Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రుడి చుట్టూ 10 రోజుల, నలుగురు వ్యోమగాముల సాహసం

మళ్లీ చంద్రుడి వైపు మనిషిని పంపే దిశగా NASA మరో కీలక అడుగు వేసింది. ఆర్టెమిస్-2 (Artemis 2) మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లే భారీ స్పేస్ లాంచ్ సిస్టమ్‌ (SLS) రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా, రాకెట్ ప్రధాన దశను NASA ఇంజనీర్లు తాజాగా పవర్‌ ఆన్ చేశారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో ఉన్న లాంచ్ ప్యాడ్‌ 39B వద్ద ఈ కీలక దశను పూర్తి చేశారు.

ఈ రాకెట్‌కు జరగనున్న ముఖ్యమైన ఇంధన పరీక్షలో విజయం సాధిస్తేనే, ఈ నెలాఖరులో ఆర్టెమిస్-2 ప్రయోగం సాధ్యమవుతుంది. సోమవారం, ఫిబ్రవరి 2న జరగనున్న ఈ పరీక్ష NASAకు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇంధన పరీక్షకు ముందుగా 49 గంటల కౌంట్‌డౌన్‌ను NASA శనివారం రాత్రి 8:13 గంటలకు (EST) ప్రారంభించింది. ఈ అనుకరణ ప్రయోగ ప్రక్రియ సోమవారం రాత్రి 9 గంటలకు పూర్తవుతుంది. అన్ని దశలు విజయవంతమైతే, ఫిబ్రవరి 8 నాటికి ఆర్టెమిస్-2 మిషన్‌ను ప్రయోగించేందుకు NASA సిద్ధమవుతుంది.

NASA Artemis 2 Moon Mission Nears Launch After SLS Rocket Power-On and Crucial Fuel Test Update Live

కీలక మైలురాళ్లు..

NASA తెలిపిన వివరాల ప్రకారం, ముందుగా రాకెట్ రెండో దశకు పవర్‌ అందించగా, ఆ తర్వాత 322 అడుగుల ఎత్తు కలిగిన SLS రాకెట్ భారీ కోర్‌ స్టేజ్‌ను ఆన్ చేశారు. కౌంట్‌డౌన్ ట్యాంకింగ్ దశలో భాగంగా, ఈ రాకెట్‌లో 7 లక్షల గ్యాలన్లకు పైగా ద్రవ ఆక్సిజన్‌, ద్రవ హైడ్రోజన్‌ను నింపనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం అనేక దశల్లో జరుగుతుంది. ట్యాంకులను నింపడం, తిరిగి నింపడం, వ్యవస్థల పనితీరును పరిశీలించడం వంటి కీలక మైలురాళ్లు ఇందులో ఉంటాయి. తాత్కాలిక క్రయోజెనిక్ ప్రొపల్షన్ స్టేజ్‌ను కూడా రాత్రిపూట పవర్‌ ఆన్ చేసినట్లు NASA వెల్లడించింది.

వెట్ డ్రెస్ రిహార్సల్...

ఫ్లోరిడాలో చలికాలం తీవ్రంగా ఉండటంతో, ఓరియన్ అంతరిక్ష నౌక గత కొన్ని రోజులుగా నిరంతరం పవర్‌లోనే ఉంది. ఇంజనీర్లు ఇప్పటికే ఓరియన్ ఫ్లైట్ బ్యాటరీలను ఛార్జ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో రాకెట్ కోర్ స్టేజ్ బ్యాటరీలను కూడా ఛార్జ్ చేయనున్నట్లు NASA తెలిపింది. ఈ ఇంధన పరీక్షను NASA "వెట్ డ్రెస్ రిహార్సల్"గా పిలుస్తోంది. ఇది ఫిబ్రవరి 3 తెల్లవారుజామున 1 గంట వరకు కొనసాగుతుంది. ఈ పరీక్షలో కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ బృందంతో పాటు, హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో ఉన్న మిషన్ కంట్రోల్ సహా ఇతర NASA కేంద్రాల బృందాలు పాల్గొంటాయి.

సుమారు 10 రోజుల పాటు..

ఈ సమయంలో రాకెట్ ట్యాంకుల్లో క్రయోజెనిక్ ఇంధనం నింపడం, ప్రయోగ కౌంట్‌డౌన్‌ను నిర్వహించడం, అవసరమైతే కౌంట్‌డౌన్‌ను మళ్లీ ప్రారంభించే సామర్థ్యాన్ని పరీక్షించడం, అలాగే ప్రయోగం రద్దు అయిన పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలను కూడా అభ్యసిస్తారు. ఈ దశలన్నీ ప్రయోగ దినానికి బృందం పూర్తిగా సిద్ధంగా ఉండేందుకు దోహదపడతాయని NASA స్పష్టం చేసింది. ఆర్టెమిస్-2 మిషన్ మొత్తం సుమారు 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ మిషన్‌లో నలుగురు వ్యోమగాములు NASA యొక్క భారీ SLS మెగారాకెట్‌పై ఉన్న ఓరియన్ అంతరిక్ష నౌకలో చంద్రుడి చుట్టూ ప్రయాణం చేయనున్నారు. ఇది అపోలో కార్యక్రమం తర్వాత మనుషులతో చంద్రుడి దిశగా జరగనున్న అత్యంత ముఖ్యమైన ప్రయాణంగా భావిస్తున్నారు.

గడ్డకట్టే ఉష్ణోగ్రతలు..

ప్రస్తుతం ఆర్టెమిస్-2 ప్రయోగ విండో ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు ఉంది. అవసరమైతే మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా ప్రత్యామ్నాయ తేదీలు అందుబాటులో ఉన్నాయి. అయితే తుది ప్రయోగ తేదీ పూర్తిగా ఈ ఇంధన పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి ఈ వెట్ డ్రెస్ రిహార్సల్‌ను తొలుత ఫిబ్రవరి 2కు ప్లాన్ చేయగా, ఆ తర్వాత జనవరి 31కి మార్చారు. అయితే కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు నమోదవడంతో మళ్లీ ఫిబ్రవరి 2కు వాయిదా వేశారు.

వ్యోమగాములు వీరే..

ఆర్టెమిస్-2 ఫిబ్రవరి 8న ప్రయోగమైతే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సిన NASA క్రూ-12 మిషన్ షెడ్యూల్‌పై కూడా ప్రభావం పడనుంది. క్రూ-12లో NASA వ్యోమగాములు జెస్సికా మీర్, జాక్ హాతవే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన సోఫీ అడినోట్‌, రోస్కోస్మోస్ వ్యోమగామి అండ్రేయ్ ఫెడ్యాయెవ్ ఉన్నారు. ఆర్టెమిస్-2 నిర్ణీత సమయంలో ప్రయోగమైతే, క్రూ-12 మిషన్‌ను ఫిబ్రవరి 19 వరకు వాయిదా వేయనున్నట్లు NASA అధికారులు తెలిపారు. ఆర్టెమిస్-2 వ్యోమగాములు తమ 10 రోజుల చంద్ర మిషన్ ముగించుకుని భూమికి తిరిగొచ్చిన తర్వాతే క్రూ-12 ప్రయోగం జరుగుతుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం NASA లక్ష్యం ఒక్కటే..ఇంధన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి, ఫిబ్రవరి 8న చంద్రుడి దిశగా మానవ యాత్రకు మరో చారిత్రక అధ్యాయాన్ని లిఖించడం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+