బే ఏరియా, ఉత్తర కాలిఫోర్నియాలో ఇటీవల సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. బే ఏరియాలోని శాన్ రామొన్ కాలిఫోర్నియా తెలుగువారికి పెట్టింది పేరు. స్థానిక సంస్కృతిని కాపాడుకుంటూ, ప్రచారం చేయడంలో భాగంగా రెండు వారాల పాటు జరిగిన బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మతో పూర్తయింది. దాదాపు 400 మంది ఇందులో పాల్గొన్నారు. మాధవి అన్నం, మంజు గుజ్జ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి మహిపాల్ రెడ్డి అన్నం, శ్రీనివాస్ గుజ్జ సహకారం అందించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బతుకమ్మ అడుతుంటే చూడ ముచ్చటగా ఉంది. స్థానిక సన్నిధి రెస్టారెంట్ తయారు చేసిన తెలంగాణ వంటకాలు ప్రతి ఒక్కరి నోరు ఊరించాయి. బతుకమ్మ పండుగలో పాల్గొన్న వారందరికీ సైదీష్ అజ్జన్ కృతజ్ఝతలు తెలిపారు. టిసిఎ వాలంటీర్లు భాస్కర్ మద్ది, రాజు యాశాల, చక్రి, భాస్కర్ బందికల్లు, శ్రావణ్ బెల్లాల్, అర్షద్, హుస్సేన్, రమేష్ గుబ్బ కార్యక్రమ విజయానికి సహకరించారు.