weather Update: తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు, ఎల్లో వార్నింగ్
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారంనాడు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు వరదనీటితో నిండిపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు.
కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో వార్నింగ్ కూడా జారీ చేయడం గమనార్హం.

కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడగా, నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు వీస్తుండటమే ఈ వర్షాలకు కారణమని తెలిపింది.
వీటి ప్రభావంతోనే పలు ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజులపాటు అంటే ఆగస్టు 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది.
కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసిందని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లా చాట్లపల్లిలో 10 సెంటీ మీటర్ల వర్షం, హన్మకొండ జిల్లా ధర్మసాగర్ లో 9, వరంగల్ జిల్లా శాయంపేటలో 8, సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో 7, జనగామ జిల్లా నర్మెట్ట, సిద్దిపేట జిల్లా కొండపాక 5 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్టు వెల్లడించింది.
ఏపీలోనూ మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు
ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఒడిశా తీరం వరకు విస్తరించింది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులలో వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
సోమ, మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
Recommended Video
అనంతపురం, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.












Click it and Unblock the Notifications