తెలంగాణా నయాగరా.. అందాలతో బందీ చేస్తున్న బొగత.. ఎలా వెళ్ళాలంటే!
చలికాలం వచ్చినప్పటికీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ఎగువన కురుస్తున్న వర్షాల ధాటికి తెలంగాణ రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక జలపాతాలకు భారీగా నీరు చేరి అందమైన ప్రకృతి దృశ్యాన్ని కళ్ళముందు నిలుపుతున్నాయి. దీంతో అక్టోబర్ మాసంలో చాలామంది తెలంగాణలోని జలపాతాల సోయగాలు చూడడానికి అనేక ప్రాంతాలకు వెళుతున్నారు. ఇక తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన జలపాతాలలో తెలంగాణ నయాగారాగా పేరుగాంచిన బొగత జలపాతం అన్నింటికంటే ముఖ్యమైనది.
పర్యాటకులకు స్వర్గధామంగా బొగత
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. చతిస్గడ్ అడవుల్లోని వాగులు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో బొగత కు భారీగా నీరు వచ్చి చేరుతుంది బొగత పాలసంద్రంలా ప్రతి ఒక్కరికి కనువిందు చేస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకు పల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వెళ్లే పర్యాటకులకు స్వర్గధామంగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జలపాతం
జలపాతాన్ని తిలకించడానికి తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా అనేక ప్రాంతాల నుండి పర్యాటకులు విశేషంగా వస్తున్నారు. గొప్ప ప్రకృతి దృశ్యాలకు నెలవుగా, జల సంపదకు కొలువుగా ఉన్న బొగత జలపాతం తెలంగాణలో అత్యంత అందమైన జలపాతం. ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జలపాతంగా గుర్తించబడింది. 9.14 మీటర్ల ఎత్తుతో ఉండే ఈ జలపాతం చాలా మనోహరమైన అందంతో ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుంది.
బొగత వాటర్ ఫాల్స్ చూడటానికి భారీగా పర్యాటకులు
బొగత జలపాతం చుట్టూ ఉండే పచ్చనైన ప్రకృతి చూసే వారందరి మనసులను కట్టిపడేస్తుంది. నిండుకుండలా జలకళతో కనువిందు చేస్తున్న క్రమంలో బొగత వాటర్ ఫాల్స్ అందం చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఇక ఇటీవల దసరా సెలవుల సందర్భంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులు బొగతకు వెళ్ళారు. జలపాతం అందాలను తిలకించడానికి చాలామంది పర్యాటకులు అక్కడికి రావడంతో అక్కడి పరిసరాలు అంతా సందడిగా మారాయి.
పాలనురగలా జాలువారుతున్న బొగత జలపాతం
జలపాతం పై నుండి పాల నురగలా జాలు వారుతున్న నీటి ధారలు పర్యాటకుల మనసులను ఇట్టే దోచేస్తున్నాయి. ఇక పర్యాటకులు ఎవరైనా బొగత కు వెళ్లాలి అనుకుంటే ఏటూరునాగారం వాజేడు మార్గంలో ములుగు జిల్లా కేంద్రానికి సుమారు 120కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగత వెళ్లడానికి హన్మకొండ వరంగల్ నుండి వాహనంలో ప్రయాణిస్తే మేడారం మీదుగా వెళ్లాలి. ఇక హైదరాబాద్ నుంచి అయితే రోడ్డు మార్గంలో సుమారు 330కిలోమీటర్ల ప్రయాణం చేయాలి.
అటవీ మార్గంలో సుందర దృశ్యంగా బొగత
బొగత జలపాతం వరకు వాహనాలు వెళ్ళవు కాబట్టి కొంత దూరం అటవీ మార్గంలో నడిచి వెళ్లాలి. అప్పుడే అందాల బొగత మరింత అందంగా సుందర దృశ్యంగా కళ్ళకు కనిపిస్తుంది. మరెందుకు ఆలస్యం ప్రకృతి రమణీయతతో అలరారుతున్న బొగత ను జీవితంలో ఒక్కసారైనా కచ్చితంగా చూసేయండి.












Click it and Unblock the Notifications