తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, హైదరాబాద్ తోపాటు చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత నుంచి వాతావరణం చల్లబడి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇదే విధంగా జరుగుతోంది. తాజాగా, వాతావరణ శాఖ మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
శుక్రవారం పశ్చిమ-మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద ఎగువ గాలులలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం శనివారం పశ్చిమ -మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ మధ్యలో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం తెలంగాణ రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వీస్తున్నట్లు తెలిపింది.

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది వాతావరణ శాఖ.
ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉదయం ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, జగద్గిరిగుట్ట, మేడ్చల్, కిష్టాపూర్, కండ్లకోయ, దుండిగల్, చిలకలగూడ తదితర చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో వరదనీరు రోడ్లపైకి వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి వరదనీటిని డ్రైనేజీలకు పంపించే ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications