సీఎం కుటుంబ దోపిడీ బయటపడుతుందనేనా?: ఈటల బీజేపీలో చేరికపై విజయశాంతి సంచలనం
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. దీనికి టీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈటల పట్ల టీఆర్ఎస్ వ్యవహరించిన తీరు పట్ల బీజేపీ నేత విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరతానంటే ఎందుకింత ఆగమై అవుతున్నారంటూ విమర్శించారు.

సీం కుటుంబ దోపిడీ బయటపడుతుందనేనా?
'సీఎంఓలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు లేరన్న ఈటల ప్రకటనపై ముందుగా ఎందుకు చెప్పలే.... అని టీఆరెస్ ప్రతి విమర్శలు చేసే బదులు.. వెంటనే నియామకం చెయ్యవచ్చు. సమర్థులైన ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు ఉన్నారు కదా? సీఎం కుటుంబ దోపిడీ కథలు వేరే అధికారులొస్తే బయటపడతాయని భయమేదైనా ఉందా?' అని విజయశాంతి ప్రశ్నించారు.

ఈటల బీజేపీలోకి చేరతానంటే ఎందుకంత ఆగమైతున్రు..
'కాంగ్రెస్ నుంచి గెలిచిన అనేకమంది ఎమ్మెల్యేలను పదవితో సహా గుంజుకున్న టీఆరెస్.. ఈటల ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరతానంటే ఎందుకు ఇంత ఆగమైతున్రు. "నక్సలైట్ ఎజెండా నా ఎజెండా..." అని చెప్పిన కేసీఆర్ గారు, వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను ఎన్‌కౌంటర్ చెయ్యొచ్చు... సీఎం అండ్ కో వేల ఎకరాల, లక్షల కోట్ల అవినీతికి పాల్పడవచ్చు. ఈటల భావజాలం మాత్రం ప్రశ్నిస్తాం... అంటున్న టీఆరెస్ పార్టీకి ఇదంతా కేవలం బీజేపీలో చేరికపై భయంతోనే అన్నది స్పష్టం' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

మెజార్టీ హిందువుల పట్ల టీఆర్ఎస్ తేలిక భావ
'రైతు చట్టాలపై ఈటలగారు బీజేపీతో మాట్లాడాలంటున్న టీఆరెస్... ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ రైతులనెందుకు పలుకరించలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. టీఆరెస్ బాజాప్తాగా మతతత్వ ఎంఐఎంతో అవగాహన కొనసాగితే అది సెక్యులరిజం... కోట్లాది భారతీయుల ఆదరణతో ప్రపంచంలోనే పెద్ద పార్టీగా ముందుకెళ్తున్న బీజేపీలో చేరటం మాత్రం అలౌకిక వాదమా? ఇది కేవలం మెజారిటీ హిందువుల పట్ల టీఆరెస్ తేలిక భావమే' అంటూ విజయశాంతి మండిపడ్డారు. కాగా, టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్.. వారం రోజుల్లోగా బీజేపీలో చేరతానని శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపైనా ఈటల విమర్శలు గుప్పించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు ఈటలకు అండగా ఉంటూ టీఆర్ఎస్‌పై మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications