తెలుగు కవిత: కిస్మత్
ఎవలో ఒంట్లోని నరాల్ని పగ్గంబట్టి గుంజి
బద్దితోడి పాతరేసినట్లు
ఏరుబడితెనే ఏలుబడుంటదని
బంధాన్ని పుటుక్కున తెంపుకున్న ల్యాతాకు గాలిపటమైనట్లు
నడిసొచ్చినప్పుడు ఇసిరిన న్యాలసూపులు
ఎల్లెల్కల పడంగనే మొగులును ముద్దిచ్చుకున్నట్లు
అముడాల పిల్లలు పుట్టంగనే.. అద్దాలు ఎక్కిరిచ్చినట్లు
షిమ్మశీకటి చేతుల్ని బార్లాసాపి
ప్రేమగీతం పాడినట్లు
లావర్షి మాటల ముండ్లు గుచ్చుకుని
కలుక్కుమన్నబాధ సుల్కుసుల్కున పొడిషినట్లు
అన్నీ..కన్నీళ్లే
అన్నీ...కలవరింతలే
దుక్కం ఎంత ఆపుదమన్న ఆగుతలేదు
ఆగిపోయిన పెండ్లికి సప్పుల్లెందుకని
ఒక్కొక్కలు సాపకింద నీళ్లలెక్క జారుకుంటాన్రు
కాల్జేతులు ఆడుతలెవ్వు
గుండెకాయ బొండిగెలకొచ్చింది
కక్కుదునా..పానంబోతది
ఏం జేయాల్నోదోత్తలేదు
మొకబిల్ల పడుదమంటే
ఎదుటోని మొఖంల నెత్తురు సుక్క కనబడతలేదు
దేనికైనా..కిస్మత్ ఉండాల్నని
ఎట్టయితె అట్టాయెనని..
గుండె దిటవుజేసుకుని
మనసు..ఒక్క షిత్తం జేసుకున్న !
- భండారి రాజ్‌కుమార్













Click it and Unblock the Notifications