Gold News: పండగ పూట డిజిటల్ గోల్డ్ వైపు బయ్యర్స్ చూపులు.. పేమెంట్స్ యాప్స్‌లో ఈజీగా కొనేయొచ్చు
Digital Gold: దీపావళి పండుగలో మొదటి దినమైన ధంతేరస్ రోజున బంగారం కొనడం సాంప్రదాయంగా, శుభప్రదంగా భారతీయులు భావిస్తారు. అయితే బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో పాటు తయారీ ఖర్చులు వంటి అదనపు వ్యయాలు కూడా వాటికి యాడ్ అవుతున్నాయి. దీంతో భౌతికంగా బంగారం కొనడం అత్యంత ఖరీదుగా మారింది. ఈ పరిస్థితుల్లో డిజిటల్ గోల్డ్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. సౌలభ్యం, ఖర్చు తక్కువగా ఉండటంతో ఇదొక ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
డిజిటల్ గోల్డ్ కొనుగోలు విషయంలో అదనపు ఛార్జీల ఇబ్బంది ఉండదు. స్వచ్ఛత గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్ ధర ఆధారంగా కొనుగోలు లేదా విక్రయాలు నిర్వహించే సౌలభ్యం ఉంది. దీంతో ఇది సౌకర్యవంతమైన పెట్టుబడి ఎంపికగా మారుతోంది. అత్యల్పంగా కేవలం 1 రూపాయి నుంచి గరిష్ఠంగా రోజుకు 2 లక్షల మేర బంగారం కొనుగోలు చేసే అవకాశం డిజిటల్ గోల్డ్ విధానం కల్పిస్తోంది.

భౌతిక బంగారంతో పోలిస్తే డిజిటల్ గోల్డ్ ను విక్రయించడం చాలా సులభం. UPI ద్వారా నగదు బదిలీ తరహాలో చాలా తేలికగా ఉంటుంది. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు డిజిటల్ గోల్డ్‌ని భౌతిక బంగారంగా మార్చే అవకాశం కూడా కల్పిస్తున్నాయి. అయితే ఇందుకు కనీస బంగారం పరిమాణం 1 గ్రాము అవసరం. భౌతికంగా బంగారం విక్రయించేటప్పుడు వ్యర్థాలు మరియు తయారీ ఛార్జీల వల్ల ఏర్పడే నష్టాలు డిజిటల్ గోల్డ్ విషయంలో ఉండవు. ఇది ఎల్లప్పుడూ 24 లేదా 22 క్యారెట్లతో, 100 లేదా 91.6 శాతం స్వచ్ఛతతో కూడి ఉంటుంది.
MMTC-PAMP ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దేశంలోని ప్రముఖ డిజిటల్ గోల్డ్ ప్రొవైడర్. వినియోగదారులు ఈ సంస్థ అధికారిక వెబ్‌సైట్ నుంచి డిజిటల్ గోల్డ్‌ని నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఇదేకాకుండా డిజిటల్ గోల్డ్ కొనడానికి గూగుల్ పే, పేటీఎం మరియు ఫోన్‌పే వంటి ప్రముఖ డిజిటల్ చెల్లింపు యాప్స్ ఉత్తమ ప్లాట్‌ఫారమ్‌లుగా పనిచేస్తాయి. గూగుల్ పే లో 'గోల్డ్ లాకర్', పేటీఎంలో 'పేటీఎం గోల్డ్', ఫోన్ పే లో 'గోల్డ్' విభాగాల కింద డిజిటల్ గోల్డ్ కొనుగోలుకు అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications