• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ ఉద్యమ గేయం

By కాసుల ప్రతాపరెడ్డి
|

Gaddar
గేయగతిని తెలంగాణ వైపు మళ్లించి ఒక ఊపును ఇచ్చినవాళ్లు గద్దర్, గూడ అంజయ్య, గోరటి ఎంకన్న, అందేశ్రీ. వారి తర్వాత బైరెడ్డి కృష్ణారెడ్డి, అంబటి వెంకన్న వంటి ఎందరో వాగ్గేయకారులు వచ్చారు. కవి పేరు తెలియకుండా పాటలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. నందిని సిద్ధారెడ్డి రాసిన బతుకమ్మ పాట ఇంటింటా మారుమోగుతున్నది. దేశపతి శ్రీనివాస్ కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ తెలంగాణ సంస్కృతిని, పోరాట వారసత్వాన్ని పాడుతూనే ఉన్నారు.

తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత తెలంగాణ వాగ్గేయకారులు స్పష్టమైన ఎరుకతో తెంలగాణను తమ పాటల్లో వస్తువుగా ఎంచుకున్నారు. గద్దర్ ఎన్నో పాటలు రాసి భువనగిరి, వరంగల్ సభలను ఉర్రూతలూగించారు. తెలంగాణ పల్లెల విధ్వంసాన్ని, రాజ్యహింసను ఆయన తన పాటల్లో ప్రతిబింబించారు. గూడ అంజయ్య మరింత నిర్దిష్టంగా తెలంగాణను గానం చేశారు. ఆర్థికంగా, అంతకన్నా ముఖ్యంగా సామాజికంగా, సాంస్కృతికంగా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిందనే భావన తెలంగాణ సాహిత్యకారులను ఆవహించింది. తమ చారిత్రక ఆనవాళ్లు అంతర్జాతీయ వలసవాదుల వల్లనే కాదు, అంతర్గత వలసవాదుల వల్ల కూడా రూపుమాసిపోయే ప్రమాదం ముంచుకొచ్చిందనే ఎరుక వారిని శోకాలు పెట్టించింది. ఈ శోకతీవ్రతను పాట కూడా ప్రతిబింబించి, దాన్ని అధిగమించి పోరాట స్ఫూర్తిని అందిస్తున్నది. ఆ శోకతీవ్రత తెలంగాణ పాటన సాంద్రతను, ప్రేక్షకులను తనదైన లోకంలోకి తీసుకెళ్లి గుండెలు కదిలించే గుణాన్ని సంతరించుకుంది. అంతకు ముందు గుర్తించాల్సిన అవసరం లేదనుకున్న ఎన్నో విషయాలు పాటలో భాగమయ్యాయి. కేవలం విప్లవ సంప్రదాయం మాత్రమే కాదు, ఆ సంప్రదాయానికి కూడా కారణమైన చారిత్రక, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక అస్తిత్వం, తెలంగాణ చైతన్యం ముందుకు వచ్చింది. దీంతో తెలంగాణ ఉద్యమ పాటకు అనేక పార్శ్వాలు వచ్చి చేరాయి. పోరు తెలంగాణ, నా ఊరు తెలంగాణ అనేది ఒకటే కాదు, నిరంతరంగా ఈ పోరు చేయాల్సిన స్థితి తెలంగాణకు కలగడానికి గల అనేకాంశాలను తెలంగాణ పాట తడిమే ప్రయత్నం చేసింది. అదే పోరును తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తామనే, పోరాట సంప్రదాయాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని తెలంగాణ పాట స్పష్టం చేసింది.

వ్యక్తీకరణలో గత విప్లవ గేయాల శైలిని గోరటి వెంకన్న, అందెశ్రీ పూర్తిగా మార్చి వేశారు. గద్దర్, గూడ అంజయ్య వంటి వారి గేయాల్లో విప్లవ బాణీలే వస్తువు మార్చుకుని తెలంగాణ గేయాలుగా రూపు కడితే వీరి పాటలు అభివ్యక్తి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఈ ప్ర్తత్యేకత వల్లనే గద్దర్, గూడ అంజయ్య వంటి ఉద్ధండులుండగానే వీరి పాటలకు ప్రత్యేక గుర్తింపు, ఆదరణ లభిస్తున్నాయి. గోరటి ఎంకన్న పాటల్లో బైరాగుల తత్వాల్లోని, యక్షగాన రీతుల్లోని లక్షణాలు కనిపిస్తే, అందేశ్రీ పాటల్లో పద్యనాటక లక్షణాలు కనిపిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X