వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు వైపులా పదును

By Pratap
|
Google Oneindia TeluguNews

short story
''లక్ష్మినారాయణ కొడుకు ఇంజినీరింగ్‌లో చేరాడట'' అన్నాడు రవీందర్‌ భార్య సుజాతతో. సుజాతకు లక్ష్మినారాయణంటే అంతగా గిట్టదు. గిట్టకపోవడానికి ఆమె ఉండాల్సిన కారణాలు ఆమెకు ఉన్నాయి.

''రెండు చేతులా సంపాయించేది అట్ల పెట్టడానికేనాయె. ఇంతకీ ఏ బ్రాంచ్‌లో చేర్చాడట?'' అంది ఆమె. లక్ష్మినారాయణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తాడు. దానితో పాటు చిట్టీలు నడుపుతాడు. చిన్నప్పుడు లక్ష్మినారాయణ, రవీందర్‌ కలిసి చదువుకున్నారు. వారిద్దరి వృత్తులే కాదు, ప్రవృత్తులూ పూర్తి భిన్నమైనవే. పని వుంటేగానీ లక్ష్మినారాయణ ఎవరినీ కలవడు. అలా వీరిద్దరూ చాలా కాలం ఒకరికొకరు దూరంగానే వున్నారు. ఓసారి లక్ష్మినారాయణ అకస్మాత్తుగా రవీందర్‌ ఇంటికి ఊడిపడ్డాడు. ఎప్పుడు కలిసినా లక్ష్మినారాయణ సంభాషణ ఆరోపణలతో మొదలవుతుంది.

''ఏందిరా బై ఎప్పటికి మేం కలవాల్సిందే గని నువ్వు కలిసేదుండది'' అన్నాడు లక్ష్మినారాయణ.

రవీందర్‌ నవ్వి ''నేను కలవకపోతే నువ్వు కలవొచ్చు కదా'' అన్నాడు.

ఆ మాటలను పట్టించుకోకుండా ''ఫోన్‌ చెయ్యవు. ఇంటికి రావు'' అన్నాడు లక్ష్మినారాయణ.

''ముందు కూర్చో'' అని చెప్పి టీ పెట్టమని రవీందర్‌ భార్యకు చెప్పాడు.

''బాగున్నరా, అన్నయ్యా! సుమతి ఎట్లుంది?'' అని అడిగింది.

''ఏం బాగమ్మా, గడియ పుర్సత్‌ లేదు దమ్మిడి ఆదాయం లేదు. మీ వదినెకేంది బాగనే వుంది. తెస్తే పెడతా లేకుంటే లేదు అంటది'' అన్నాడు.

ప్లాస్టిక్‌ కుర్చీలో కూర్చున్న లక్ష్మినారాయణకు ఎదురుగా మరో కుర్చీ లాక్కుని కూర్చున్నాడు రవీందర్‌.

''ఏందివయ్యా, సోఫాలన్నా కొనుక్కోవా? ఎంతెనుకేసినవేంది?'' అన్నాడు లక్ష్మినారాయణ.

లక్ష్మినారాయణ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రవీందర్‌కు కాస్తా ఇబ్బందిగానే వుంటుంది. చాయ్‌ తీసుకొని వస్తూ ఆ మాటలు విన్న సుజాత - ''వెనకేయడానికి మా ఆయనేం దందాలు చేస్తడా? నెల జీతం వస్తే తిన్నట్టు లేకుంటే లేదు'' అంది.

ఆ మాటలకు లక్ష్మినారాయణ కాస్తా కంగు తిన్నట్లు కనిపించాడు. ''మేం దందాలు చేసి బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నమా, ఏంది? జానెడు పొట్టకు జెర్రిపోతులాట'' అన్నాడు.

చాయ్‌ ఇచ్చేసి రవీందర్‌ భార్య లోనికెళ్లిపోయింది.

చాయ్‌ తాగుతూ ''ఏందివయ్యా, జీతం బాగనే వస్తదట. ఏమన్న కాపాయం చేసుడుందా, లేదా?'' అన్నాడు.

''ఈ ఫ్లాట్‌ కొన్నమా, నెల నెలా ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టడమే పెద్ద కష్టంగా తయారైంది'' చెప్పాడు రవీందర్‌.

''రాసుడు, పూసుడు నడస్తనే వుందా? ఏం రాస్తవయ్యా? రాస్తే పైసలిస్తరా? ప్రశ్నల మీద ప్రశ్నలు. రవీందర్‌ కథలూ, కవిత్వమూ రాస్తుంటాడు. వృత్తి కూడా జర్నలిజమే.

''ఏమొస్తయి, ఏం రావు''

''మరి ఎందుకు రాయాలవయ్యా, పేరు కోసమేనా?''

రవీందర్‌ నవ్వి ఊరుకున్నాడు. కానీ అతనిలో ఆలోచన మొదలైంది. తాను ఎందుకు రాస్తున్నాడో ఇప్పటికీ తనకే కచ్చితమైన అంచనా లేదు. రచనలతో ఏదో మేరకు ప్రజలను మార్చవచ్చునని తాను నమ్ముతాడు. కానీ రచనల వల్ల సమాజాన్ని సమూలంగా మార్చేయగలమనే నమ్మకం మాత్రం అతనికి లేదు. ఉండబట్టలేక రాసిన సందర్భాలే ఎక్కువ. దీన్ని లక్ష్మినారాయణకు చెప్పి తనను సమర్థించుకునే సత్తా రవీందర్‌ వద్ద లేదు.

''ఓ చిట్టెయ్యరాదూ!'' అని మెల్లగా ముగ్గులోకి దింపాడు లక్ష్మినారాయణ. సరేనని చెప్పి ఓ చిట్టీ రాసుకోమన్నాడు రవీందర్‌. ఈ చిట్టీల సంగతి రవీందర్‌కు పెద్దగా తెలియదు. వాటిని పాడుకోవడం ఎలాగో కూడా ఎన్నడూ కూడా ఎరుకలేదు. ఎవరో ఒకరు సన్నిహితులు అడగడం అతను చిట్టీలు వేయడం, అవసరం వచ్చినప్పుడు వారినే ఎత్తమనడం, వారిచ్చినంత తీసుకోవడం గత పదిహేను ఇరవై యేళ్లుగా జరుగుతూనే వుంది. కొన్ని కొన్నిసార్లు వాయిదాలు చెల్లించడం ఆలస్యమైనా వారు సర్దుకుపోయేవారు. అలాగే అనుకుని లక్ష్మినారాయణకు కూడా ఆకుపచ్చ జెండా ఊపాడు.

''ఈ నెల షురూ అయితుంది. పది నెలల పాటు నీకు 1600 రూపాయల కన్నా ఎక్కువ పడది. మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ ఇచ్చేయ్యి రాదూ'' అన్నాడు. డబ్బులు తెచ్చి ఇచ్చేశాడు.

ఆరు నెలల పాటు సాఫీగానే సాగిపోయింది. అనుకోకుండా ఒక నెల ఆలస్యం జరిగింది. లక్ష్మినారాయణ ఫోన్‌ల మీద ఫోన్‌లు చేయడం మొదలుపెట్టాడు. దగ్గరి స్నేహితుడు కదా, అర్థం చేసుకుంటాడని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఓ రోజు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో రవీందర్‌ ఇంట్లో లేడు.

సుజాతను అడిగితే తనకు తెలియదని అన్నది. దాంతో ఊరుకోకుండా ''ఏందమ్మా! మీ ఆయనకు ఆ మాత్రం గతి లేదా! మేమన్నా రోడ్డు మీద అడుక్కునేవాళ్లమనుకున్నాడా? చేతకాకపోతే చిట్టీలు వేయొద్దు'' అన్నాడు.

ముందూ వెనకల చూడకుండా అలా అనేసరికి సుజాతకు అరికాలి మంట నెత్తికెక్కింది. ''నీ పైసలేమన్నా ఎగ్గొట్టి పారిపోతున్నామా? వెనకో ముందో ఇస్తాం కదా! అయినా పెద్ద బాకీ ఉన్నట్లు మాట్లాడతవేంది?'' అన్నది. దాంతో లక్ష్మినారాయణ చరచరా వెళ్లిపోయాడు.

ఇంటికి రాగానే సుజాత రవీందర్‌ మీద అగ్గి మీద గుగ్గిలమైంది. ''చిన్నప్పటి ఫ్రెండంటవు. ఈ మాత్రానికే ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నాడు. అసలు ఊరోళ్లతోటి డబ్బుల వ్యవహారాలు పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను. చిట్టీ కట్టడానికి కూడా డబ్బులు లేవని ఊరంతా ప్రచారం చేస్తాడు. డబ్బులేమైనా కట్టుకపోతాడా?'' అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది. కాస్తా ఊపిరి తీసుకుని - ''మీ ఆయనకు సెల్‌ లేదా అని అడిగాడు. లేదంటే ఏమన్నాడో తెలుసా?''

''ఏమన్నాడు?'' అని ప్రశ్నించాడు.

''ఫోన్‌లు చేసి పైసలడగుతరని సెల్‌ పెట్టుకోడేమో అన్నాడు. వాడికి మనమెట్లా కనిపిస్తున్నాం?'' అంది.

''వ్యాపారాలు చేసే వాళ్లకు, బిజినెస్‌ అసైన్‌మెంట్స్‌ జారిపోతాయేమో అనుకునేవాళ్లకు సెల్‌ కావాలి. నాకెందుకు? ఆఫీసులో ఫోనుంది, ఇంట్లో ఫోనుంది, సరిపోదా?'' అన్నాడు.

''అది వాడికి అర్థమైతే కదా!''

''కొందరు అలానే వుంటారు, వదిలేయరాదూ!'' అన్నాడు. ఎంతో సేపటికి గాని ఆమె చల్లబడలేదు.

