తెలంగాణ జలియన్ వాలాబాగ్
నలుగురు పచ్చగుంటె
ఓర్వలేనితనం
పచ్చని పొలాలు సూత్తె
కడుపుమంట
దోసుకెల్లడమే తెల్శినోల్లను
దొర్కినోన్ని దొరికినట్టు
తూటాలకు బలిచ్చినోల్లను
పచ్చినెత్తురు తాగే రజాకార్లకు
ముచ్చెమటలు పట్టించిందక్కడే
నిజాంను ఎదురొడ్డి పోరాడిందక్కడే
కన్నఊరును కాపాడుకునేందుకు
కవచమై నిలిచిందక్కడే
మట్టిపై మమకారంతో
మర ఫిరంగులయిందక్కడే
మట్టిమన్సుల వీరోచిత పోరాటమక్కడే
నిజాం దొంగదెబ్బకు బలై
వీరులు నేలకొరిగిందక్కడే
నెత్తుటేరులై పారిన
చరిత్రకు ఆనవాల్లక్కడే
శవాల గుట్టల సుట్టు
బరిబాత బత్కమ్మలు ఆడించిందక్కడే
సహచరుల ఎడబాటుతో దుక్కసంద్రమై
అవమానపు బాధల్ని దిగమింగలేక
బొండిగెలు పిసుక్కున్నదక్కడే
బతికున్న శవాలై తిరుగాడుతున్నదక్కడే
అక్కడే....అక్కడే...
కండ్లముందు జరిగిన ఆకృత్యాలన్నిటికీ గవాయిని నేనే
నేనే... భైరాన్ పల్లి ని
తెలంగాణ జలియన్ వాలాబాగ్ ను
(27 ఆగస్టు 1948 న జరిగిన భైరాన్ పల్లి సంఘటనకు 69 ఏండ్లు)













Click it and Unblock the Notifications