వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాంతీయ కవిత్వ చైతన్యం పార్ట్-1

By Pratap
|
Google Oneindia TeluguNews

Sunkireddy Narayana Reddy
ఆంధ్రప్రదేశ్‌ పేరుకు ఒకే రాష్ట్రమైనా వైవిధ్య పూరితమైన నాలుగు ప్రాంతాల కలయిక అనే విషయం అందరికీ తెలిసిందే. అవి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ. భౌగోళిక సరిహద్దులు, భాష, సంస్కృతి, ఆర్ధిక స్థితిగతులు, చాలా కాలం విడి రాజ్యాలుగా ఉండటం అనే అంశాలు ఈ ప్రాంతాల చారిత్రక ప్రత్యేక అస్తిత్వానికి హేతువులు.

ఈ ప్రాంతంలో తమ ప్రాంతం గురించిన చైతన్యంతో రాసిన కవిత్వాన్ని ప్రాంతీయ కవిత్వ చైతన్యం అని పిలువవచ్చు. తన చుట్టు వున్న ప్రపంచ వస్తుగత వాస్తవికతను ప్రతిబింభించే ఉన్నత రూపమే చైతన్యం.

కవిత్వం ప్రపంచానికి సంబంధించిన సాధారణీకరల్ని ప్రతిబింభించడమే కాక నిర్ధిష్టతను కూడా ప్రతిబింబిస్తుంది. అందులో భాగంగా కవి తన ప్రాంత, కుల, మత, వర్గ సమస్యల్ని ప్రతిబింబిస్తాడు. అందులో భాగంగానే వివిధ అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి. ఆయా అస్తిత్వాల తక్షణ సమస్యలు అసలు కారణం కాగా, ఎవరి ప్రతి అనుభవాన్ని వారు వ్యక్తీకరించుకోవాలని చెప్పిన పోస్ట్‌ మోడర్నిజం, ఇన్నాళ్లు విస్మృతికి గురైన ఉపశ్రేణుల చరిత్ర బయటకు రావాల్సి వుందని చెప్పిన సబాల్టర్న్‌ స్టడీస్‌ ఈ అస్తిత్వ ఉద్యమాలకు పరోక్ష తాత్విక, సైద్ధాంతిక దోహదాన్ని కలుగ జేశాయి.

కవి తెలిసిగాని తెలియకగాని తన దేశ కాలాలను ప్రతిబింబిస్తాడు. నన్నయ భారతం మూలంలో లేకపోయినా వేంగి దేశ వర్ణన చేశాడు. పాల్కుర్కి తన ప్రాంత భాషను ఆచార వ్యవహారాలను వర్ణించినాడు. శ్రీనాధుని చాటువుల్లో పలనాడు స్ధితి గతులు వ్యక్తమయ్యాయి. కృష్ణ దేవరాయలు రాయలసీమ రెడ్ల ప్రవర్తనను వర్ణించినాడు. పాల వేకరి కదిరీ పతీ, అయ్యలరాజు నారాయణా మాత్యుడు, సారంగపాణి, ధూర్జటి ఆనాటి కొన్ని విశేషాలను వర్ణించినారు.

అట్లావచ్చిన స్త్రీ, దళిత, ముస్లిం అస్తిత్వ ఉద్యమ కవిత్వాలతో పాటు వచ్చిందే ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమ కవిత్వం. ఈ నేపధ్యంలోంచి పైన పేర్కొన్న వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ చైతన్యం కవిత్వంలో ఎట్లా వ్యక్తమైందన్నది పరిశీలించాలి.

రాయలసీమ ప్రాంతీయ చైతన్యం (కవిత్వం) : ఉత్తరాన కృష్ణానది, నల్లమలలు, ఎర్రమలలు శ్రీపర్వత (శ్రీశైలం) సానువులలో, అరణ్యాలు, పడమర వైపు కన్నడ ప్రాంతం; దక్షిణాన తమిళ ప్రాంతం తూర్పున సముద్రం (తొలుత నెల్లూరు ఈ ప్రాంతంలో భాగంగానే పిలువబడేది. తర్వాత కోస్తాంధ్రలో భాగమయ్యింది) ఈ ప్రాంత ప్రత్యేకతను కొంత వరకు నిర్ధారించాయి. నెల్లూరు జిల్లా కోస్తాంధ్రలో భాగంగా మారినాక ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది.

ఈ ప్రాంతం తొలుత మౌర్యుల సామ్రాజ్యంలో వుండేది. తరువాత కొంత భాగం కొంత కాలం శాతవాహనుల రాజ్యంలో ఉండేది. ఇక్ష్వాకుల కాలంలో హిరణ్యకులు ప్రస్తుతం కడప, కర్నూలు జిల్లాలుగా పిలువబడుతున్న ప్రాంతాలను పాలించినారు. ఇక్కడ దొరికిన శాసనాలను బట్టి 3,4 శతాబ్ధాల మధ్య పల్లవులు రాయలసీమ లోని కొంత భాగాన్ని పాలించినారు. బాదామి చాళుక్యులు, కంచి పల్లవుల కాలంలో (6,7 శతాబ్ధాలు) రేనాటి చోళులు (500-850) రాయలసీమలో చాలా భాగాన్ని పాలించినారు. ఈ కాలం నుంచే ఈ ప్రాంతానికి 'రేనాడు' అనే పేరు వచ్చింది. ఈ వంశానికి చెందిన వివిధ శాఖల వాళ్ళు 11 వ శతాబ్దం వరకు పాలించినారు. తర్వాత కేంద్రీకృత రాజ్య వ్యవస్థ పోయింది. రాష్ట్రకూట, దక్షిణ చోళ, కాకతీయ సామంతులుగా చిన్న చిన్న రాజ్యాలుండినాయి. తదనంతరం విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండింది. ఆ తరువాత కుతుబ్‌షాహిలు, మైసూరు రాజులు, అసఫ్‌జాహీలు, మరాఠా రాజుల కాలంలో రాయలసీమ ఎవరి పాలనలో ఎంత ప్రాంతముండేదో చెప్పడం కష్టం. ఈ మధ్యలో ఎప్పుడో పాలెగాళ్ళ వ్యవస్థ వచ్చింది. ''1790 -1800 ప్రాంతంలో బ్రిటీష్‌ వానిఆధీనంలోకి వచ్చింది. ఈ చరిత్రంతా ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రాంతంలో కలువ కుండా విడి రాజ్యంగా కొంతకాల ముండడమనేది కూడా ఈ ప్రాంత ప్రత్యేకతను నిర్ధారించిందని చెప్పడానికే. ఇక్కడి భాష, సంస్కృతుల వైవిధ్యం, ఆర్ధిక, సామాజిక పరిస్థితులు కూడా ఈ ప్రాంత ప్రత్యేకతలను నిర్ధారించాయి. ఇట్లా రూపొందిన రాయల సీమ పట్ల ఇక్కడి కవులకు గొప్ప గౌరవాభిమానాలున్నాయి.
ఏతపస్వీ జీవించెను యీ మనోజ్ఞ
సీమ, పూజ్యమౌ రాయలసీమలోన........
ప్రకృతి మాధుర్యమొలుకు మా పల్లెలిచట (బెళ్లూరి శ్రీనివాసమూర్తి) - అనీ
అచట నొకనాడు పండె ముత్యాల చాలు
అచటనొకప్పుడు నిండె కావ్యాలజల్లు
అచటనొకప్డు కురిసె భాష్యాల జల్లు
విరిసెనటనొకనాడు వేయంచు విచ్చుకత్తి'' (విద్వాన్‌ విశ్వం) అనీ
అప్పుడెప్పుడో నా సీమ
దేశానికే తల మానికమట'' (ముని సుందరం)
రాయలసీమ రతనాల సీమ అనీ, ఇక్కడ రత్నాలను అంగళ్లలో రాసులు పోసి అమ్మినారనీ, రాయలసీమ ప్రాశస్త్యాన్ని వేనోళ్ల పొగిడినారు.
అయితే ఇదంతా గత వైభవం. ప్రస్తుత పరిస్థితి వేరు. ఇప్పుడది సమస్యల నిలయం. ఈ సమస్యలకు ఈ ప్రాంత భౌగోళిక స్థితి గతులకు తోడు రాజకీయ వివక్ష కూడా తోడైంది. ఇక్కడి రాజకీయ నేపధ్యాన్ని కొద్దిగా పరిశీలిద్దాం.

ఉమ్మడి మద్రాసు సంయుక్త రాష్ట్రంలో భాగంగా వున్న రాయలసీమ, కోస్తాంధ్ర వాసులు ఆంధ్ర రాష్ట్రసాధనకోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యమించారు. అయితే ఈ ఉద్యమం అంత సజావుగా సమైఖ్యంగా సాగలేదు. రాయలసీమ వారికి సర్కార్‌ జిల్లాల పట్ల (కోస్తాంధ్ర) మొదటి నుండి అనుమాన దృష్టి వుండేది. భాషా సంస్కృతుల పరంగా తమను వీరు తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది. అనంతపురంలో ఏర్పాటుచేస్తానన్న ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. అంతేకాక రాయలసీమను ఆంధ్రయూనివర్శిటి నుండి వేరు చేశారు. దీంతో సీమ వాసులకు కోస్తాంధ్రాల మీద నమ్మకం పోయింది. 1931 జూన్‌లో జరిగిన ఆంధ్ర మహాసభలో పప్పూరి రామాచార్యులు అనే నాయకుడు చెన్నై రాజధాని నుండి ఆంధ్రరాష్ట్రం విడివడుట లాభకరమైనచో, ఆంధ్ర రాష్ట్రం నుండి రాయలసీమ విడివడుట మరింత లాభకరము కదా అన్నారు. అనడంతో వూరుకోకుండా సీమకు జరుగుతున్న అన్యాయాలను చర్చించేందుకు, సీమ అవసరాలను పరిరక్షించుకునేందుకు 1934 లో రాయలసీమ మహాసభను ఏర్పాటు చేసి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చించారు. ఈ సభలోనే టి.ఎన్‌.రామకృష్ణారెడ్డి అనే మరో నాయకుడు 'మేమొక వ్యక్తులమన్న గణన కూడ వారికి లేదు, వారికి లెక్కకురాము అన్నాడు. 1937లో జరిగిన ప్రాంతీయ శాసన సభ ఎన్నికల్లో గెలిచి ప్రధాన మంత్రి అయిన రాజగోపాలచారి అత్యున్నత పదవుల్లోకి ఒక్కరిని కూడా సీమ నుంచి తీసుకోలేదు. ఇది రెండు ప్రాంతాల మధ్య మరింత అగాధాన్ని పెంచింది. ఈ అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి 16 -11 -1937 లో చారిత్రాత్మకమైన శ్రీభాగ్‌ ఒడంబడిక జరిగింది. దీనిలో నాలుగు అంశాలున్నాయి. 1) సేద్యపు నీటి సౌకర్యాల విషయంలో సీమ అవసరాలు ముందు తీరర్చాలి 2) రాష్ట్ర పరిపాలనలో అన్ని జిల్లాలకు దాదాపు సమాన ప్రాతినిధ్యం వుండాలి. విశ్వవిద్యాలయం, హైకోర్టుకు సంబంధించినవి మిగతా రెండు అంశాలు. కాని ఈ ఒప్పందం అమలు కాలేదు. 1947 రాయలసీమ మహాసభలో నీలం సంజీవరెడ్డి ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వెలిబుచ్చినారు. ఆ తరువాత 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956 లో ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా శ్రీభాగ్‌ ఒప్పందం అమలు కాలేదని, సీమ వెనుక బాటుకు గురైందని, అన్ని రంగాల్లో సీమ వివక్షకు గురౌతున్నదనీ సీమ వాసులు అసంతృప్తితో ఉంటూ వచ్చారు. ఈ వివక్షకు కరువు కాటకాలు తోడయ్యాయి. రాయలసీమ ప్రజా జీవితంలో చిన్నా భిన్నమైంది. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి 1980 వ థకంలో రాయలసీమ చైతన్య ఉద్యమాలు మొదలయ్యాయి. పాద యాత్రలు సాగినాయి. సీమకరువు పెద్ద చర్చనీయాంశమైంది. 'కదలిక' వంటి పత్రికలొచ్చాయి. సీమ సాహితి వంటి సంస్థలొచ్చినవి. డా|| ఎం.వి.రమణారెడ్డి,భూమన్‌, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచపాలెం చంథ్రేఖరరెడ్డి, సింగమనేని నారాయణ వంటి అనేక మంది మేధావులు గ్రంధాలు రచించారు. వీరు కోస్తాంధ్రతో పోల్చి చూపి సీమ ఏయే రంగాల్లో వివక్షకు గురైందో తద్వారా ఎంత వెనుక బాటుకు లోనైందో గణాంకాలతో సహా విశ్లేషించారు.

