మంత్రి కొండా సురేఖకు నోటీసులపై నాగార్జున లాయర్ ఏమన్నారంటే!
అక్కినేని కుటుంబంపై, అలాగే హీరోయిన్ సమంతపై మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై కొండ సురేఖ క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయింది అని అందరు భావించగా అక్కినేని కుటుంబం దీనిని క్షమించరాని నేరంగా పరిగణించి కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ వివాదంలో ముందు ముందు ఏం జరగబోతుంది అన్నది తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరంగా మారింది.
నాగార్జున లాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు, పరువు నష్టం దావా వేసి ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటీషన్లో కోరడంతో పాటు ఈ రోజు నాంపల్లి కోర్టులో తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున తరపున వాదిస్తున్న లాయర్ కొండా సురేఖ పై అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ కేస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కోర్టులో నాగార్జున పిటీషన్ విచారణ
కొండా సురేఖ పై అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్ పైన నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కోర్టుకు అక్కినేని నాగార్జున హాజరవగా నాగార్జునతో పాటు ఆయన సతీమణి అక్కినేని అమల ,కుమారుడు నాగచైతన్య కూడా హాజరయ్యారు. వీరితో పాటు సాక్షుల్లో ఒకరైన సుప్రియ కూడా నేడు కోర్టుకు హాజరయ్యారు.
కోర్టులో ఏం జరిగిందో చెప్పిన నాగార్జున న్యాయవాది
అయితే కోర్టులో అక్కినేని నాగార్జునను పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ధర్మాసనం ప్రశ్నించగా తమపై అసత్య ఆరోపణలు చేసినట్టు హీరో నాగార్జున కోర్టుకు తెలియజేశారు. తన కుటుంబం పైన కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు వెల్లడించారు. కోర్టు ఈ పిటీషన్ విచారణ మరోమారు 10 తేదీకి వాయిదా వేసింది. ఇక కోర్టులో జరిగిన వ్యవహారాన్ని నాగార్జున తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
కొండా సురేఖకు నోటీసులు ఇచ్చే అవకాశం
అక్కినేని నాగార్జున తో పాటు మొదటి సాక్షి సుప్రియ వాంగ్మూలాన్ని రికార్డు చేశారని, ఈనెల 10వ తేదీన మరో సాక్షి వాంగ్మూలం కూడా రికార్డు చేస్తారని ఆయన తెలిపారు. ఇక మంత్రి కొండ సురేఖకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉందని ఆయన వెల్లడించారు. ఈనెల 10వ తేదీ తర్వాత మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
సురేఖ మాట్లాడిన వీడియోలను కోర్టుకు అందజేసిన నాగార్జున
మంత్రి కొండ సురేఖ మాట్లాడిన వీడియోలను కోర్టుకు అందజేశామని పేర్కొన్న ఆయన నాగార్జున మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించారని తెలిపారు. ఈ వ్యవహారంలో వెనక్కు తగ్గేది లేదని నాగార్జున తరపు న్యాయవాది వ్యాఖ్యలతో స్పష్టంగా అర్ధం అవుతుంది.












Click it and Unblock the Notifications