టమాటా రైతుల గుండె మంటకు ఈ ఘటన నిదర్శనం!
ఆరుగాలం శ్రమించి పంట పండించినా అన్నదాతల కష్టాలు మాత్రం తీరటం లేదు. అతివృష్టి, అనావృష్టి వంటి సమస్యలతో పాటు రైతులకు వివిధ పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటం వారిని తీవ్ర వేదనకు గురి చేస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమాటా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భారీ పెట్టుబడులు పెట్టినా, పంటకు తగిన మద్దతు ధర దొరకటం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
టమాటా ధరల పతనం
పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో షాకింగ్ నిర్ణయాలను తీసుకుంటున్నారు. పంటను కోసి మార్కెట్ కు తరలించినా కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రాని క్రమంలో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరానికి 80 వేలు నుండి లక్ష రూపాయల వరకు పంటకు పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు కనీసం రవాణా ఖర్చులు కూడా రావటం లేదని అంటున్నారు.

ధర లేని టమాటా.. రైతు షాకింగ్ నిర్ణయం
తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడా మార్కెట్ లో ఒక రైతు టమాటా పంటను మార్కెట్ కు వచ్చిన వారికి ఫ్రీగా పంచటం రైతుల ఆవేదనకు అద్దం పడుతుంది. నిన్న గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన ఒక రైతు తన టమాటా పంటను మార్కెట్ కు తీసుకురాగా, మార్కెట్ లో కిలో 5 రూపాయలకు కొనుగోలు చేస్తామని వ్యాపారులు చెప్పటంతో అసహనానికి గురైన ఆ రైతు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
ఫ్రీగా టమాటాలు పంచిన రైతు
ఆటోలో అంత దూరం తెచ్చిన టమాటాలను మళ్ళీ ఇంటికి తీసుకు వెళితే మళ్ళీ రవాణా చార్జీల భారం పడుతుందని భావించిన రైతు అక్కడ ప్రజలకు టమాటాలను ఉచితంగా పంచారు.
దీంతో టమాటాలు ఫ్రీగా ఇస్తున్నాడని అక్కడ జనాలు టమాటాల కోసం ఎగబడ్డారు. ఇక కొందరు రైతులు మార్కెట్ కు తెచ్చే సాహసం కూడా చెయ్యటం లేదు.
బయట టమాటా ధర 20 రూపాయలకు పైనే
గిట్టుబాటు ధర లేక టమాటా సాగు చేసిన రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల దగ్గరకు వచ్చే సరికి ధరలు లేవు కానీ మార్కెట్ లో వినియోగదారులకు మాత్రం టమాటా ధరలు 20 రూపాయలకు పైనే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో తమను ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications