ఈ వైసీపీ ఎమ్మెల్యేను గుర్తు పట్టగలరా?: ముని వేషంలో..అడవుల్లో సంచరిస్తూ కెమెరా కంటికి
విశాఖపట్నం: ఈ ఫొటోలో కనిపిస్తోన్నది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. నాటకాలంటే మహా ఇష్టం. తరచూ ఇలా ముఖానికి రంగులు వేసుకుని కనిపిస్తుంటారు. నటనపై తనకు ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఇలా రుషి వేషాన్ని ధరించారు. అడవుల్లో సంచరిస్తూ కెమెరా కంటికి చిక్కారు.
ఆయన ఎవరో కాదు.. కరణం ధర్మశ్రీ. విశాఖపట్నం జిల్లా చోడవరం ఎమ్మెల్యే. నాటకాల పట్ల ఆసక్తి ఉన్న ఆయన తాజాగా ఓ భక్తిరస చిత్రంలో నటిస్తోన్నారు. మహా ముని పాత్రను పోషిస్తోన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికే చెందిన కొందరు యువకులు మోదకొండమ్మ అమ్మవారిపై ఓ సినిమాను తెరకెకిస్తోన్నారు. విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో షూటింగ్ జరుపుకొంటోంది ఈ మూవీ.

పాడేరు పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది యూనిట్. ఇందులో ముని పాత్రలో నటిస్తోన్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఇతర కళాకారులపై సన్నివేశాలను తెరకెక్కించింది. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఓ ముని తపస్సు చేయడం, ఆ తపస్సుకు మెచ్చి.. దేవతలు ప్రత్యక్షం కావడం.. వంటి సన్నివేశాలు పాడేరు ఏజెన్సీలో షూట్ చేశారు. చినప్పటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, కళలపై తనకు అమితమైన ఆసక్తి ఉందని ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ చెప్పారు.

తన తండ్రి రామయ్యదొర కళాకారుడు, రచయిత. సుమారు మూడు వేలకు పైగా పాటలు రచించారు. 200లకు పైగా నాటకాలను ప్రదర్శించారు. చదువుకునే రోజుల్లో కరణం ధర్మశ్రీ.. నరకంలో లంచం నాటకంలో నటించారు. యముడి పాత్రను పోషించారు. ఈ నాటకానికి ఆయనకు అవార్డు కూడా లభించింది. మోహిని భస్మాసుర హస్తం నాటకంలో నారదుడిగా కనిపించారు. కరణం ధర్మశ్రీ మంచి గాయకుడు కూడా. విశాఖలో కళాశాల స్థాయిలో బహుమతులను గెలుచుకున్నారు. భువనవిజయం నాటకంలో శ్రీ కృష్ణ దేవరాయలుగా అద్భుతంగా నటించారు.












Click it and Unblock the Notifications