కవిస్వరం: వెర్రిమాలోకం కవిత
చాలా రోజుల తర్వాత కవిసంగమం గ్రూపులో ఓ చిక్కని రాజకీయ కవిత కనిపించింది. భాస్కర్ కొండ్రెడ్డి రాసిన వెర్రిమాలోకం కవిత అది. నిజానికి, రాజకీయ కవిత్వంలో సాంద్రతను సాధించడం చాలా కష్టమైన పని. చాలాసార్లు వచనంగా తేలిపోతూ మనది మనకే అకవిత్వంగా అనిపించడం చూస్తాం. భాస్కర్ కొండ్రెడ్డి ఓ రాజకీయ తాత్వికతను చాలా నర్మగర్భంగా ప్రశ్నించినట్లు అనిపిస్తోంది.
భూమి కోసం జరిగే పోరాటాలను ఇతను తప్పు పడుతున్నాడా, పోరాట రూపాన్ని తప్పు పడుతున్నాడా అనే సందేహం ఈ కవిత చదివితే రాక మానదు. కానీ, ఓ అవాంఛనీయమైన సామాజిక పయనాన్ని లేదా రాజకీయ పయనాన్ని మాత్రం వేదనతో పలుకుతున్నాడు. "నీకో రహస్యం తెలుసా/ మనకి చంపడం, చావడం ఒక సరదా/దానికి నేలను ఎరగా వేస్తాం" అనేంతగా వర్తమాన పరిస్థితిని నిరసిస్తున్నాడు.
"వున్నది వున్నట్టు వుంచక పోవడం/ మనకో నిత్యానందం/ దానికి జీవితాలనైనా వదిలేస్తాం" అనడంలోని ఆంతర్యం ఏమిటో విడిగా చర్చించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ కవికి పొలిటికల్ కరెక్ట్‌నెస్ ఉందా అనేది ప్రశ్న. అసలు పొలిటికల్ కరెక్ట్‌నెస్ అంటే ఏమిటనే దాన్ని ఈ కవిత ద్వారా మనం చర్చకు పెట్టవచ్చునా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. నిజానికి, ఉద్యమాలు ప్రజల మేలును కోరే రూపు దిద్దుకుంటాయి. వాటిని మధ్య మధ్యలో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే ప్రశ్నను కూడా ఈ కవిత ముందుకు తెస్తోంది. ఏమైనా, కోపాల్ తాపాల్ లేకుండా ఈ కవితను చదవాల్సిందే..
- కాసుల ప్రతాపరెడ్డి

నేల నాదని ప్రకటించుకోవడం
మనకెప్పటికీ జన్మహక్కే.
ఒక జెండాను వొడిసి పట్టుకుని
గుండెల్లో నింపుకున్న విశ్వాసం పైకెగరేసి
శవాలను కాళ్లతో ముద్దాడుతూ
నడుస్తూ ఆ రక్తసిక్త మరణ నగరాల మీద,
ఆచంద్రతారర్క అత్యవసరం
ఈ నేల నాదని,
ఖచ్చితంగా ప్రకటించుకోవవడం.
మనం పోరాటాన్ని హత్తుకుందాం
ఈ రోజు చచ్చైనా సరే
రేపటి వాడి శవాన్ని కలగందాం
పిల్లల శరీరాలను ఫణంగా పెట్టైనా సరే.
నేల మనకెప్పటికి ముఖ్యం
వేల జీవితాలదేముంది
మళ్లీ మళ్లీ పుట్టుకొస్తునే వుంటాయ్.
ఏడుపులు పాత పడతాయ్,
చచ్చిన కళేబరాలు కొత్తనేలవుతాయ్.
పాత భూముల మీద కంబళ్లు పరుస్తాయ్.
నీకో రహస్యం తెలుసా
మనకి చంపడం, చావడం ఒక సరదా
దానికి నేలను ఎరగా వేస్తాం.
వున్నది వున్నట్టు వుంచక పోవడం
మనకో నిత్యానందం
దానికి జీవితాలనైనా వదిలేస్తాం.
రెండు చేతుల్లోకి ఎత్తుకుని
ఒక ఆత్మీయ విగతదేహాన్ని
దాని గుండెల్లో తలదాచుకుని విలపిద్దాం.
నేల ఎప్పటికి దుఃఖించదు
నీలా లేదా నాలా.
- భాస్కర్ కొండ్రెడ్డి
26/07/2014












Click it and Unblock the Notifications