ఈ నేపథ్యంలో సీమ కవిత్వంలో ఆప్రాంత చైతన్య ప్రతిఫలాన్ని పరిశీలించాలి.

80 వథకం కంటే ముందుకూడా సీమ కవిత్వంలో పరిగణించదగిన స్థాయిలో జీమ ప్రస్తావన కనిపిస్తుంది. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి పెనుగొండలో సీమ గత వైభవ కీర్తి గానం వున్నది. పుట్టపర్తి గారి పెనుగొండ లక్ష్మి (1930) మేఘదూతం లో సమకాలీనసీమ చైతన్యం చిత్రించబడినది. బెళ్ళూరి శ్రీనివాసమూర్తి, ''తపోవనం'' (1954) బైరపురెడ్డి నారాయణ రెడ్డి ''రాయల సీమ రైతు'' (1976) పాలా వెంకటసుబ్బయ్య ''అనిల సందేశం'' మన్నవ భాస్కరరాయుడి ''శ్వేద సూర్యోదయం'' సుబ్రహ్మణ్యపిళ్ళే ''ఒక రాఘవరెడ్డి'' కుంటిమద్ది శేషశర్మ ''రామిరెడ్డి'' మొ|| కావ్యాలు సీమ కరువునూ, ఇతర జీవిత పార్శ్వాలను ఎంతో కొంత చిత్రించారు. వీటన్నింటి కంటే మించినది విద్వాన్‌ విశ్వం గారి ''పెన్నేటి పాట'' (1956) ఇది రాయలసీమకు ప్రాతినిధ్య కావ్యం. వల్లంపాటి వారి అభిప్రాయం ప్రకారం కవితా వేశంతో ''పెన్నేటి పాట'' మహా ప్రస్థావనకు ధీటైన కావ్యం.
అదేపెన్న అదేపెన్న
నిదానించినాడు
విదారించునిడన్‌
వట్టి ఎడారి తమ్ముడు....
ఎదనీరు ఎదహోరు
ఎదనీటి జాలు అంటూసాగే పెన్నేటిపాట రాయలసీమ గత వైభవాన్ని, ఆ ప్రాంత ప్రాశస్త్యాన్ని పెన్ననీటి వైశిష్ట్యాన్ని, అక్కడి కరువునీ కళ్ళకు కట్టినట్టు వర్ణించింది.

English summary
An eminent literary critic and poet Dr Sunkireddy Narayana Reddy analyses the regional awareness in Telugu poetry. He explains the regional expressions of Rayalaseema, North Andhra and Telugu poetry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X