వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహుజన వాదానికి సాహిత్య "కుర్చీ"

కవి ఎలా ఉంటాడు?? ఒక జుబ్బా, జులపాలు, భుజానికి ఒక సంచీ, దాన్లో కవిత్వపు కట్టలు... అతన్ని చూస్తే చాలు జనమంతా భయపడిపోతారు..

|
Google Oneindia TeluguNews

కవి ఎలా ఉంటాడు?? ఒక జుబ్బా, జులపాలు, భుజానికి ఒక సంచీ, దాన్లో కవిత్వపు కట్టలు... అతన్ని చూస్తే చాలు జనమంతా భయపడిపోతారు.. ఇదీ కొన్ని సంవత్సరాలుగా సినిమాల్లో, కథల్లో, కార్టూన్లలో కవి రూపం.., నిజానికి కవి అలా ఉంటాడా?? పోనీ ఒక యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య, వందల పుస్తకాలుండే లైబ్రరీల మధ్య, నిరంతర సాహితీ గోష్టులు, శాలువాలు సన్మానాలు..!? లేదు... కాస్త దగ్గరగా ఉన్న మరేదో తక్కువ.. పోనీ కొంచం మోడరన్ టచ్.. రెండు వేళ్ళ మధ్య సిగరెట్, సాయంత్రానికి ఒక మద్యం సీసా అలవోకగా పెదాలమీద ప్రపంచ రాజకీయాలు... బస్..! అయిపోయిందా.. కవి ఇలానే ఉంటాడా? ప్రపంచాన్ని గుప్పిటపట్టగల కవికి అవతారాలు లేవా..??

సరే ఇంకాస్త వెతుకుదాం చేతిలో సిగరెట్ కాదుగానీ ఒక కత్తెర, అదీ జుట్టు కత్తిరించేది.. కత్తి నరకటం, కోయటం కాదుగానీ గడ్డం గీసే కత్తి.. రోజంతా షేవింగ్, కటింగ్, రకరకాల మొహాలని తడిమి తడిమి, తుడిచి తుడిచి... కవి ఇలా ఉంటాడా?? సాహిత్యాన్ని సృజించే చేతులు అలా ఉంటాయా అంటే సమాధానం.. అవును మనిషిని ప్రత్యక్షంగా తాకితేనే కదా, చెమట వాసనని గాఢంగా పీల్చగలిగితేనే కదా... కవిత్వం మనిషి గుండెని చేరేదీ. ఇంతకీ ఇలాంటికవి ఉన్నాడా..??

నాగర్ కర్నూల్.. నల్లవేల్లి రోడ్డులో ఒక సెలూన్ ఉంటుంది., లోపలికి వెళ్తే షేవింగ్ క్రీమ్, ఆఫ్టర్ షేవ్ లోషన్, నవరత్న తైలం వాసనలతో కూడిన చెమటవాసన.. "నాకుర్చీ లో జనమంతా రాజులే... నాది జాతీసేవలో తరించే కుర్చీ" అంటూ బహుజన తత్వం, శ్రామిక జాతి ఆవేశం కలిసిపోయి కనిపిస్తాడు. నల్లటి వొంటిరంగు అంతకన్నా తెల్లని నవ్వు.. అతనే కవి.. వనపట్ల సుబ్బయ్యా అని జనం పిలిస్తే... "నా పేరు మంగలి సుబ్బయ్య" అని అతను చెప్పుకుంటాడు... బాలమ్మ మా అమ్మ బాలయ్య కొడుకుని అని చెప్పటమూ మర్చిపోడు...

సకలజనుల సమ్మెకోసం

సకలజనుల సమ్మెకోసం "వొల్లెడ"

తెలంగాణా ఉద్యమమే నన్ను కవిని చేసింది. అని చెప్పే ఈ కవి ప్రతీ కవితలోనూ దళిత బహుజనతత్వాన్నే తలకెత్తుకున్నాడు. ఔనూ..! ఏ ప్రేయసి ఒడిలోకో, మరే అభూత కల్పనల వలలోకో తన వాక్యాన్ని జారిపోనివ్వలేదు. ఆకలీ, పీడనా తనచుట్టు తిరుగుతుంటే ఎలా నడుంఒంపుల్లో కవిత్వాన్ని సేద తీర్చేది, వెన్నెల వానల్లో వాక్యాన్ని ఉరేగించేది? ప్రతికవితా ఒక నిరసన, ప్రతీ పదం ఒక ధిక్కారం., తెలంగాణా మలిదశ ఉద్యమాల కాలంలో సుబ్బయ్య ఆక్రోశ ప్రకటన సకలజనుల సమ్మెకోసం "వొల్లెడ" గా బయటికొచ్చింది. ప్రతీ పదం తెలంగాణా తిరుగుబాటు తత్వం, ప్రతీకలన్నీ దళిత బహుజన జీవితాలలోనివే. ఉద్యమకాలం లో వచ్చిన కవిత్వం లో వొల్లెడ ఒక నిప్పు దివిటీ అయ్యింది. సినారె పురస్కారాన్ని అందుకుంది..

"మశాల్" దీర్ఘ కవిత

కవిత్వం ఒక నిరంతర వేదన, అనంతానంత శబ్దతరంగాలను సృష్టించే యుద్ధభేరీ నిశ్శబ్దంగా ఉండగలదా.. మోగింది.. మళ్లీ మళ్లీ వీరతెలంగాణా గొంతుకతో "మశాల్" గా వచ్చింది. మాలి దశ తెలంగాణా ఉద్యమం లో 2009 డిసెంబర్ 9 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించినట్టే ప్రకటించి వెంటనే మాట మార్చింది అప్పటి ప్రభుత్వం.. యావత్ తెలంగాణా భగ్గున రగిలింది.. ఆ మోసానికి గుండె మండిన ఘోష "మశాల్" దీర్ఘ కవిత గా వెలువడింది...

మశాల్ అంటే రగిలే కాగడా

మశాల్ అంటే రగిలే కాగడా

"బద్మాష్‌పాలన" ని ఏమాత్రం భయం లేకుండా ఎండగట్టాడు.. "ఇంక మీ నీడను కూడా మేం తొక్కలేం. మీ గాలిని కూడా మేం పీల్చుకోలేం. మాకిప్పుడు పది జిల్లాల తెలంగాణే కావాలి" అంటూ వచ్చిన మశాల్ చదివే ప్రతీ పాఠకున్నీ తెలంగాణా ఉద్యమం లోకి నడిపించింది. ఇది అతిశయోక్తి అనిపించవచ్చేమెగానీ... "వెయ్యి దుశ్శాసనుల మధ్య నా బతుకమ్మ బోనమెత్తుకొని నడవగలదా??" అంటూ ప్రశ్నించిన వాక్యం చాలదా ఇప్పుడు సైతం రోమాలు నిక్కబొడిపించే ప్రశ్న.. గుండెలనిండా ఉద్యమ స్ఫూర్తి నింపుకున్న కవగాక మరెవరు రాయగలరీ వాక్యాన్ని..? మశాల్ అంటే రగిలే కాగడా అని అర్థం వెలుగును ఇవ్వగలదు.. పెనుజ్వాలలతో దగ్దమూ చేయగలదు....

జూలూస్-పూర్తి స్థాయి బహుజన గొంతుక

జూలూస్-పూర్తి స్థాయి బహుజన గొంతుక

అదే కాలంలో సీనియర్ జర్నలిస్ట్ సామిడి జగన్ రెడ్డి సంపాదకత్వం లో వచ్చిన జూలూస్ లో తెలంగాణా గళం జూలు విదిల్చింది. సుబ్బయ్య కవిత్వం అక్కడకూడా మోగింది. అంతమంది కవులతో, ఆర్టిస్టులతో వచ్చిన జూలూస్ ఆ సమయానికి తెలంగాణా సాహిత్యం లో ఒక చిన్న పాటి రెవల్యూషన్ అనిపించుకుంది. అందులో వచ్చిన కొన్ని కవితలతో తెలంగాణా ఆవిర్భావం తర్వాత వచ్చిన "కుర్చీ" ఒక పూర్తి స్థాయి బహుజన గొంతుక...

సామాన్య జీవితాల కన్నీటి స్పర్శ

సామాన్య జీవితాల కన్నీటి స్పర్శ

తాము కవులుగా నిలబడాలనుకుంటే ఏ కాంట్రవర్సీ లేకుండా రాయాలన్న పద్ధతిని ఏమాత్రం పట్టించుకోలేదు..కవీకన్నా ముందు తనో యాక్టివిస్ట్ అన్న భావం నిరంతరం హెచ్చరిస్తూనే ఉందేమో 66 కవితల ఈ సంకలనం ఆద్యంతం ఆవేశ, ఆక్రోశ ప్రకటనగానే సాగింది.. సీమాంధ్ర పాలనలో ఛిద్రమైన తెలంగాణా ముఖ చిత్రం"జొన్న కంకులెలాడదీసే ఇండ్లముందు/ ఎండ్రిన్ డబ్బాలు/బుడ్డేడు పాలిచ్చే బఱ్ఱెకంటిలో /కన్నీటి కాగై మా ఊరు" అంటూ శిథిలా తెలంగాణా చిత్రాన్ని కవితలో గీశాడు. కుర్చీ మొత్తం సబ్బండ వర్ణాల అలంకరణలతో యుద్ధం నుంచి వచ్చిన వీరుడిలా అలంకరించాడు. పదంలో పథంలో తెలంగాణా బహుజన పరిమళం, సామాన్య జీవితాల కన్నీటి స్పర్శతో నిండిపోయింది.

బహుజన అభివృద్దే అజెండా

బహుజన అభివృద్దే అజెండా

"సాంచె భుజాన వేసుకొని బురుకపిట్టలతో వచ్చే ఫకీరు పాషా, కమ్మరోల్లా భావి, సంకన పిల్లనేసుకొని ఈత చాపలల్లే తల్లుల తో తెలంగాణా పల్లెని కాగితంమీద చూపించాడు.. కుర్చీ సంకలనం తెలంగాణా ఆవిర్భావం తర్వాతే వచ్చినా ఉద్యమకాలంనాటి కవిత్వాన్ని నింపుకుంది. అయితే ఆలొచనాపరుడిగా ఉన్న సామాజికుడెవ్వడూ ఒక ప్రాంతానికో, మరే సంకుచిత భావనికో కట్టుబడి ఉండలేడు. విశ్వనరుడు కావాలన్న కాంక్ష అతన్ని ఒక్క చోట నిలవనివ్వదు. అందుకే సుబ్బయ్య కవిత్వమూ, ఆయన ఆలోచనా కేవలం తెలంగాణా విముక్తి పోరాటం దగ్గరే ఆగిపోలేదు. తెలంగాణా విమోచన అన్నది తాత్కాలిక లక్ష్యమే నిజానికి ఈ కవిలో పేరుకుపోయిన తత్వం బహుజన అభివృద్దే.

కలేకూరి ప్రసాద్ స్మృతి కవిత

కలేకూరి ప్రసాద్ స్మృతి కవిత

బిందెడు నీళ్ళకే తలలు తెగిపడ్డ కారం చేడులో /తలెత్తుకొని తిరుగుతున్నాం/ చెప్పులు చేతపట్టుకొని నడిచిహ్న చుండూరులో/కాలరెగరేసి కాలు మీద కాఏసుకుని కూసున్నామనుకుంటే/నీ ఉధ్యమస్పూర్తే/అంబేద్కర్ని ఆరధించటం కాదు/అంబేద్కరిజాన్ని ఆయుధం చేసి పోరాడాలన్న/మీ బోదనలకు/నా సామాజిక సలాం... అంటూ (యువక) కలేకూరి ప్రసాద్ స్మృతి కవితలో రాసుకున్న ఈ కవి తన ఆలోచనా మార్గం ఏమిటో, తన అంతిమ లక్ష్యం ఎక్కడ ఉందో ముందే రాసిపెట్టుకున్నాడు.

నాకుర్చీ పేదవాడి చర్చీ

నాకుర్చీ పేదవాడి చర్చీ

వృత్తిని నమ్మిన వాడు, కష్టాన్ని దాటి పక్కదారి చూడని వాడు అనుభవం లోలేని మిథ్యా ఊహలవైపు ఎట్లా చూడగలడు? అందుకే తనవృత్తి లో నుండే కవిత్వాన్ని తయారు చేసుకున్నాడు. సామ్రాజ్య వాదాన్ని ఎదిరించినా, "అధికార పీఠం అంటే మంగలిషాపూ కుర్చీకాదు అంటూ" కూసిన "పెద్దాయన" ను దిక్కరించినా తన పనినే ఆయుధం చేసుకోవటం ఇంకా శ్రమమీద గౌరవం ఉన్న మనస్తత్వానికి ప్రతీకలే కదా.... "మేస్త్రీ..! నీది నాలుగు పడగల హైదవ కుర్చీ, నాది సమతా ధర్మం సాయుధ కుర్చీ" అంటూ శ్రామిక వర్గపు మనస్తత్వాన్ని చెప్తూ వచ్చి "మేస్త్రీ..!/ ఒకటి చెప్పనా/ నాకుర్చీ పేదవాడి చర్చీ అంటూ ముగిస్తాడు. ఔను చెమట చిందే క్షేత్రం కన్నా పవిత్రమైనచోటెక్కడ???

కమ్యూనిజం మీద వ్యతిరేకత కాదేమో

కమ్యూనిజం మీద వ్యతిరేకత కాదేమో

అయితే ఎందుకనో ఈ కవికి కమ్యూనిస్టుల మీద మాత్రం కొంత వ్యతిరేకభావమే కనబడింది బహుశా అది కమ్యూనిజం మీద వ్యతిరేకత కాదేమో. అంతర్జాతీయ సమస్యలకు కూడా స్పందించి పక్కనే జరుగుతున్న సామూహిక హననాలని కూడా పట్టించుకోని రంగు పూసుకు తిరిగే కొన్ని పార్టీల మీద అసహనమై ఉండవచ్చు. బూర్జువాలనూ భూస్వాములనూ/ కోటగుమ్మలకు వేలాడదీసి/ కమతాలను పంచిన కమ్యూనిస్టులే/ కెమికల్ కంపెనీలకు/ రెడ్ కార్పెట్లు పరుస్తుండ్రు అంటూ తానో పీడిత గామమమై నంది గ్రామై రోదించాడు.... వ్యవసాయ భూములు వ్యాపారమైతే/ సమసమాజం శ్రేయోరాజ్యం/సుదూర స్వప్నమే కామ్రేడ్స్ అంటూ పచ్చని పంటపొలమై ఆక్రోశించాడు.. బహుజన వాదానికి కుర్చీ వేసాక వర్సమై కురిసీ, కాలవై ప్రవహించీ ఊరచెరువయ్యాడు. మరో ధీర్ఘ కవిత గా "ఊర చెరువుగా తనని తాను పచ్చని తెలంగాణా కాంక్షగా వెల్లబోసుకున్నాడు.

ఊరచెరువై

ఊరచెరువై

రక్తపు మరకల తెలంగాణా నేల సస్యశ్యామలమైనట్టు కలని కంటూనే ఉన్నాడు, ఆ కలలో తను ఊరై చెరువై కాలువై తెలంగాణా పల్లె తలాపున ఊరచెరువైపోయినట్టు కలని కంటూనే ఉన్నాడు. తేట నీటిని మీకిడిసి/ బురదంతా నేను మింగిన/బొట్టు బొట్టు వదిలి/ బొక్కలు తేలిన" అంటూ ఎండిన చెరువై విలపించిన కవి ఎండిపోయి నీసు వాసనొస్తూంటే/ ముక్కు మూసుకొని పోతిరిగానీ/అయ్యో మాకు బువ్వ పెట్టిన కన్నతల్లని /ఎప్పుడూ విచారించలే.. అంటూ కన్నీటి కాసారమై ఆక్రోషించిన కవి.. "పలుగు పారలతో ప్రజలంతా కదిలి/ చేయి చేయి కలిపి చెరులే తోడితే/కాకతీయుల నాటి కాలువలేవస్తయి/ బంగారు తెలంగాణా బాటలే పడ్తయి/తెలంగాణా తల్లి కోటికాంతులై వెలుగుతది" అంటూ ఒక ఆశావహ దృక్పథం తో ముగిస్తాడు... ఔను కదా శ్రామికుడు స్వాప్నికుడు కాకుంటే కొత్త ఆవిశ్కరణే పుట్టదు, కొత్త సమాజానికి బాట కూడా పడదు...

