అగ్నిపర్వతంపై ఉల్కాపాతం- అద్భుతం సాక్షాత్కారం
అంబరాన ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ అగ్నిపర్వతం పేలుతున్న సమయంలో ఓ భారీ ఉల్క దాని మీదుగా దూసుకెళ్లింది. ఓ అగ్నిగోళంలా మండిపోయింది. ఆకుపచ్చని ఉల్క అది. మొదట ఈ ఉల్క అగ్నిపర్వతాన్ని ఢీకొట్టిందని భావించారు గానీ అది నిర్ధారణ కాలేదు. భూకంపం, ఇన్‌ఫ్రాసౌండ్, వీడియో డేటాను విశ్లేషించిన అనంతరం ఆ భారీ ఉల్క.. భూమిని చేరకముందే వాతావరణంలో విచ్ఛిన్నమైందని తేలింది.
ఫిలిప్పీన్స్‌లో ఈ ఘటన సంభవించింది. అక్కడి అతి ప్రాచీన మాయోన్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతున్న సమయంలోనే ఆకాశంలో ఆ ఆకుపచ్చని ఉల్క వెలుగులు విరజిమ్ముతూ కిందికి దూసుకురావడం కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ అత్యంత అరుదైన ఖగోళ సంఘటన ఆకాశాన్ని అత్యంత అద్భుతంగా మార్చింది. ఈ కళ్లు చెదిరే దృశ్యాలను సోమవారం రాత్రి 10:33 గంటలకు సమయంలో ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ (ఫివల్క్స్) తమ లిగ్నాన్ హిల్ ఐపీ కెమెరా ద్వారా రికార్డు చేసింది.

ఫివల్క్స్ విడుదల చేసిన ఫుటేజీలో.. ఆ ప్రకాశవంతమైన ఉల్క.. ఫిలిప్పీన్స్ లోని అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాలలో ఒకటైన మాయోన్ ఉత్తర వైపు ఉన్న ఏటవాలు మీదుగా కిందికి దిగుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. మొదట ఈ ఉల్క అగ్నిపర్వతాన్ని ఢీకొట్టిందని భావించారు. దాని తర్వాతే పేలుడు మరింత తీవ్రమైందని అనుకున్నారు. ఆ ఇన్‌ఫ్రాసౌండ్, వీడియో డేటాను విశ్లేషించింది ఫివల్క్స్. అది భూమిని చేరకముందే వాతావరణంలో విడిపోయిందని ధృవీకరించింది.
మాయోన్.. మోస్ట్ ట్రయాంగులర్ వాల్కనో. ఇది ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాలలో ఒకటి. రాజధాని మనీలాకు ఆగ్నేయంగా దాదాపు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మాయోన్ వాల్కనో ఫిలిప్పీన్స్ లోని 24 చురుకైన అగ్నిపర్వతాలలో అత్యంత అస్థిరమైనది, ప్రమాదకరమైనది కూడా. ఎప్పుడు పేలుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక అగ్నిపర్వత విస్ఫోటనం, అదే సమయంలో సంబవించిన ఖగోళ సంఘటన వీక్షకులను కనువిందు చేసింది.
దీన్ని నిజమైన ఆర్మగెడాన్ చూసినంత అనుభూతిని ఇస్తుందని అభివర్ణించారు నెటిజన్లు. ఒక అగ్నిపర్వతం పేలుతున్నప్పుడు ఉల్క రాలడం అనేది దాదాపుగా సాధ్యం కాదని, ప్రకృతి తన శక్తిని నిరూపించుకుందని వ్యాఖ్యానిస్తోన్నారు. ఈ నెలా ప్రారంభంలో మాయోన్ అగ్నిపర్వతం నుండి భారీగా బూడిద వెలువడటం ఆరంభమైంది. సోమవారం సాయంత్రం అది పెల్లుబికింది. దీంతో 300కు పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు. అగ్నిపర్వతం వాలు నుండి జాలువారుతున్న లావా నిక్షేపాలు ఫైరోక్లాస్టిక్ ప్రవాహంగా మారడం ఈ వీడియోలో చూడొచ్చు.
WATCH: A meteor streaked into Mayon Volcano in the Philippines as the volcano was erupting. pic.twitter.com/2ogffx3oAn
— Breaking911 (@Breaking911) May 25, 2026
జనవరి నుంచి ఈ మాయోన్ అగ్నిపర్వతం చురుగ్గా ఉంటోంది. తేలికపాటి విస్ఫోటనాలు వరుసగా సంభవిస్తూ వచ్చాయి. ఈ విస్ఫోటనాల వల్ల పెద్ద పెద్ద రాళ్లు కిందకు రాలడం, ప్రాణాంతక పైరోక్లాస్టిక్ ప్రవాహాలు చోటు చేసుకున్నాయి. లావా ప్రవాహాలు, రాళ్ల పతనం, పైరోక్లాస్టిక్ ప్రవాహాలు, ఆకస్మిక పేలుడు కార్యకలాపాల వల్ల కలిగే నష్టాల దృష్ట్యా ఆరు కిలోమీటర్ల వరకు గల ప్రాంతాన్ని ప్రమాదకర జోన్ గా ప్రకటించారు.












Click it and Unblock the Notifications