స్కైఫాల్..: మార్స్ పైకి న్యూక్ రియాక్టర్- నాసా బిగ్ ప్లాన్: గేమ్ ఛేంజర్
అంతరిక్ష పరిశోధనల్లో నూతన ప్రయోగానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా సిద్ధపడుతోంది. సూర్యుడి కాంతి ప్రసరించని సుదూర అంతరిక్షంలో ప్రయాణించడానికి వీలుగా అణుశక్తి ఆధారంగా పనిచేసే ఓ స్పేస్ క్రాఫ్ట్ ను రూపొందించే పనిలో పడింది. ఈ ప్రాజెక్ట్ కు స్పేస్ రియాక్టర్-1 ఫ్రీడమ్ అని నామకరణం సైతం చేసింది. ఈ వ్యోమనౌకను 2028 చివరి నాటికి అంగారక గ్రహం కక్ష్యలో ప్రవేశపెట్టాలనేది నాసా ప్లాన్. దీని వెంట స్కైఫాల్ అనే పేలోడ్ ను పంపిస్తుంది.
ఈ వ్యోమనౌక అంగారక గ్రహంపై నేరుగా ల్యాండ్ అవ్వదు. ల్యాండింగ్ సంక్లిష్టం కావడం వల్ల దీనిని కేవలం గ్రహం మీదుగా దూసుకుపోయే ఫ్లైబై తరహాలో ఈ డిజైన్ చేస్తోంది. సరిగ్గా 2029లో అంగారకుడి సమీపానికి చేరుకోగానే.. స్కైఫాల్ పేలోడ్‌ను అక్కడి వాతావరణంలోకి ప్రవేశపెడుతుంది. ఈ పేలోడ్‌లో కూడా మూడు చిన్న హెలికాప్టర్లు ఉంటాయి. ఇవి అంగారకుడి వాతావరణాన్ని పరిశోధిస్తాయి. మార్స్ హెలికాప్టర్ ఇంజెన్యూటి మాదిరిగా ఈ మూడింటినీ డిజైన్ చేసింది నాసా.

భూమిపై అణు విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతికత ఆధారంగానే ఈ ఫ్రీడమ్ స్పేస్ క్రాఫ్ట్ కూడా పనిచేస్తుంది. ఇందులోని రియాక్టర్‌లో యురేనియం అణువులను విచ్ఛిన్నం చేయడం ద్వారా అత్యంత వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడిని తదుపరి దశలో విద్యుత్ శక్తిగా మారుస్తారు. రియాక్టర్ నుంచి 20 కిలోవాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు. స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ కు ఇదే ప్రధాన ఆధారంగా మారుతుంది.
సుదూర అంతరిక్ష ప్రయాణాల కోసం సోలార్ ప్యానెల్స్ పెద్దగా ఉపయోగపడవు. గ్రహాల దూరం పెరిగేకొద్దీ సూర్యకాంతి తీవ్రత క్రమంగా తగ్గుతుంటుంది. ఈ నేపథ్యంలో మార్స్, జుపిటర్ వంటి గ్రహాలను దాటి వెళ్లే పరిశోధనల కోసం అణు సాంకేతికత అత్యంత అనువైనదిగా భావిస్తోంది నాసా. అణుశక్తి ఆధారిత ప్రొపల్షన్ వ్యవస్థల ద్వారా వ్యోమనౌకలను సుదీర్ఘ కాలం పాటు వేగంగా, ఎక్కువ బరువున్న శాస్త్రీయ పరికరాలతో అంతరిక్షంలోకి సులభంగా పంపే వీలుంటుంది చెబుతోంది.
స్కైఫాల్ పేలోడ్ ద్వారా అంగారకుడిపైకి పంపే మూడు హెలికాప్టర్లు ఫొటోలను తీయడానికే పరిమితం కాకుండా, భవిష్యత్ ప్రయోగాలకు అవసరమైన వనరులను నిశితంగా అన్వేషిస్తాయి. వీటిల్లి ఉండే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ద్వారా అంగారకుడి ఉపరితలం క్రింద శతాబ్దాలుగా దాగి ఉన్న మంచు నిల్వలను గుర్తించడానికి, వాటి లోతును అంచనా వేయవచ్చు.
భూమితో పోల్చుకుంటే అంగారక గ్రహంపై వాతావరణ పీడనం ఒక శాతం మాత్రమే. ఇలాంటి వాతావరణంలో హెలికాప్టర్ రెక్కలు తిరగడం అనేది సవాల్ తో కూడుకున్నది. ఈ అడ్డంకులను అధిగమిస్తూ భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలకు అనువైన ల్యాండింగ్ ప్రాంతాలను అన్వేషించడంలో ఈ రోబోటిక్ హెలికాప్టర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అక్కడ లభించే మంచు నిల్వల ద్వారా భవిష్యత్ లో అంగారకగ్రహాన్ని ఆవాస యోగ్యంగా మార్చుకోవచ్చా లేదా అనే విషయంపై నాసా ప్రయోగాలు చేయనుంది.














Click it and Unblock the Notifications