కేన్ మామ మొదలెట్టేశాడు..!!
ముంబై: ఐసీసీ వరల్డ్ కప్.. ఇంకో మూడు నెలల్లో ఈ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ ఆరంభం కాబోతోంది. దీనికోసం క్రికెట్ ఆడే అన్ని దేశాలు సన్నద్ధమౌతోన్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌తో తీరిక లేని షెడ్యూల్స్‌ను ఎదుర్కొంటోన్నాయి. ఇది 13వ ఎడిషన్ వరల్డ్ కప్. ఇప్పటివరకు 12 మెగా టోర్నమెంట్లు ముగిశాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
భారత్, వెస్టిండీస్ రెండుసార్లు ఈ కప్‌ను ముద్దాడాయి. శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఒక్కోసారి విజేతగా నిలిచాయి. 2019లో జరిగిన వరల్డ్ కప్‌ను ఇంగ్లాండ్ ఎగరేసుకెళ్లింది. ఈ సారి ఎవరు విన్నర్ అవుతారనేది ఆసక్తి రేపుతోంది. మొత్తం 10 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు మరో రెండు జట్లు వరల్డ్ కప్ ఆడబోతోన్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీన ఈ టోర్నమెంట్ ఆరంభమౌతుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబర్ 19వ తేదీన ఫైనల్ షెడ్యూల్ అయింది.
ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. అక్టోబర్ 14వ తేదీన జరిగే ఈ మ్యాచ్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.
ఈ టోర్నమెంట్ కోసం న్యూజిలాండ్ కేప్టెన్ కేన్ విలియమ్సన్.. రెడీ అవుతున్నాడు. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో కేన్ గాయపడ్డ విషయం తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ వద్ద అందుకోబోయి కిందపడటంతో అతని కుడి మోకాలికి గాయమైంది.
Great news for cricket fans.
— Johns. (@CricCrazyJohns) August 1, 2023
Kane Williamson has started the batting practice. [Williamson Instagram] pic.twitter.com/slksSph61F
యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్‌తో బాధపడ్డాడు కేన్. శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. తాజాగా పూర్తిగా కోలుకున్నాడు కేన్ విలియమ్సన్. సుదీర్ఘ విరామం తరువాత బ్యాట్ పట్టాడు. నెట్స్‌లో జోరుగా ప్రాక్టీస్ చేశాడు. త్రోడౌన్లను విజయవంతంగా ఎదుర్కొన్నాడు. తనదైన శైలిలో స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ కనిపించాడు కేన్.
వరల్డ్ కప్ కోసం తన దేశ జాతీయ జట్టుతో కలిసి భారత్‌కు రావడం ఖాయంగా కనిపిస్తోంది. తుదిజట్టులో అతణ్ని తీసుకుంటారా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ తెలిపింది. టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఇంకా సమయం ఉందని, కేన్‌ను జట్టులోకి తీసుకోవడానికీ చాలినంత గడువు ఉందని పేర్కొంది. జట్టులో చోటు దక్కకపోతే మెంటార్ పాత్రను పోషించవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications