బాసరలో కన్నులపండుగగా వసంతపంచమి వేడుకలు; వేకువజామునుండే చిన్నారుల అక్షరాభ్యాసాలు
వసంత పంచమి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి ఈ రోజు భక్తులు పోటెత్తారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం వసంత పంచమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కన్నులపండుగగా వసంత పంచమి ఉత్సవాలు జరుగుతున్నాయి.
బాసర ఆలయంలో ఆమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి
అమ్మవారికి ఈ రోజు తెల్లవారుజామున మంగళవాయిద్యాలతో సుప్రభాత సేవ నిర్వహించారు. నిత్య హారతులతో పాటుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు ఈరోజు వేకువజాము నుండే వచ్చే భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా భక్తులకు ఆలయ అధికారులు దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజు అమ్మవారు పుట్టినరోజు అయిన వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాధికాలు నిర్వహించారు.

మూడు రోజులపాటు బాసరలో వసంత పంచమి వేడుకలు .. చిన్నారుల అక్షరాభ్యాసాలు
బాసర ఆలయంలో మూడు రోజుల పాటు వసంత పంచమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈరోజు వేకువజామున 3 గంటల నుండే వసంతపంచమి సందర్భంగా అక్షరాభ్యాస పూజలు ప్రారంభమయ్యాయి. బాసర ఆలయ పూజారులు అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మొక్కులు తీర్చుకుంటున్నారు. సరస్వతి దేవి ఆలయం వద్ద అక్షరాభ్యాసం నిర్వహించేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
Recommended Video

సరస్వతీ దేవి జన్మదినం వసంత పంచమి.. అందుకే బాసరలో చిన్నారుల అక్షరాభ్యాసాలు
వసంత పంచమి పర్వదినాన అక్షరాభ్యాసం నిర్వహించుకుని, అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. వసంత పంచమి నాడు చదువులతల్లి సరస్వతీదేవి జయంతి అవడంతో, సరస్వతి దేవి పుట్టినరోజు జరుపుకునే ఈ రోజును విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడానికి మంచి రోజుగా తల్లిదండ్రులు భావిస్తుంటారు. అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లలు జ్ఞానవంతులవుతారని తల్లిదండ్రులు భావిస్తారు. ఈ క్రమంలో భక్తులు అమ్మవారి ఆలయానికి పోటెత్తడంతో బాసర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.












Click it and Unblock the Notifications