TGSRTC: బస్సులో విద్యార్థికి గుండె పోటు.. రక్షించిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించిన ఆర్టీసీ ఎండీ..
ఆర్టీసీ సామాన్య ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే రవాణా సంస్థ. ఆర్టీసీ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా.. ఆపదలో ఉన్న ప్రయాణికులను కాపాడుతోంది. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ బస్టాండ్ లో పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళకు ఆర్టీసీ మహిళా సిబ్బంది పురుడు పోశారు. ఆ తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి ఫిట్స్ రావడంతో డ్రైవర్ బస్సును నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఇలా ఆపదలో ఉన్న ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బంది అండగా నిలుస్తున్నారు.
తాజాగా బస్సులో గుండె నొప్పితో బాధపడుతున్న విద్యార్థికి సకాలంలో వైద్య సాయం అందించారు ఆర్టీసీ సిబ్బంది. దీంతో సిబ్బందిని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. బైంసా డిపోనకు చెందిన కండక్టర్ జి.గంగాధర్, అద్దె బస్సు డ్రైవర్ బి.గంగాధర్‌ను హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఘనంగా సన్మానించి.. నగదు బహుమతులు అందజేశారు.ఈ నెల 9న బైంసా నుంచి నిర్మల్‌కు బస్సు వెళ్తుండగా.. దిలావర్‌పూర్ వద్దకు రాగానే 12 ఏళ్ల విద్యార్థి కిరణ్‌కు ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చింది.

ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ జి.గంగాధర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపించారు. డ్రైవర్ బి.గంగాధర్‌తో కలిసి ప్రాథమిక చికిత్సను అందించారు.
ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వెంటనే కిరణ్‌ను బస్సులోనే సమీపంలో ఉన్న నర్సాపూర్ పీహెచ్‌సీకి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్ల కిరణ్‌కు ప్రాణాప్రాయం తప్పిందని వైద్యులు తెలిపారు. సమయస్పూర్తితో వ్యవహారించి 12 ఏళ్ల విద్యార్థి ప్రాణాలను కాపాడిన డ్రైవర్ బి.గంగాధర్, కండక్టర్ బి.గంగాధర్‌లను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు.
ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీదేవి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications