వర్షాలతో ఊపిరి పీల్చుకో తెలంగాణా అంటున్న ఐఎండీ.. లేటెస్ట్ అప్డేట్ ఇదే!
రెండు రోజుల క్రితం వరకు వర్షాలు లేక అల్లాడిన తెలంగాణ ప్రజలు మళ్లీ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణపైన ఋతుపవన ద్రోణి ప్రభావం
జైసల్మేర్, కోట, గుణ, దామోహ్ వంటి ప్రాంతాల మీదుగా ఆగ్నేయ దిశగా రుతుపవన ద్రోణి కొనసాగుతోందని, సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎంత వరకు విస్తరించిన ఈ ఋతుపవన ద్రోణి ప్రభావం తెలంగాణ పైన పడుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలంగాణా రాష్ట్రంలో నేడు ఈ జిల్లాలలో వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మరియు ములుగు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర మరియు తూర్పు తెలంగాణ పరిధిలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ జిల్లాలలో సాధారణ వర్షపాతం
రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాలలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని, సాధారణ వర్షపాత సూచన ఉందని పేర్కొంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో సహా మిగతా అన్ని జిల్లాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులకు అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
గతేడాదితో పోలిస్తే తెలంగాణాలో 25 శాతం లోటు వర్షపాతం
పిడుగులు పడే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో చెట్ల కింద, ఎత్తైన ప్రదేశాలలో, విద్యుత్ స్తంభాలకు సమీపంలో ఉండకూడదని సూచించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లోటు వర్షపాతం కొనసాగుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే సగటున 25 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. అయితే ప్రస్తుతం మళ్ళీ కురుస్తున్న వర్షాలతో ప్రజలలో ఆశలు చిగురించాయి.
వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తు చర్యలు
ఈ మాసం, వచ్చే ఆగస్ట్ మాసం వర్షాలు జోరుగా కురిస్తే కాస్త భూగర్భ జలాలు పెరుగుతాయని తాగునీరు, సాగునీరు కి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ వాతావరణ శాఖ రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అప్డేట్ ఇస్తోంది












Click it and Unblock the Notifications