శ్రామిక కవి

శ్రామిక కవి

ధిక్కారం, అసహనం, గుండెబద్దలయ్యే వలపోత సబ్బండ స్వరమై, ఆదిమానవ గాత్రమై, ద్రవిడ రుద్రుడి ఢమరుకమై మోగింది... ఈ కవి... కాదు శ్రామిక కవి.., మంగలి కవి తన భాషలో ప్రతిఙ్ఞ రాసుకున్నడు, తన పనిముట్లతో ప్రతీకలని చేసుకున్నడు గోరుగాలూ, మంగలి కత్తీ, తదితర సామాగ్రిని భుజాన వేసుకొని ఈ భూ క్షేత్రం మీదకి దండెత్తిండు.. ఔనూ కవిగాడై ఏం చేసాడు??? భాషకు మైలపోలు పోశిండు, తెలంగాణా యాసకు తలంటు బోశిండు, బహుజన కవిత్వానికి సన్నాయి ఊదిండూ, మామిడాకులు కట్టిండు... సాంస్కృతిక మరణాలకు తానే ముందు మైల స్నానం చేసిండు.... ఒక సాంస్కృతిక, ఆర్థిక దాడికి గురైన తెలంగాణా బహుజన జాతిని విముక్తం చేసే పనిలో ఆధిపత్య భావజాలనికి కర్మకాండ చేసిండు...

కవితా పురస్కారాలు

కవితా పురస్కారాలు

2012 వ సంవత్సరానికి గానూ సాహితీ గౌతమి కరీం నగర వారి 23వ రాష్ట్ర స్థాయి కవితా పురస్కారం

2014 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం కీర్తి పురస్కారం

2015 యం వీ నరసింహారెడ్డి రాష్ట్రస్థాయి పురస్కారం

2016 బోయినపల్లి వెంకటరామారావు (బొవేరా) పురస్కారం,

2016 నవతెలంగాణా నిర్వహించిన వట్టికోట ఆళ్వారు స్వామి స్మారక రచనల పోటీలో ప్రత్యేక బహుమతి

2017 తెలంగాణా రాష్ట్రస్థాయి తేజ పురస్కారం ఇలా ప్రతీ చోటా వనపట్ల భావజాలన్ని మరింతగా తెలంగాణా సమాజం గుర్తిస్తూనే వచ్చింది... ఇదిగో ఈ సంవత్సరానికి మళ్ళీ ఒకసారి "తెలంగాణా సాహిత్య వేదిక" వనపట్ల సుబ్బయ్యని మరోసారి సత్కరించనుంది.

తెలంగాణా సాహిత్య కళావేదిక

తెలంగాణా సాహిత్య కళావేదిక

తెలంగాణా సాహిత్య కళావేదిక 2017 సంవత్సరానికి గానూ వనపట్ల సుబ్బయ్యకి క్షమించాలి మంగలి సుబ్బయ్యకి వార్శిక పురస్కారం చెయ్యబోతోంది, 27 ఆగస్టు 2017 న సుందరయ్య విఙ్ఞాన కేంద్రం లో జరగబోయే ఇదే వేదికమీద మిర్గం - తెలంగాణా కవిత్వం పుస్తకావిష్కరణ కూడా జరగబోతోంది. అమ్మంగి వేణుగోపాల్, కేగోవిందు, ఏనుగు నరసిమ్హారెడ్డి, ఆచార్య ఘంటాచక్రపాణి, (జింబో)రాజేందర్, నాళేశ్వరం శంకరం, కవియాకూబ్ లాంటి ప్రముఖ సాహితీవేత్తలూ, సీనియర్ జర్నలిస్టులూ రానున్నసభలో... వనపట్ల సుబ్బయ్య ని చూడాలనుకుంటే ఈ ఆదివారం సాయంత్రం... సుందరయ్య విఙ్ఞాన కేంద్రం, భాఘ్ లింగం పల్లి కి వచ్చేయండి...


(వనపట్ల సుబ్బయ్యకు "సాహిత్య కళావేదిక పురస్కారం" ప్రదానం చేస్తున్న సందర్భంగా)

- నరేష్కుమార్ సూఫీ

English summary
Naresh Kumar Sufi analyses Telugu poet Vanapatla Subbaiah's poetry book Kurchee (chair).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X