తెలంగాణ రుబాయీలు

Anugu Narasimha Reddy
రుబాయీలు కావు ఇవ్వి రుబాబు మాటల్
ఉర్దూ మాగాణంలో లేచిన తోటల్
తెలంగాణ హృదయానికి ఒప్పిన కవనం
హెద్రబాదు శారదకీ కైతల పాటల్

తెలుగు జాతి ఒక్కటని అంటుంటారు
విడిపోవుట పడిపోవుటకనుకుంటారు
విడిపోయే కాలమొస్తే ఆంధ్రా అన్నల్
హైద్రబాదు మీద కలలు కంటుంటారు

హైదరాబాద్ చుట్టూరా భూములన్ని ఎవరివి ?
బంజారా జూబ్లి హిల్స్ భావనాలవి ఎవరివి ?
తెలంగాణ కండ్లల్ల దుమ్ముగొట్టి లేచినట్టి
టాంకు బండు మీద నున్న విగ్రహాలు ఎవరివి ?

జూబ్లి హాలు ఆక్రమించి మురువబడ్తిరి
అసెంబ్లిని అందుకోని అరువబద్తిరి
ఆ భవనం ఆ నిషాని హైద్రబాదుది
ఫలక్నుమా ప్యాలేసును అమ్మబద్తిరి

బాగె ఆమ్ పేరు మార్చి భ్రష్టు జేస్తిరి
నవాజు జంగు బిల్డింగును కూలదోస్తిరి
ఒకటి కాదు రెండు కాదు మీ నిర్వాకాలు
చరితగల్ల బంగాళా సమమది చేస్తిరి

చుట్టురా పరిశ్రమలు పెట్టేశారు
ఆర్ధిక సంస్థల నిధులు కొట్టేశారు
తమలాభం తమకెగాని పరుల గోడు ఎందుకు
కెమికల్సును ప్రజల మీది కొదిలేశారు

గోలకొండకూ రాళ్ళు ఎత్తిండ్రంట
చార్మినార్ డంగు వాళ్ళు తొక్కిండ్రంట
ఆంధ్రోల్ల మాటలంటే అవసరాల మూటలు
హైదరాబాదును వాళ్ళే కట్టిండ్రంట

ఒక్కొక్క ఇటుక పేర్చి నిర్మించాలి
సీమంధ్రులు స్వేదంతో సృజియించాలి
హైదరాబాదు చూరుకు వేలాడే బదులు
మరో ఆంధ్ర నగరినిపుడు నిర్మించాలి

సిటీలైట్ హొటల్లో విశాదముంది
సిటీ లోన అడుగడుక్కు చరిత్ర ఉంది
కాలంతో పయనించే కాలువ ఈ నగరం
అడుగడుగున రాచరికం అగుపడుతుంది

సచివాలయ బ్లాకులన్ని ఆంధ్రా జాగీర్
హెచ్ ఓ డీ లల్ల నిండ కోస్తా జంజీర్
రూల్సు గీల్సు ఉంటె గింటే తెలంగాణ కోసమే
జిల్లా దాటె జోను దాటె ఆంధ్రా కాఫీర్

అన్నదమ్ములోలె మనం వేరుబడక తప్పదు
అవసరాల కొరకు తిరిగి చర్చించక తప్పదు
పాలివాండ్ల మూలమంత ఎపుడైనా ఒక్కటే
చెరోవైపు అభివృద్ధికి పరుగులిడక తప్పదు

ఎలగందుల ఖిలా మీద నెమలి నాట్యమాడింది
చార్మినార్ కోసల మీద కలకొయిల పాడింది
పది జిల్లల తెలంగాణ ప్రకటనయే వచ్చిందని
తెలంగాణ జనావళి మోదంతో ఆడింది

అరశాతాబ్ది విచక్షణను భరించింది ఏల ?
అడ్డులేని దోపిడీని సహించింది చాల !
ఆత్మాహుతికొడిగట్టిన ఆకాంక్షలు యువతవి
కోరి పోరి వేరుబడెను తెలంగాణ నేల

పరస్పరం అపనమ్మకమెప్పటికీ ముప్పే
తరం తరం వెనకబడుట ఎపుడైనా తప్పే
అందరికీ జ్ఞానం ఇచ్చేది కాలమొక్కటే
తెలుగు వాళ్ళకిపుడు రెండు రాష్ట్రాలు గొప్పే

ఆవేశం ఇప్పుడికడ ఉల్టా సీదా
శత్రువెవ్వడో మనకు తెలిసీ బాధా
ఆయుధాన్ని తమవైపే ఎక్కుపెట్టుకున్న తరం
ఎగిసిపడే ఆకాంక్షకు అద్దం కాదా ?

బాంచెన్ దొర అనమంటే కుదరదిప్పుడు
నలుదిక్కుల ఇపుడు తెలంగాణ చప్పుడు
ఆకాంక్షను అణచేస్తీ దేశమై లేస్తదేమొ
తెలియదు ఈ నేలకెపుడు మడమదిప్పుడు

తెలంగాణ ఎపుడిస్తరొ ఎవ్వరికెరుక
కాంగీయులు ఢిల్లీపై పూనరు కినుక
ఇంత చర్చ ఇంత రచ్చ ఏమవసరము ?
ఇంటిపోరు లేక ఏది తేలదు కనుక

స్వార్ధ నాయకుల చేతికి చేర్చబడ్డది
తెలంగాణ అపుడెపుడో భంగపడ్డది
ఏది కూసినా నమ్మే ప్రజావళి లేదు నేడు
నాయకులను నిలదీసే శక్తి దొడ్డది

హైదరాబాద్ చుట్టూరా భూములన్ని ఎవరివి ?
బంజారా జూబ్లి హిల్స్ భావనాలవి ఎవరివి ?
తెలంగాణ కండ్లల్ల దుమ్ముగొట్టి లేచినట్టి
టాంకు బండు మీద నున్న విగ్రహాలు ఎవరివి ?

- -ఏనుగు నరసింహా రెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+