ఇంత వరకు లక్ష్మినారాయణ మాదిరిగా డబ్బుల విషయంలో నిలదీసిన సందర్భాలు రవీందర్‌కు ఎదురుకాలేదు. తెల్లారే ఫోన్‌ చేసి డబ్బులు ఇచ్చేశాడు. లక్ష్మినారాయణతో ఒక్క మాటా మాట్లాడలేదు. ప్రతి నెల మొదటి ఆదివారంనాడు డబ్బులు తీసికెళ్లమని చెప్పాడు. ఆ అనుభవం ఎదురైనప్పటికీ రవీందర్‌ లక్ష్మినారాయణతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోలేకపోయాడు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి లక్ష్మినారాయణ అంటే సుజాతకు గిట్టడం లేదు.

''కంప్యూటర్‌ సైన్స్‌'' చెప్పాడు.

ఇంతలో లోపల చదువుకుంటున్న రవీందర్‌ కొడుకు చిన్న బయటకు వచ్చి - ''ఏంది డాడీ?'' అని అడిగాడు.

''లక్ష్మినారాయణ కొడుకు ఇంజనీరింగ్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాడు'' అని చెప్పాడు.

''ఎంసెట్‌ 60 వేల ర్యాంకు వచ్చిందన్నావు. ఆ బ్రాంచ్‌ ఎలా దొరికింది?'' అన్నాడు.

''మందిని ముంచి సంపాదించోటళ్లు చేరక ఏం చేస్తరు!'' అని అంది సుజాత.

''ఏంది డాడీ! మమ్మీ అలా మాట్లాడుతుంది?'' అని అడిగాడు చిన్న

''మేనేజ్‌మెంట్‌ కోటాలో సీటు సంపాదించాడు. ఆరు లక్షల రూపాయలు కట్టాడట'' చెప్పాడు రవీందర్‌. చిన్నకు వచ్చిన ర్యాంకు కూడా ఇసిఇ లేదంటే కంప్యూటర్‌ సైన్స్‌ వచ్చేదే. అయితే ప్రైవేట్‌ కాలేజీలో వచ్చేది. అయితే మంచి కాలేజీలో వచ్చేది కాదు. నిజానికి వాడు ఎంసెట్‌కు ప్రిపేర్‌ అయి వుంటే గవర్నమెంట్‌ కాలేజీలో సీటు వచ్చే ర్యాంకు వచ్చి వుండేది. రాష్ట్రంలో ఐఐటి హవా నడుస్తుంది. దాంతో ఎవరో నూరిపోయడంతో వాడు తండ్రి చెప్పినా వినకుండా ఐఐటి ట్రైనింగ్‌లో చేరాడు. మొదటి సారి ఐఐటిలో సీటు రాలేదు. మళ్లీ లాంగ్‌ టర్మ్‌ అంటూ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాడు.

''డబ్బులు కడితే మన ఇష్టమైన బ్రాంచ్‌లో సీటు దొరుకుతుందా, డాడీ?'' అని అడిగాడు. నిజానికి చాలా మంది పిల్లలకు ఈ విషయం తెలిసి వుంటుంది. అటువంటి విషయాలు తెలియకుండా పెంచాడు రవీందర్‌. పైగా ఐఐటి కోచింగ్‌ అనేసరికి నిత్యం అదే ధ్యాస అయిపోయింది వాడికి. ఇతరత్రా విషయాల మీద దృష్టి పెట్టే తీరిక కూడా లేకుండా పోయింది.

''మేనేజ్‌మెంట్‌ కోటాలో ఆ అవకాశం వుంటుంది'' చెప్పాడు రవీందర్‌. ఆ విషయం చెప్తున్నప్పుడు అతనికి లోన బాధేసింది. రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు తెరిచారు. అవి కిరాణా కొట్లలా తయారయ్యాయి. ఇంజనీరింగ్‌ అయిపోయిందని అనిపించుకుంటే కాస్తా ఉద్యోగాలు లభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్‌ ఎంత కాలం వుంటుంది. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ పరిస్థితి కూడా మామూలు గ్రాడ్యుయేట్‌కు పరిస్థితికి దిగజారదనే గ్యారంటీ ఏమీ లేదు. అయితే ఈ ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా చాలా వరకు రాజకీయ నేతలవి, వారి బంధువులవే. ర్యాంకుతో సంబంధం లేకుండా సీట్లు ఇచ్చే పద్ధతి ఉండడం వల్ల డబ్బులు, పలుకుబడి వున్నవాళ్ల పిల్లలు ఇంజనీరింగ్‌ విద్యను సులభంగా చదివే వెసులుబాటు కలిగింది. దాంతో పాటు చాలా వరకు ప్రైవేట్‌ సంస్థల్లోనే ఉద్యోగావకాశాలు ఉంటాయి కాబట్టి అదే డబ్బు, పలుకుబడితో ఉద్యోగాలు కూడా వారికి సులభంగా దొరికే అవకాశం వుంది. పాలకులు, సంపన్నవర్గాలవారు, ఉన్నతాధికారులు తమ పిల్లలకు జీవనాధారాన్ని కష్టపడి చదవకుండానే కల్పించుకునే ఏర్పాటు చేసుకున్నాయేమోనని రవీందర్‌ ఆలోచన.

''మనలాంటి వాళ్లకే ఇబ్బంది'' అంది సుజాత. ఆ మాట అనడంలోని అర్థం రవీందర్‌కు అర్థం కాకపోలేదు. అయితే చిన్న ముఖంలో విషాదమో, నిర్లిప్తతో చెప్పలేని భావం రవీందర్‌కు కనిపించింది. దానికి రవీందర్‌ నొచ్చుకున్నాడు. అన్నిటి కన్నా ముఖ్యంగా వాడు మంచి మనిషిగా ఎదగాలనేది రవీందర్‌ ఆలోచన. అదే సమయంలో జీవితంలో డబ్బు కోసం అర్రులు చాచకుండా తనకు కావలిసిందేమిటో నిర్ణయించుకుని ఆ మేరకు సంపాదించే ఏర్పాటు చేసుకుంటే తను సంతోషిస్తాడు. అందుకనే ఐఐటి రాకపోయిన ఎమ్మెస్సీ మాథమెటిక్స్‌ చేసినా చిన్న సౌకర్యంగా బతకగలడనేది రవీందర్‌ ఆలోచన. అదే విషయం చాలా సార్లు భార్యతో అన్నాడు. ''వాడిష్టంతో చదవాలె గానీ వాన్ని చదువుకోమని ఇబ్బంది పెట్టొద్దు'' అని ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నాడు. ఇలా అన్నప్పుడు ''నీలాగ వుండడం అందరికీ సాధ్యం కావద్దా?'' అంటుంది.

''చాలా మందితో పోలిస్తే లక్ష్మినారాయణ చాలా చిన్నవాడు'' అన్నాడు రవీందర్‌.

''చిన్ననో, పెద్దనో! మీ చదువులు ఎందుకు పనికి వస్తున్నాయి'' అంది.

''సంపాదించే యావలో జీవితమంతా గడిచిపోవడం నాకిష్టం లేదు''

''సరేలే'' అంది వ్యంగ్యంగా.

''హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాల్లో ఎన్ని దారుణాలో! ప్రభుత్వాలకు దగ్గరగా వున్నవాళ్లు, పలుకుబడి గలవాళ్లు, తిమ్మిని బమ్మిని చేయగలవాళ్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. వాటిలో మనలాంటి వాళ్లు తట్టుకోలేరు'' అన్నాడు. అది ఆమెను ఉద్దేశించి అన్నాడో, తనకు తానే సమాధానం చెప్పుకున్నాడో రవీందర్‌కు అర్థం కాలేదు. అలా అనుకోవడం అసమర్థతేమో కూడా. ప్రభుత్వ పెద్దలు కూడా ప్రబోధిస్తున్న కాంపిటీటివ్‌ స్పిరిట్‌ తనలో లోపించిందేమో కూడా అనుకున్నాడు. ఈ పరుగు పందెంలో ఎంత మంది గెలుస్తారు? కాళ్లు విరిగి పడిపోయే లేగదూడలు చాలానే వుంటాయి. అందరికీ ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలు తమ వైఫల్యాలకు కూడా తామే బాధ్యులమనే అభిప్రాయాన్ని ప్రజల్లో నాటుకుపోయేందుకు వేసిన ఎత్తుగడ కాదు గదా!

రీడింగ్‌ రూమ్‌లోకి వెళ్లిన చిన్న పుస్తకం మూసేసి మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు. వాతావరణాన్ని తేలిక చేయడానికి రవీందర్‌ అతని వద్దకు వెళ్లాడు.

''ఏంది నాన్నా?'' అన్ని చిన్నను అడిగాడు.

''ఏం లేదు. రిజర్వేషన్‌ కోటా కూడా పెరుగుతున్నది. సీటు రావాలంటే మునుపటి కన్నా తక్కువ ర్యాంకు రావాలి కదా'' అన్నాడు. ''అసలు ఈ రిజర్వేషన్లు అన్యాయం కదా!'' అని వాడే అన్నాడు. మేనేజ్‌మెంటు కోటా సీట్లది ఒక సమస్య అయితే ఇది మరో సమస్య. మేనేజ్‌మెంటు కోటా ఏమో గానీ రిజర్వేషన్ల పట్ల మాత్రం తమ పిల్లలకు పాజిటివ్‌ దృక్పథం అలవరచడం అవసరమని రవీందర్‌ అభిప్రాయం.

దాదాపు 18, 19 ఏళ్ల కిందటి మాట. రాష్ట్రంలో మురళీధర్‌ రావు కమీషన్‌ నివేదికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్ద యెత్తున వ్యతిరేకత ఎదురైంది. రిజర్వేషన్‌ వ్యతిరేకోద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఇంజనీరింగ్‌, వైద్య విద్యార్థులే. నాయకత్వ స్థాయిలో వున్నవారు సంపన్నుల పిల్లలు, ఉన్నతాధికారుల పిల్లలు, ప్రభుత్వంలోనివారి పిల్లలు. అయితే కాంపిటీషన్‌లో గెలిచి సీట్లు సంపాదించుకున్న మధ్యతరగతి అగ్రవర్ణాల పిల్లలు కూడా దానికి అనుకూలంగా మారారు. వామపక్ష విద్యార్థి సంఘాలలోని అగ్రవర్ణాల పిల్లలు కూడా అటు వైపు మొగ్గు చూపడం రవీందర్‌ గమనించాడు. అప్పుడప్పుడే ఒక దినపత్రికలో రిపోర్టర్‌గా చేరిన రవీందర్‌ మీద ఈ రిజర్వేషన్‌ అనుకూల, వ్యతిరేకోద్యమాలను కవర్‌ చేసే బాధ్యత పడింది. పైగా అప్పుడప్పుడే యూనివర్శిటీ బయటకు రావడం వల్ల, వామపక్ష విద్యార్థి సంఘంలో కాస్తా పనిచేయడం వల్ల ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులతో అతనికి ఏదో మేరకు సంబంధాలున్నాయి. దాంతో వాటిని చాలా దగ్గరగా చూసే అవకాశం కలిగింది.

ఎంబిబియస్‌ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘంలో చురుకుగా పాల్గొంటున్న తమ్ముడు నరేందర్‌రెడ్డి కూడా రిజర్వేషన్‌ వ్యతిరేకోద్యమంలోకి వచ్చాడు. అది రవీందర్‌కు నచ్చలేదు. ఓ రోజు పనిగట్టుకుని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ హాస్టల్‌కు వెళ్లి తమ్ముడ్ని కలిశాడు. అన్న చూడగానే ''ఏంది వ్యాసం అట్లా రాసినవు?'' అడిగాడు నరేందర్‌ రవీందర్‌ను కనీసం కూర్చోమనైనా చెప్పకుండా.

''ఏం రాసిన?'' అడిగాడు.

''నీ వ్యాసం చదివి నా క్లాస్‌మేట్స్‌ నన్ను తిడుతున్నారు'' అన్నాడు.

''ఏ క్లాస్‌మేట్స్‌?''

దానికి ఏం చెప్పాలో అర్థం కాక ''క్లాస్‌మేట్స్‌ అని చెప్తున్నా కదా!'' అన్నాడు.

''ఎస్‌సి, బిసి క్లాస్‌మేట్స్‌ ఏమంటున్నారు?'' అని అడిగాడు రవీందర్‌.

''మీ అన్నను చూసి నేర్చుకోరాదూ! రెండు వైపులా నాకు తిట్లే'' అన్నాడు.

''మేం కొత్త రూపాల్లో ఉద్యమాలు చేస్తుంటే ఎంత రెస్పాన్స్‌ వస్తుందో తెలుసా?'' అన్నాడు.

''అవును, నేనూ చూస్తూనే వున్నా. కానీ బూట్లు పాలిష్‌ చేయడం, రోడ్లు ఊడ్వడం మీరు చేస్తే కొత్తగా వుంటుంది. ఉన్నత వర్గాల పిల్లలు కదా! కానీ అది శ్రమ సంస్కృతిని కించపర్చడం కాదా? లెఫ్ట్‌ మూవ్‌మెంటులో పనిచేశావు. నీకు అర్థం కాలేదంటే లోపం ఎక్కడుందో నాకు తెలియడం లేదు'' అన్నాడు రవీందర్‌.

''ఏమో, నాకదంతా తెలియదు. రిజర్వేషన్లు ఇంకా పెరిగితే మనలాంటి వాళ్ల గతేమవుతుంది?''

''ఏమవుతుంది? ఏమీ కాదు. ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు దొరుకుతున్నాయా? కొద్ది మంది అగ్రవర్ణాలవారికి తగ్గుతాయేమో. సమాజంలో మనకన్నా కింద వున్నవాళ్లు పైకి రావాలి కదా! దీనికి కాస్తా పెద్ద మనసు ఉండాలి. శతాబ్దాల అణచివేత, నిరక్షరాస్యత, సమాజంలో వారి ఉనికే లేకపోవడం చూస్తే మనతో పాటు అవకాశాలను అందుకోవడానికి రిజర్వేషన్లు అవసరమే. అయితే రిజర్వేషన్లు అవసరమనేది నా అభిప్రాయం. కానీ రిజర్వేషన్లను వ్యతిరేకించడానికి శ్రమ సంస్కృతిని కించపరచడం మాత్రం సహించరానిది'' అన్నాడు రవీందర్‌ ఆవేశంగా.

తమ్ముడు ఒక రకంగా ప్రశ్నిస్తే, కొడుకు మరో రకంగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలు భయం నుంచి వచ్చినవే తప్ప వివేచన నుంచి, విజ్ఞానం నుంచి పుట్టినవి కాదనేది రవీందర్‌ అభిప్రాయం. రోజూ జరిగే సంఘటనలు కూడా ఈ భయాలకు కారణమని కూడా రవీందర్‌ అనుకుంటూ వుంటాడు. చదువుకున్నవారిలో ఎంత మందికి ఉద్యోగాలు దొరుకుతన్నాయి, దొరికినా ఏదో ఉద్యోగమనే తప్ప చదువుకు తగిన ఉద్యోగాలు దొరుకుతున్నాయా? ఇలా ఆలోచిస్తే అసలు సమస్య ఎక్కడుందో, ఏ రూపంలో ఉందో అర్థమవుతుందని అతను అనుకుంటాడు.

