, ఇతర స్కూళ్లకు మాత్రం ఒక్క రోజు సెలవు ఉంటుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications