నరేంద్రమోడీ ఛాతీకన్నా కేసీఆర్ ఛాతీనే వెడల్పు ఎక్కువ.. విశాలమైనది??
తమ నేతది 56 అంగుళాలకు విస్తరించిన ఛాతీ అంటూ భారతీయ జనతాపార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటుంటారు. దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ 56 అంగుళాల ఛాతీ గురించే ఒకానొక సమయంలో చర్చలు జరిగాయి. ఛాతీ విశాలంగా ఉన్నప్పటికీ మనసు మాత్రం విశాలంగా లేదని తెలంగాణ రాష్ట్రసమితికి చెందిన నేతలు విమర్శల బాణాలు సంధిస్తున్నారు.

ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే తేడా ఎందుకు?
వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిగా ఎంపిక చేస్తే ఒక తెలుగు వ్యక్తిగా ఆయనకు మద్దతిద్దామనేది టీఆర్ ఎస్ ప్రాథమికంగా చేసిన ఆలోచన. ఇక్కడ ఏపీ, తెలంగాణ అనే తేడా చూడలేదు. కానీ ఉత్తరాది, దక్షిణాది తేడా మాత్రం ఢిల్లీ పెద్దలు చూపిస్తున్నారని, ప్రతిసారీ దక్షిణాదికి అన్యాయం జరుగుతూనే ఉందని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి ఉత్తరాది రాష్ట్రాలకు ఖర్చుపెడుతున్నారని, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తున్నా కేంద్రంలో సమాధానం చెప్పే నాథుడే లేడంటున్నారు.

కేసీఆర్ ఏనాడూ వివక్ష చూపలేదు
దేశవ్యాప్తంగా అమరులైన సైనిక కుటుంబాలకు, రైతు ఉద్యమం వల్ల ప్రాణాలు కోల్పోయినవారికి తమ నేత నష్టపరిహారం అందజేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం కనీసం కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయినవారికి ఎంతమేరకు వారికి పరిహారం అందించిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ ఏనాడూ వివక్ష చూపించలేదని, అటువంటిది దేశంలో ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే తేడా ఎందుకు చూపించాలనుకుంటున్నారంటూ నిలదీస్తున్నారు. రాజకీయాలు వేరు.. మానవత్వం వేరని, రెండింటినీ వేర్వేరుగా చూడలేమని, మానవత్వాన్ని రాజకీయంతో కలిపి చూసినవారే గతంలో గొప్ప నేతలుగా ఎదిగారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

మోడీని ఢీకొనే నేత కేసీఆరే!
ఇప్పటికే రాష్ట్రాలను బలహీనపరిచి కేంద్రాన్ని బలోపేతం చేసే ఫార్ములాను అమలు చేయాలనుకుంటున్న నరేంద్రమోడీ, అమిత్ షాను ఢీకొనే నేతగా కేసీఆర్ రూపాంతరం చెందుతున్నారని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలి, కేంద్రం, రాష్ట్రం స్నేహంతో మెలగాలనే ఆలోచనతో ఉన్న తమ నేత ఛాతీ విశాలమైనదా? లేదంటే నరేంద్రమోడీ ఛాతీ విశాలమైనదా? బీజేపీ నేతలే చెప్పాలంటూ టీఆర్ ఎస్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications