బీఆర్ఎస్ పై పదేళ్ళలో వ్యతిరేఖత వస్తే కాంగ్రెస్ పై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేఖత!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నేడు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ను గద్దె దించటానికి ఎంతో సమయం లేదు
తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని అధికారంలో నుంచి దించేందుకు పదేళ్లు పట్టిందని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి దించడానికి ఎంతో సమయం పట్టదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. 2014 తర్వాత మండలిని బిఆర్ఎస్ తనకు మద్దతుగా మార్చుకుందని తెలిపారు.

బీఆర్ఎస్ స్వలాభం కోసం కౌన్సిల్ దుర్వినియోగం చేసింది
పోరాటం చేసేవారు ఎవరూ లేకుండా తమకు మద్దతుగా ఉన్న వారిని ఆ పార్టీ ఎంచుకుందని ఆరోపించారు. అయితే టీచర్ల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేలా ఈసారి ఎన్నికలలో టీచర్ల తీర్పు ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ను తన ప్రయోజనాల కోసం వినియోగించుకున్నదని ఆయన విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో హామీలు అమలు చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన పేర్కొన్నారు.
తక్కువ సమయంలోనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేఖత
టీచర్ ఎమ్మెల్సీ అంటే ప్రభుత్వానికి ఒకప్పుడు భయం ఉండేదని ప్రభుత్వ వైఫల్యాలను టీచర్లు శాసనమండలి వేదికగా ఎండగట్టే వారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మళ్లీ అందుకే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కోసం బిజెపి ముగ్గురు అభ్యర్థులను పోటీలో నిలబెట్టిందని అన్నారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, అయితే అంతకంటే తక్కువ సమయంలోనే కాంగ్రెస్ మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చిందని అన్నారు.
తెలంగాణాలో ఏదైనా అభివృద్ధి జరిగితే అది కేంద్రం ఇచ్చిన నిధులతోనే
రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, కేంద్రం ఇచ్చిన నిధుల కారణంగానే జరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోరాటం చేయగలిగిన వారికే పట్టం కట్టాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications