2,700 ఏళ్ల కిందట తొలి సంపూర్ణ సూర్యగ్రహణం: ప్రాచీన చైనా రికార్డుల్లో షాకింగ్ విషయాలు..!!
ప్రాచీన చైనాకు చెందిన 2,700 ఏళ్ళ నాటి రికార్డులు.. భూభ్రమణం, సౌర కార్యకలాపాలకు సంబంధించిన అనేక విషయాలను ఆవిష్కరించాయి. క్రీస్తు పూర్వం 709 జూలై 17వ తేదీన సంభవించిన సూర్యగ్రహణ వివరాలు ఇందులో ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పటి గ్రహణ సమయంలో సూర్యుడి కరోనా వివరాలు ఈ లిటరేచర్ లో సమగ్రంగా పొందుపరిచారు. నాటి సూర్యగ్రహణానికి సంబంధించిన తొలి లిఖిత ఆధారం ఇదే.
ప్రాచీన భూగోళ- ఆధునిక ఖగోళ శాస్త్రాలను విశ్లేషించిన అనంతరం 709 సూర్యగ్రహణం సంభవించినట్లు అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్ధారించింది. ఇదే విషయాన్ని 2,700 సంవత్సరాల కిందటే అప్పటి చైనా లిటరేచర్ లో దీని పూర్తి వివరాలు ఉన్నాయి. లూ డచీ రాజధాని కుఫు రికార్డులతో భూభ్రమణ వేగం, గ్రహణం తీరుతెన్నులపై డేటాను సేకరించిందీ టీమ్. స్ప్రింగ్ అండ్ ఆటం ఎనల్స్ రికార్డును పరిశీలించింది.

"సూర్యుడు పూర్తిగా చీకటిమయం అయ్యాడు, నలుపురంగులో ఉన్నాడు.." అని ఈ ప్రాచీన గ్రంధంలో రాసి ఉంది. ఈ ఘటన చోటు చేసుకున్న ఏడు శతాబ్దాల తర్వాత రాసిన 'హాన్షు' (Book of Han) లో కూడా ఇదే విషయాన్ని రాశారు. సూర్యుడు పూర్తిగా నలుపురంగులో మారాడని, దాని చుట్టూ పసుపు పచ్చ రంగు వలయంగా ఏర్పడింది.. అని సూర్యగ్రహణం గురించి వర్ణించారు ఈ గ్రంధంలో. గ్రహణం సంభవించిన తర్వాత ఏడు శతాబ్దాలకు రాసిన బుక్ ఆఫ్ హాన్ లో సూర్యుడి కరోనా వివరాలను సైతం పొందుపర్చడం ఆశ్చర్యం కలిగించిందని హిసాషి హయకావా చెప్పారు.
ఇది గ్రహణం, సౌర కరోనాకు సంబంధించిన తొలి లిఖితపూరక వర్ణనల్లో ఒకటిగా అభివర్ణించారు. ఖగోళంలో చోటు చేసుకునే అద్భుతాలను చైనా రాజవంశీయులు శకునాలుగా భావించే వాళ్లు. గ్రహాణాల వంటి అంశాలు తమ పరిపాలనకు ప్రతిబింబంగా విశ్వసించి, వాటిని వివరణాత్మక ఖగోళ రికార్డుల్లో పొందుపర్చేవారని హిసాషి తెలిపారు. నాటి ఆ సంప్రదాయాలే అత్యంత నమ్మకమైన తొలి గ్రహణ డేటాను అందించాయని వివరించారు.
2,700 సంవత్సరాల క్రితం భూమి భ్రమణం వేగంగా ఉండేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. నాటి ఈ డేటా భూ పరిభ్రమణ అధ్యయనాల్లో ఉన్న అక్షాంశ లోపాలను సరిచేస్తుందని, దీనికి అదనంగా చారిత్రక ఖగోళ సంఘటనల కాల నిర్ణయం, పునర్నిర్మాణ ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుందని అభిప్రాయపడ్డారు. కుఫు సిటీ అక్షాంశ- రేఖాంశాలను సైతం సరిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుందని, ఇప్పుడున్న సిటీకి సరైన అక్షాంశాలు దాదాపు 5 నుంచి 8 కిలోమీటర్ల దూరం వరకు సవరణలు ఉండొచ్చని అన్నారు.












Click it and Unblock the Notifications