తెలంగాణా వర్షాలకు బ్రేకిచ్చి... మళ్ళీ కురుస్తామని మేఘాల సందేశం!
తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. గజగజా వణికే చలికాలంలో కూడా వర్షాలు పడుతున్న పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్షాల విషయంలో కీలక అప్డేట్ ఇచ్చింది.
తెలంగాణాలో మళ్ళీ వర్షాలు.. అప్పటినుండే
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 11వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం లేదని అయితే మళ్ళీ నవంబర్ 12వ తేదీ నుంచి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం మరో 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండి చెబుతోంది.

నవంబర్ 11 వరకు వర్షాలు కురిసే సూచన లేదు
అయితే దీని కారణంగా తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగానే ఉందని, చలి తీవ్రత కొద్దిగా పెరుగుతుందని వెల్లడించింది. ఇక నవంబర్ 11 వరకు వర్షాలు కురిసే సూచన లేదని తెలిపిన వాతావరణ శాఖ నవంబర్ 12వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మళ్ళీ వర్షాలు ఎప్పుడంటే
నవంబర్ 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.అయితే వర్షాలు నేపథ్యంలో ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదని పేర్కొంది. ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత
ఇది ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం చలి తీవ్రత బాగా పెరిగింది. ముఖ్యంగా ఉదయం పూట పొగ మంచు కమ్ముకుంటుంది. రాత్రి వేళల్లో కూడా చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టడంతో చలి తీవ్రత పెరుగుతుంది. అయితే ఈ ఏడాది గతేడాది కంటే చలి తీవ్రత తక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.












Click it and Unblock the Notifications