ఎల్ నినో పై పోరాటంలో విద్యాశాఖ.. స్కూల్స్ లో నీటి పొదుపు పాఠాలు
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణా ప్రభుత్వం పాఠశాలల్లోని విద్యార్థులను నీటి పొదుపు ఉద్యమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్న ఈ సమయంలో చిన్న వయసు నుంచే పిల్లలకు నీటి విలువను నేర్పితే భవిష్యత్తులో పెద్ద మార్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి పాఠశాల విద్యా శాఖకు లేఖ రాశారు. ఎల్‌నినో కారణంగా వర్షపాతం తగ్గి సింగూర్, మంజీరా వంటి జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులకు నీటి పొదుపు అలవాట్లు నేర్పాలని, ఉదయం అసెంబ్లీలో ప్రతిరోజూ ఒక నిమిషం నీటి సంరక్షణ సందేశం చెప్పాలని, జల సంరక్షణ ప్రతిజ్ఞ చేయించాలని కోరారు.

ఇంట్లో, పాఠశాలలో, చుట్టుపక్కల నీరు వృథా కాకుండా చూసుకోవాలని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. 2027 ఆగస్టు నాటికి కనీసం 20 శాతం నీటి వినియోగం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ లేఖకు స్పందించిన పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ అన్ని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని, సాధారణ భాషలో విద్యార్థులకు వివరించాలని సూచించారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం రోజువారీ నీటి కొరత 600 ఎంఎల్డీకి చేరువగా ఉండగా, ఇది వెయ్యి ఎంఎల్‌డీని దాటే అవకాశం ఉందని అంచనాలున్నాయి. నగర అవసరం 3200 ఎంఎల్డీ ఉండగా సరఫరా 2600 ఎంఎల్డీ మాత్రమే జరుగుతోంది. సింగూర్ జలాశయంలో నిల్వ కేవలం 7 శాతం, మంజీరాలో 17 శాతం మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత వర్షాకాల సీజన్లో హైదరాబాద్‌కు సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది.
ఇలాంటి పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వాడకపోతే వేసవిలో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది.వాటర్ బోర్డు ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ను ప్రోత్సహించడం, పనిచేయని బోర్‌వెల్స్‌ను భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యేలా మార్చడం, గ్రీన్ వాటర్ ట్యాంక్ పథకం ద్వారా శుద్ధి చేసిన మురుగునీటిని నిర్మాణాలు, తోటలు, ల్యాండ్‌స్కేపింగ్‌కు సరఫరా చేయడం వంటివి చేస్తోంది.
ఇలా చేయడం వల్ల తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించి బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, ప్రత్యామ్నాయ వనరులు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు నీటిని పొదుపుగా వాడాలంటే సింపుల్ అలవాట్లు చాలు. బ్రష్ చేసేటప్పుడు ట్యాప్ మూసి పెట్టడం, స్నానం చేసేటప్పుడు అవసరమైనంత నీరు మాత్రమే వాడడం, లీకేజీలు ఉంటే వెంటనే సరిచేయించడం, ఇంట్లోని పెద్దలకు నీటి విలువను గుర్తు చేయడం వంటివి చేయవచ్చు.
పాఠశాలల్లోనూ అదే తీరును పాటించాలి. ఈ చిన్న చిన్న మార్పులు కూడా కలిస్తే పెద్ద ఫలితం వస్తుంది. నీరు అందరికీ అవసరమైన వనరు. దాన్ని పొదుపుగా వాడకపోతే రేపటి తరాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పాఠశాలల్లో ప్రారంభమైన ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థుల నుంచి కుటుంబాలకు, అక్కడి నుంచి సమాజానికి వ్యాపించాలి. ప్రతి ఒక్కరూ నీటిని జాగ్రత్తగా వాడితేనే ఎల్‌నినో వంటి సవాళ్లను తేలికగా ఎదుర్కోవచ్చు.














Click it and Unblock the Notifications