''సొసైటీలో అణచివేతకు గురైనవారికి రిజర్వేషన్ల అవసరం ఉంది. దాన్ని మనలాంటి వాళ్లు వ్యతిరేకించకూడదు'' అని చెప్పాడు కొడుకుకు రవీందర్‌.

''మా క్లాస్‌మేట్‌ సతీష్‌ కారులో వస్తాడు'' అన్నాడు. ఆ మాటలో ఎన్నో అర్థాలు స్ఫురించాయి రవీందర్‌కు. ఆరేళ్ల కింద కొన్న బైక్‌ తప్ప మరోటి లేదు రవీందర్‌కు. అదీ అప్పు చేసి కొన్నదే. ఇన్‌స్టాల్‌మెంట్స్‌ కట్టడానికి నానా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

''కారులో వచ్చే సతీష్‌లాగా అందరూ లేరు కదా! సతీష్‌లాంటివాళ్లు చాలా కొద్ది మంది. ఊళ్లకు వెళ్లి చూస్తే వాళ్ల పరిస్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది'' అన్నాడు.

''మళ్లా సతీష్‌లాంటివాళ్లే రిజర్వేషన్లను ఉపయోగించుకుంటారు కదా'' అన్నాడు.

''ఆ మాట మనం అనకూడదు. మనం ఎస్‌సిలకు, బిసిలకు రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్నాం. అదే పద్ధతిలో రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది ఉన్నత స్థానాలు పొందినవారు, సంపన్నులైనవారు తమతమ వారి గురించి సానుభూతితో ఆలోచించాలి. అప్పుడు అటువంటివాళ్లు సరైన నిర్ణయం తీసుకుంటారు'' అన్నాడు రవీందర్‌.

''ఊరికెనే వదులుకుంటారా?'' అని చాయ కప్పుతో అక్కడికి వచ్చిన సుజాత అంది.

''మా ఫ్రెండ్‌ రాములు వదులుకోలేదా? వాళ్ల పిల్లలకు రిజర్వేషన్లు వాడుకోవడం లేదు'' అన్నాడు.

''అందరూ అలా వుంటారా?'' అన్నది. అలా వదులుకోవడం అంత సులభం కాదనే విషయం రవీందర్‌కు తెలుసు. అలా వదులుకునే పెద్ద మనసే వుంటే మాలలు ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకించేవారే కాదు. రెండు ఉపకులాల మధ్య శత్రుపూరిత వైఖరి ఉండేది కాదు. తన తమ్ముడు, కొడుకులాంటివారి మానసిక స్థితి సామూహికమై ఘర్షణలు తలెత్తుతున్నాయి. మాలల పరిస్థితి కూడా అదే. వారిని కూడా అనడానికి ఏమీ లేదు. అందరికీ అవకాశాలు లభించినప్పుడు ఈ ఘర్షణలు ఉండవు. ఈ విషయాన్ని చెప్పలేక - ''నిజానికి నా ఆలోచన కూడా సరైందో కాదో తెలియదు. దీన్ని కూడా ఆ వర్గాలవాళ్లే ఆలోచించుకోవాలేమో!'' అన్నాడు.

''సరేలే. ఇదంతా వాడికి అర్థమవుతుందా?'' అన్నది. దాంతో టీ చప్పరిస్తూ బయటకు వచ్చాడు రవీందర్‌.

*********

ఆ రోజు ఆదివారం.

చిన్న డైలీ పేపరు తిరగేస్తూ వుంటే చూశాడు రవీందర్‌. న్యూస్‌ పేపర్లో ఏ వార్తలు చదవుతాడనేది గమనించాలనిపించి దగ్గరగా వచ్చాడు. తండ్రి దగ్గరికి రావడం గమనించి ''అన్బుమణి రాందాస్‌కు బుద్ధి లేదు. వేణుగోపాల్‌ మీద అతనికి కొపమెందుకు, డాడీ?'' అని అన్నాడు.

ఆ ప్రశ్నతో వీడేదో సీరియన్‌ విషయాల్లో మునిగిపోతున్నాడనపించింది రవీందర్‌కు. కాస్తా భయం కూడా పుట్టింది. ఇవన్నీ ఆలోచిస్తూ వాడు చదువును నిర్లక్ష్యం చేస్తాడేమోననే ఆలోచన నుంచి పుట్టిన భయం అది.

''వేణుగోపాల్‌ మేధావి. ప్రతిభావంతుడే కానీ అన్బుమణి రాందాస్‌ ఆలోచన వేరు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులను, డాక్టర్లను అతను పురికొల్పుతున్నాడని రాందాస్‌ అభిప్రాయమనుకుంటా. అలా పురికొల్పడమే నిజమైతే వేణుగోపాల్‌ది తప్పే'' అన్నాడు.

''తప్పెట్లయితది? రిజర్వేషన్లు ఎందుకు చెప్పు. వాళ్లు కూడా మనలాగా చదవొచ్చు కదా!'' అన్నాడు.

ఇంకా రిజర్వేషన్ల గొడవ వీడి మనసులో నుంచి తొలగిపోలేదన్న మాట అనుకున్నాడు. అది తొలిగితే తప్ప వాడు మళ్లీ చదువులో పడడని అనిపించింది రవీందర్‌కు. ''చదువు అనేది కేవలం పుస్తకాలను చదవడం వల్ల వచ్చేయదు. నువ్వు తక్కువ చదివినా నీకు మంచి మార్కులు వస్తాయి. కొంత మందికి రావు. ఎంత చదివినా కొంత మందికి మంచి మార్కులు రావు. చదివినా కూడా మంచి మార్కులు రానివారు ఎవరో ఎప్పుడైనా గమనించావా? చదువు అనేది మనం పుట్టి పెరిగిన వాతావరణం వల్ల కూడా అబ్బుతుంది. మన ఫ్యామిలీలో, మన చుట్టాల్లో చాలా మంది చదువుకున్నవారే. అందువల్ల నీకు చదువు చాలా ఈజీ అవుతుంది. మీ జీన్స్‌ అటువంటివి అందరూ బాగా చదివేవాళ్లే ఆంటీ అంటుంది చూడు అదన్న మాట. చుట్టూ చదువుకున్నవాళ్లు లేని కులాల నుంచి వచ్చినవాళ్లు, ముస్లింలకు చదువు అంత సులభం కాదు. వాళ్లు ఇంట్లో మాట్లాడే భాషకు, వారి ఆచారవ్యవహారాలకు పుస్తకాల్లో పాఠాలకు ఏమీ సంబంధం వుండదు. ఒక కొత్త భాషను, కొత్త సంస్కృతిని అర్థం చేసుకోవడానికే బోలెడు టైం పడుతుంది. ఆ తర్వాత చదివి మార్కులు సంపాదించాల్సి వుంటుంది. అందుకని రిజర్వేషన్లు అవసరం. మనలాగా చదవాలంటే వాళ్లకెట్లా కుదురుతుంది, చెప్పు'' అని పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు రవీందర్‌.

సగం అర్థమైనట్లు, సగం అర్థం కానట్లు చూసి స్పోర్ట్స్‌ పేజీలోకి వెళ్లిపోయాడు చిన్న.

వాడు ఏమీ మాట్లాడకపోయే సరికి రవీందర్‌ నిరాశ చెందాడు. వాణ్ని సమాధాన పర్చడానికి మళ్లీ తానే అన్నాడు. ''అయినా నీకు అవన్నీ ఎందుకు చెప్పు. కాస్తా ఎక్కువ కష్టపడి చదివితే నువ్వు అనుకున్నదాని కన్నా మంచి ర్యాంకు వస్తుంది. అప్పుడు రిజర్వేషన్లు పెరిగినా నీకు సీటు వస్తుంది. అయినా గురి లక్ష్యం వైపు వుంటే సాధించడం పెద్ద కష్టం కాదు'' అని అన్నాడు.

పేపరు చూస్తూనే ''బాగానే చదువుతున్నా'' అన్నాడు చిన్న.

వంటింట్లో వస్తూ ''పేపరు ఆపించు'' అని అంది సుజాత.

ఆ మాటకు రవీందర్‌ నొచ్చుకున్నాడు. ''పిల్లలు అన్నీ నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటూ పోతే చదువులు మూలన పడతయి'' అంది. రవీందర్‌ మాట్లాడలేదు.

''నేను చదువుతూనే ఉన్నా కదా, మమ్మీ!'' అని అన్నాడు చిన్న.

''నువ్వు చదవడం లేదని అనడం లేదు. ఇంకా బాగా చదువు అని చెప్తున్నా'' అంది.

''అట్లాగేలే'' అన్నాడు వాడు.

కొడుకును ప్రిపేరు చేస్తున్నాడే గానీ రవీందర్‌ మనసులో మరో సంఘర్షణ చెలరేగుతూ వుంది. తనకు ఎదురైన సమస్యను పరిష్కరించుకోలేక అతను సతమతమవుతున్నాడు. ఆ విషయం తెలిస్తే సుజాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడమే కాకుండా ఇక ఏ మీటింగులకూ వెళ్లకూడదని కట్టడి చేస్తుంది. వాళ్లను కలవొద్దని షరతు పెడుతుంది. ఆమెకు చెప్పలేకపోవడం వల్ల బాధ మరింత తీవ్రంగా వున్నట్లనిపిస్తున్నది.

ఆ రోజు మామూలుగానే అక్కడికి వెళ్లాడు.

కొంత మంది రచయితలు, కవులు అప్పుడప్పుడు ఆ ఇరానీ హోటట్లో కలుసుకుంటారు.

ఆ రోజు రవీందర్‌ వెళ్లే సరికి వాతావరణం వేడి వేడిగా కనిపించింది. తీవ్ర స్వరాలతో మిత్రులు అరుచుకుంటున్నారు. చూస్తూ నిలబడిపోయాడు. పోషయ్య కోపంగా లేచి కుర్చీని వెనక్కి తన్ని సర్రున లేచి బయటికి వెళ్లిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ కోపంలో రవీందర్‌ను గట్టిగా ఢీకొట్టాడు.

పడబోయిన వాడు నిలదొక్కుకుని రవీందర్‌ మీదికి అరిచాడు పోషయ్య. రెండు మూడు బూతు మాటలన్నాడు. రవీందర్‌ సముదాయించి ప్రయత్నం చేశాడు. ''నువ్వేందిరా నాకు చెప్పేది'' అంటూ మరిన్ని బూతు మాటలు తిట్టాడు. పోషయ్య ఉన్నాడు. పోషయ్య దళిత భాషలో మంచి కవిత్వం రాస్తాడు. చాలా కథలు కూడా రాశాడు. ఆ కథలకు సాహిత్యలోకంలో మంచి పేరు కూడా వచ్చింది

దాంతో ఉండబట్టలేక ''ఏమైందని తిడుతున్నావు?'' అడిగాడు.

''ఏం గావాలె. అసలు నువ్వెందుకు రాస్తవు చెప్పు'' అని మళ్లీ తిట్ల పురాణం ఎత్తుకున్నాడు పోషయ్య.

''ఎందుకు రాయొద్దో చెప్పు. నేను దళితులను బలపరుస్తూనే రాస్తున్నా. అందుకు నేను పొందిన అవమానాలు, పడిన నిందులు నీకెరుక లేదా?'' అన్నాడు రవీందర్‌.

''చెప్తే నీకు గాదారా? రాయొద్దని చెప్తున్నానా, లేదా?'' అంటూ రవీందర్‌ను ఎడాపెడా కొట్టసాగాడు. రవీందర్‌ ఏ మాత్రం ప్రతిఘటించలేదు. అక్కడున్న మిగతా ఇద్దరు ముగ్గురు మిత్రులు పోషయ్యను ఆపే ప్రయత్నం చేశారు. వాళ్లను మధ్యలోకి రావద్దని చెప్పాడు రవీందర్‌. వాళ్లు నిశ్చేష్టులై చూస్తూ వుండిపోయారు. పోషయ్య కొట్టడం ఆపేశాడు. రవీందర్‌ మారుమాట్లాడకుండా వెనుదిరిగి పోవడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో పోషయ్య రవీందర్‌ కాలర్‌ పట్టుకుని ''తిడితే మాట్లాడవు. కొట్టినా మళ్లా కొట్టవేందిరా?'' అని అన్నాడు. రవీందర్‌ మాట్లాడకుండా విడిపించుకునే ప్రయత్నం చేయసాగాడు.

''కొట్టురా! నన్ను కొట్టు!! ఇద్దరం కొట్టుకుందాం. ఎవడి సత్తా ఏందో చూసుకుందాం'' అన్నాడు పోషయ్య. కొద్దిసేపు కాలర్‌ పట్టుకుని వెనక్కూ ముందుకూ లాగి వదిలేసి కుర్చీలో కూర్చున్నాడు. అ వ్యవహారాన్నంతా హోటళ్లో అందరూ చూస్తూనే వున్నారు. మిత్రులే ఏమీ మాట్లాడకుండా ఉండిపోయేసరికి మిగతా వాళ్లు కూడా జోక్యం చేసుకోలేదు.

మిగతా మిత్రులు బతిమిలాడుతున్నా నిలబడకుండా రవీందర్‌ బైక్‌ స్టార్ట్‌ చేసుకుని వెనుదిరిగాడు.

ఒళ్లు తూలుతున్నట్లు అనిపిస్తే ఓ పాన్‌ షాపు దగ్గర అపి సిగరెట్టు కొనుక్కుని కాల్చడం మొదలుపెట్టాడు. పొగ రింగులు రింగులుగా వదులుతూ ఆలోచనలో పడ్డాడు. హోటల్‌ నుంచి తన వెనుకే వచ్చినట్లున్నాడు సురేష్‌ రెడ్డి. బైక్‌ న్యూట్రల్‌ చేసుకుని ఆపి ''నీకు బాగయింది, నిన్ను తన్నాల్సిందేరా బై. నాకయితే నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాలనిపిస్తది'' అని గేయిర్‌ మార్చి సర్రున దూసుకెళ్లిపోయాడు రవీందర్‌ రియాక్షన్‌ కూడా ఎదురుచూడకుండా.

సురేందర్‌ రెడ్డిని రవీందర్‌ అర్థం చేసుకోగలడు. కానీ పోషయ్య ప్రవర్తనే ఆశ్చర్యకరంగా వుంది రవీందర్‌కు. ఆ ఆశ్చర్యంలో హఠాత్తుగా - ఉదారత కూడా అగ్రకుల అహంకారమేనేమో అనిపించింది రవీందర్‌కు.

అలా అనిపించే సరికి సగం చచ్చిన కులం మళ్లీ కొత్త రక్తం నింపుకుని బుసకొడుతుందని భయం వేసింది.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
This Telugu short story explained the compexity of caste and reserbations in modern society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X