భూపాల రాగం

Kavitha
పురుగుమందుకు మనుషులంటేనే ఎందుకో అంత ప్రేమ !
విషం మిథైల్ ఐసో సైనేట్ మారు వేషంలో
నగరం మీద విరుచుకుపడిన చీకటి క్షణాల ముందు
హిరోషిమా నాగసాకీ బాంబు దాడులే కాదు
'తొమ్మిదీ పదకొండు' ఉగ్ర దాడులు కూడా దిగదుడుపే !

టోపీల వాడి మాయాజాలమంటే అంతే మరి!
మనకి ఊపిరాడదని మన తలుపుకే కన్నం వేసే కంతిరితనం వాడిది.
అప్పుడెప్పుడో వాస్కోడిగామా వచ్చి మిరియంమొక్క అడిగినా
కంపెనీవాడొచ్చి మూడడుగుల నేలడిగినా
మన కళ్ళుకప్పి మాడుమీద వాడి జెండా దిగేయ్యటానికే!
మన కండలు పిసికి పండించిన పంటను ఓడల కెత్తుకెళ్ళటానికే.
అదిప్పుడు పాత కథ.

కొత్త కథలో..
వామనుడు అడగక ముందే నెత్తి చూపించే అమాయక బలి చక్రవర్తులం మనం
భూమిని చాపలా చుట్టి వాడి పాదాల ముందు పరచటానికి
పోటీలు పడే కలియుగ దానకర్ణులం.

మన రూపాయి ప్రాణవాయువును
వాడి డాలరు బతుకుతెరువు కోసం
తృణప్రాయంగా సమర్పించుకునే
పిచ్చి బేహారులం

వాడి విమానాలు క్షేమంగా దిగాలని
మన వూళ్ళు కూల్చుకుని
రహదారులు విశాలంగా చేసుకునే
విశాలహృదయులం

వాడి నాలిక మడత పడటం లేదని
మన మాటను సంకరం చేసుకునే టందుకయినా సంకోచపడం.
వాడి అణుదుకాణాల కోసం
మన అన్నపూర్ణ కడుపులో చిచ్చు పెట్టుకోటానికయినా మనం సిద్దం.

సార్వభౌమత్వమంటేనే ఒక చమత్కారం
ఆ డాబు దర్పాలకి మురిసి చప్పట్లు కొట్టటమే మనకు గొప్పతనం.

అణుఒప్పందం వల్ల భవిష్యత్తులో జరిగే భారతీయ చెర్నోబిల్ నాటకానికి
పాతికేళ్ళ క్రిందటే ప్రారంభమయింది
భూపాల రాగం... వింటున్నారా!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+