ChatGPT Health : మీ ఆరోగ్యం ఇక ఏఐ చేతిలో గోప్యంగా.
ఏఐ రాకతో టెక్నాలజీ రోజురోజుకీ మన జీవితాన్ని మరింత సులభంగా మారుస్తోంది. ఆ దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు పరిచయమైన ఛాట్ జీపీటీ (ChatGPT) ఇప్పుడు 'హెల్త్' ఫీచర్‌తో ముందుకొచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు సాధారణ ఆరోగ్య సందేహాలకు సమాధానాలు తెలుసుకునేలా ఈ కొత్త ఫీచర్ రూపొందించబడింది. దీంతో డిజిటల్ హెల్త్ కేర్‌కు కొత్త నిర్వచనం దక్కినట్టైంది.
ఆరోగ్య సమాచారాన్ని వెతకడానికి గూగుల్ పేజీలు తిప్పాల్సిన అవసరం లేకుండా, ఒకే చోట విశ్వసనీయ సమాచారాన్ని అందించే దిశగా OpenAI కీలక అడుగు వేసింది. తాజాగా 'ChatGPT Health' అనే ప్రత్యేక హెల్త్ ట్యాబ్‌ను ప్రారంభించింది. సాధారణ ఆరోగ్య సందేహాల నుంచి వెల్నెస్, ఫిట్‌నెస్, మెడికల్ రిపోర్టుల వరకు వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందించడమే ఈ ఫీచర్ ప్రధాన లక్ష్యం.

ఈ కొత్త ట్యాబ్ ద్వారా యూజర్లు తమ ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలను అడగొచ్చు. ఇందులో హైలెట్ ఎంటంటే.. ప్రైవసీ. ముఖ్యంగా డైట్, నిద్ర, వ్యాయామం, జీవనశైలి మార్పులు, ల్యాబ్ టెస్ట్ రిపోర్టుల అర్థం వంటి అంశాలపై ChatGPT సులభమైన భాషలో వివరణ ఇస్తుంది. అంతేకాదు, డాక్టర్‌ను కలవడానికి ముందు ఏ ప్రశ్నలు అడగాలి, ఏ పరీక్షలు అవసరం కావచ్చు అనే దిశగా ముందస్తు గైడెన్స్ కూడా అందిస్తుంది.
యాపిల్ హెల్త్ (Apple Health) వంటి వెల్నెస్ యాప్స్‌తో ChatGPT Health ఇంటిగ్రేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. యూజర్ అనుమతితో.. నడక, నిద్ర, హార్ట్ రేట్, క్యాలరీ బర్న్ వంటి డేటాను విశ్లేషించి వ్యక్తిగతంగా ఉపయోగపడే వెల్నెస్ సూచనలు ఇవ్వగలదు. అయితే ఇది పూర్తిగా యూజర్ కంట్రోల్‌లోనే ఉంటుంది. పర్మిషన్స్ లేకుండా ఎలాంటి డేటా ఉపయోగించబడదు.
OpenAI స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే ... ChatGPT Health డాక్టర్‌కు ప్రత్యామ్నాయం కాదు. ఇది ఎలాంటి డయాగ్నోసిస్ లేదా ట్రీట్‌మెంట్ నిర్ణయాలు తీసుకోదు. కేవలం ఆరోగ్య సమాచారాన్ని అర్థమయ్యేలా వివరించడం, అవగాహన పెంచడం మాత్రమే దీని పాత్ర. అత్యవసర పరిస్థితుల్లో లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో వైద్యులను సంప్రదించాల్సిందేనని OpenAI హెచ్చరిస్తోంది.
ప్రైవసీ విషయంలో కూడా కఠినమైన భద్రతా ప్రమాణాలను అమలు చేస్తున్నట్లు OpenAI వెల్లడించింది. హెల్త్ ట్యాబ్‌లో ఇచ్చే డేటా ఇతర చాట్స్‌కు వేరుగా నిల్వ ఉంటుంది. ఈ సమాచారం AI మోడల్ ట్రైనింగ్‌కు వాడబోమని స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్ది దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, త్వరలో భారత్ సహా మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications