పోలీసులపై ఆరోపణలు చేస్తూ విశాఖలో 32 మంది వాలంటీర్ల రాజీనామా .. అసలేం జరిగిందంటే !!
విశాఖపట్నం జిల్లాలో గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. విధులు నిర్వర్తించలేమని తేల్చిచెప్పారు . తమను రిలీవ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 32 మంది గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయడం ఇప్పుడు విశాఖ మన్యంలో చర్చనీయాంశంగా మారింది.

బూదరాళ్ళ పంచాయతీకి చెందిన 32 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా
ఇక అసలు విషయం ఏమిటంటే విశాఖ మన్యంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బూదరాళ్ళ పంచాయతీకి చెందిన 32 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా చేశారు. తాము విధులు నిర్వర్తిస్తున్న మారుమూల ప్రాంతం లోని గిరిజన గ్రామాలకు కనీస రహదారి సౌకర్యాలు కూడా లేవని, రవాణా సౌకర్యాలు లేని ఆ గ్రామాలలో మౌలిక వసతులు లేకున్నా తాము విధులు నిర్వర్తిస్తున్నామని మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నామన్న అనుమానంతో పోలీసులు తమను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు మావోయిస్టులతో సంబంధాలున్నాయని వాలంటీర్ లను వేధిస్తున్నారని ఆరోపణ
అసలే వసతులు లేక ఇబ్బందులతో ఉద్యోగాలు చేస్తున్న తమకు, పోలీసుల వేధింపులు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని వారంటున్నారు.
అందుకే తాము ఈ గ్రామ వాలంటీర్ల ఉద్యోగాన్ని చేయలేమని , గత్యంతరం లేకనే రాజీనామాలు చేస్తున్నామని చెప్తున్నారు . మూకుమ్మడిగా 32 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామాలు చేశారు. కొయ్యూరు ఎంపీడీవో మేరీ రోజ్ కు వారు తమ రాజీనామా లేఖలను అందించి, వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజన గ్రామాల్లో పోలీసుల నిఘా .. తమపై వేధింపులు లేకుంటేనే విధులు
తాము అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామ వాలంటీర్లు చివరకు రాజీనామాల బాట పట్టామని చెబుతున్నారు.
పోలీసులు వేధింపులు లేకుండా చర్య తీసుకుంటే తాము విధుల్లో చేరి పని చేసుకుంటామని వారంటున్నారు. తాజాగా విశాఖ మన్యం కేంద్రంగా మావోయిస్ట్ కార్యాకలాపాలపై నిఘా పెట్టిన పోలీసులు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు .

విశాఖ మన్యంలో పోలీసుల వేధింపులపై చర్చ .. రాజీనామాలు అంగీకరిస్తారా ?
ఈ క్రమంలో గ్రామ వాలంటీర్ల పై పోలీసుల వేధింపులు ఇప్పుడు విశాఖ మన్యంలో వారి రాజీనామాలతో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు గ్రామ వాలంటీర్ల రాజీనామా లేఖలపై ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలపై పోలీసులు స్పందన ఏ విధంగా ఉంటుందో కూడా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications