ఉన్నది లేనట్లు... లేనిది ఉన్నట్లు...

మొండి గోడ మీంచో చూస్తుంటా..
అందరూ పెద్దవాళ్లయి పోయారు
నా సావాసగాళ్లే...
కిరీటాలు, భుజకీర్తులు
గగుర్పాటు, నిశ్చేష్ట..
చిర్రగోనె ఆడినట్లుగానో
గోలీలాట ఆడినట్లుగానో..
కలిసే కలిసే పాడాం, కలిసే నడిచాం
సాలు పెట్టి, విత్తనాలు వేశాం
పంట కోతకొచ్చింది...
అందరూ పెద్దవాళ్లయ్యారు
మహాకాయులు అయిపోయారు
మంత్రగాళ్లూ, మాయా మాంత్రికులు అయిపోయారు
ఎర్రగా కాకపోతే గులాబీ రంగులోనైనా మెరిసిపోతున్న
రంగేయని నన్ను చూసి
ముఖం తిప్పుకునో, తెలియట్లుగానో వారంతా తప్పుకుంటుంటే
బాగోతం మహా రసపట్టులో ఉన్నట్లే అనిపిస్తున్నది
పిల్లులు జూలు దువ్విన సింహాలై పోయినట్లే
స్టేజీ ప్రదర్శన అద్భుతం, అమోఘం..
అంతా భ్రాంతి... ఓ మంత్రజాల వీక్షణ
ఏమందు, ఏమందు..
కిటికీలోంచో
మొండి గోడ మీంచో చూస్తుంటా
నాకు భలే సరదా...
- కాసుల ప్రతాపరెడ్డి












Click it and Unblock the Notifications