వార్నీ.. రూ. 1,34,166 ల ఫోన్ కనిపెట్టిన BSNL: ఏం చేయనీకి
బీఎస్ఎన్ఎల్ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఒక శాటిలైట్ ఫోన్‌ను తీసుకువచ్చింది. మొబైల్ నెట్‌వర్క్ అస్సలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా నిరంతరాయంగా కనెక్టివిటీని అందించడానికి ఈ ఫోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ధర.. 1,34,166 రూపాయలు. సాధారణ మొబైల్ ఫోన్లలాగా దీనిని అందరూ కొనుగోలు చేయలేరు. దీనిని సొంతం చేసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠినమైన అనుమతులు అవసరం.
ఇన్మార్ శాట్ భాగస్వామ్యం..
ప్రముఖ గ్లోబల్ శాటిలైట్ నెట్‌వర్క్ ప్రొవైడర్ ఇన్మార్ శాట్ (Inmarsat) భాగస్వామ్యంతో బీఎస్ఎన్ఎల్ ఈ అధునాతన హ్యాండ్‌సెట్‌ను అభివృద్ధి చేసింది. దేశంలో సాధారణ పౌరులు శాటిలైట్ ఫోన్లను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారు కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతి లేనిదే ఏ సాధారణ వ్యక్తి కూడా ఈ శాటిలైట్ ఫోన్‌ను కొనుగోలు చేయలేరు.

ఈ శాటిలైట్ ఫోన్ ఫీచర్లు ఇవే..
విపత్కర పరిస్థితుల్లో సైతం అత్యంత స్పష్టమైన వాయిస్ కాల్స్ మాట్లాడేందుకు వీలుగా ఈ శాటిలైట్ ఫోన్ రగ్గడ్, డ్యూరబుల్ డిజైన్‌తో రూపొందించారు. కిందపడ్డా పగిలిపోదు. దీని బ్యాటరీ రీఛార్జ్ సుదీర్ఘ కాలం అందుబాటులో ఉంటుంది. అదే స్థాయిలో బ్యాటరీ లైఫ్ కూడా ఎంతోకాలం మన్నుతుంది. అత్యవసర సమయంలో సహాయం కోసం ఎమర్జెన్సీ అలర్ట్ సపోర్ట్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఈ హ్యాండ్ సెట్ లో ఉన్నాయి.
సిగ్నల్స్ లేకపోయినా..
దీన్ని ప్రధానంగా దేశీయ రక్షణ సంస్థలు, సముద్రయానం చేసేవాళ్లు, నౌకాదళం, విపత్తు నిర్వహణ బృందాలు, గనులు, మారుమూల అడవులలో పరిశోధనలు జరిపే వారు ఉపయోగిస్తారు. శాటిలైట్ ఫోన్ సాధారణ మొబైల్ టవర్ల సాయంతో కాకుండా నేరుగా ఉపగ్రహాల ద్వారా సిగ్నల్ ను స్వీకరిస్తుంది. ఫలితంగా ప్రయాణ సమయంలో సిగ్నల్ అందుబాటులో లేకపోవడం వంటి ఇబ్బందులు ఉండవు. విపత్తుల సమయంలో మొబైల్ టవర్లు కూలిపోయినా ఈ శాటిలైట్ ఫోన్ ద్వారా కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది.
అందరూ కొనలేరు..
శాటిలైట్ ఫోన్లు అత్యంత ఉపయోగకరమే అయినప్పటికీ కొన్ని పరిమితుల వల్ల ఇవి సాధారణ ప్రజలకు అంతగా చేరువ కాలేదు. ఉపగ్రహానికి నేరుగా సిగ్నల్ పంపే ప్రక్రియ వల్ల మనం మాట్లాడే మాటలు అవతలి వారికి చేరడానికి కొంత సమయం పడుతుంది. దీనినే 'కాల్ లాగ్' అంటారు. దీనితో పాటు ఈ ఫోన్ ద్వారా మాట్లాడే ప్రతి కాల్ కూడా అత్యంత ఖరీదైనది. ఒక్క నిమిషం కాల్ మాట్లాడటానికి దాదాపు 100 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.
డాక్యుమెంట్స్ అవసరం..
చూడ్డానికి కూడా ఈ ఫోన్లు సాధారణ స్మార్ట్‌ఫోన్ల కంటే చాలా బరువు, కొంత భారీ పరిమాణంలో ఉంటాయి. నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని అనుమతి పత్రాలు ఉన్నవారు తమ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని సందర్శించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అత్యవసర సమాచార వ్యవస్థ, జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు టెలికాం మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications