గతి తప్పి భూమి వైపు రాకాసి గ్రహశకలం- గంటకు 51,732 కి.మీ.వేగం
Asteroid: అంతరిక్షంలో గతి తప్పిన ఓ గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తోంది. భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ అస్టరాయిడ్ ఎత్తు, వేగం.. అంతరిక్ష పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాని వైపు దృష్టి సారించేలా, కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టే పరిస్థితిని కల్పించింది.
విశ్వాంతరాల్లో గ్రహ శకలాలు, ఉల్కాపాతాలు సర్వసాధారణమే. అవి దారి తప్పి దిశా తెన్నూ లేకుండా తిరుగాడుతుంటాయి. అనేక అస్టరాయిడ్స్ భూమికి అత్యంత సమీపంలో దూసుకెళ్లిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. వీటన్నింటికీ భిన్నంగా తాజాగా ఈ గ్రహ శకలం మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది.

దీని పేరు 2005 వీఓ5 (2005 VO5). దీని ఎత్తు 648 మీటర్లు. అంటే- కుతుబ్ మినార్ కంటే తొమ్మిది రెట్లు అధికం. తొమ్మిది కుతుబ్ మినార్లను ఒకచోట నిలబెడితే ఎంత ఎత్తు ఉంటుందో.. ఈ గ్రహశకలం అంత ఎత్తు ఉంటుదన్నమాట. దీని వైశాల్యం కూడా అదే స్థాయిలో ఉంటోంది. వైశాల్యం.. 660 డయా మీటర్లు.
అంత భారీ గ్రహ శకలం కావడం వల్లే అంతరిక్ష పరిశోధకులు, నాసా శాస్త్రవేత్తలు దీని కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోన్నారు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ.. ఈ పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం దీని వేగం ఎవరూ ఊహించనంతగా ఉంటోందని నాసా తెలిపింది. గంటకు 51,732 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని వివరించింది.
అదే వేగంతో ఈ నెల 11వ తేదీన భూమికి అతి సమీపం నుంచి వెళ్లనుందీ గ్రహశకలం. ఆ సమయంలో భూమికి- ఈ అస్టరాయిడ్ కు ఉండే మధ్య దూరం 60,86,084 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. 1988 జులై 1వ తేదీ తర్వాత ఇది భూమిని సమీపించడం ఇదే తొలిసారి. మళ్లీ ఈ గ్రహశకలం భూమిని సమీపించేది 2062లో.
ఇలాంటిదే మరో గ్రహశకలం.. వైఆర్4. 2032లో ఇది చందమామను ఢీ కొట్టడానికి గల అవకాశాలను 4.3గా నిర్ధారించింది నాసా. దాని కదలికల ఆధారంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలను నాసా కొట్టివేయట్లేదు. మరింత పెరిగే అవకాశమే ఉందని సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ వెల్లడించింది.
సాధారణంగా నాసా వేసిన అంచనాలేవీ తప్పవు. దాదాపుగా 100 శాతం ఖచ్చితత్వంతో కూడుకుని ఉంటాయి. ఈ పరిస్థితుల్లో వైఆర్ 4 చంద్రుడిపై ఎలాంటి ఉత్పాతాన్ని సృష్టిస్తుందనే ఉత్కంఠత నెలకొంది.












Click it and Unblock the Notifications