కోవిడ్ కంటే మహా డేంజర్: చైనాలో కొత్త వైరస్
New Virus in China: సుమారు మూడు సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్నీ గడగడలాడించిన ప్రాణాంతక కరోనా వైరస్‌కు జన్మనిచ్చిన చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. కోవిడ్ కంటే మహా ప్రమాదకరమైన వైరస్ ఇది. ల్యాబొరేటరీలో చైనా సైంటిస్టులు తమ స్వహస్తాలతో దీనికి ప్రాణం పోయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది.
దీని పేరు- వెసిక్యులర్ స్టొమాటైటిస్ వైరస్. హెబెయ్ మెడికల్ యూనివర్శిటీ సైంటిస్టులు దీన్ని సృష్టించారు. ఇదొక సింథటిక్ వైరస్. శరీరంలోకి ప్రవేశించిన మూడు రోజుల్లోనే ప్రాణాలను తినేస్తుంది ఈ క్రిమి. గతంలో ఆఫ్రికన్ దేశాలను వణికించిన ఎబోలా వైరస్‌ను పోలి ఉంటుంది. దాని జన్యుక్రమాన్ని అంచనా వేయడంలో భాగంగా దీనికి ప్రాణం పోశారు.

ఎబోలా వైరస్‌లో ఉండే గ్లైకొప్రొటీన్‌ను ఉపయోగించిన వెసిక్యులర్ స్టొమాటైటిస్‌ను కనుగొన్నారు. మనిషి శరీరంలో ప్రవేశించిన తరువాత కణాల వ్యవస్థను ఇది ధ్వసం చేసి పడేస్తుంది. దాదాపుగా అవయవాలన్నింటికీ సోకుతుంది. వాటి పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా 72 గంటల్లో ప్రాణం పోయేలా చేయగలుగుతుంది.
ఈ వైరస్‌ను తొలుత 10 సిరియన్ హ్యామ్‌స్టర్స్ అంటే చిట్టెలుకలపై ప్రయోగించారు. ఇందులో అయిదు చొప్పున మగ, ఆడ చిట్టెలుకలు ఉన్నాయి. ఈ వైరస్‌ను వాటిల్లో ఇంజెక్ట్ చేసిన వెంటనే అవన్నీ కూడా దశలవారీగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్‌కు గురయ్యాయి. మూడు రోజుల్లో మరణించాయి.
ఎబోలా వైరస్ సోకిన మనిషి.. ఎలాంటి అనారోగ్యానికి గురవుతాడు? దాన్ని నివారించడానికి ఎలాంటి మెడిసిన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది? అనే విషయంపై చేసిన ప్రయోగంలో భాగంగా వెసిక్యులర్ స్టొమాటైటిస్‌ను సృష్టించాల్సి వచ్చిందని సైన్స్ డైరెక్ట్ మేగజైన్ వెల్లడించింది.
ఎబోలా వైరస్ కూడా ఇంతే. దీని పనితీరును ఖచ్చితంగా అధ్యయనం చేయడానికి, విరుగుడుగా యాంటీ వైరస్‌ను తయారు చేయాలనే ఉద్దేశంతో హెబే మెడికల్ యూనివర్శిటీ సైంటిస్టులు ఈ కొత్త వైరస్‌ను సృష్టించారు. ఇది గనక బయటికి వస్తే కరోనా కంటే కూడా అత్యంత ప్రమాదకరంగా మారుతుందని సైన్స్ డైరెక్ట్ అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications