తెలంగాణలో స్థానిక ఎన్నికలు రద్దు - ఎన్నికల సంఘం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా వేడెక్కాయి. అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం అధికారికంగా గెజిట్ జారీ చేసింది. గతనెల 29న విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
ఎన్నికల నిలుపుదలకు ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులే. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రస్తుత నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు నిలిచిపోనుంది.ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చిన ధర్మాసనం, తదుపరి విచారణను ఏకంగా ఆరు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో స్థానిక ఎన్నికల హడావిడి ఇప్పట్లో కనిపించదు. ఇప్పటికే ఎన్నికలకు సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీసీ సంఘాలు దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు స్తంభించనుంది. తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందోనని తెలంగాణ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.












Click it and Unblock the Notifications