Weather Report:రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు..లోతట్టు ప్రాంతాలకు అలర్ట్
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదులోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. గురువారం శుక్రవారం రోజుల్లో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. నైరుతి ఉత్తర్ ప్రదేశ్ నుంచి జార్ఖండ్ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ఉపరతల ద్రోణి ప్రభావం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉందని వివరించారు.
తెలంగాణలో పశ్చిమ వాయువ్య దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయని వెల్లడించిన వాతావరణశాఖ ఈ గాలుల ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నిసిస్తున్న ప్రజలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. భారీ వర్షాలకు వర్షపు నీరు ఇళ్లల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇక గురువారం రోజున తెల్లవారుజామున హైదరాబాదు నగరంలో తేలికపాటి వర్షం పడింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉంటే బుధవారం రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications